
ఇటువంటి కష్టకాలంలోనే తెలంగాణతో కీచులాటలు అక్కరకు వస్తుంటాయి. ఆంధ్రా ప్రజల దృష్టిని ఈ వాలంటీర్ల మీద నుంచి బహుశః మళ్లించేందుకేనేమో, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఈరోజు మీడియాతో మాట్లాడుతూ,“దేశంలోకే అత్యుత్తమ విద్యావ్యవస్థ మన ఏపీలో ఉంది. తెలంగాణ విద్యావ్యవస్థతో మన ఏపీ విద్యావ్యవస్థను పోల్చి చూడటం సరికాదు కానీ చూస్తే తెలంగాణ ప్రభుత్వం కనీసం టిఎస్పీఎస్సీని సక్రమంగా నిర్వహించలేని దుస్థితిలో ఉంది.
అక్కడ పరీక్షలకు ముందు ప్రశ్నాపత్రాల లీక్ అవుతుండటం, పరీక్షలలో విద్యార్థులు కాపీలు కొట్టడం వంటివి తరచూ జరుగుతుంటాయి. టిఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్స్ స్కామ్ గురించి అందరూ చూశారు. నేటికీ ఆ కేసుపై దర్యాప్తు జరుగుతూనే ఉంది. అనేక మంది అరెస్ట్ అవుతూనే ఉన్నారు.
తెలంగాణ ప్రభుత్వం కనీసం ఉపాధ్యాయులను కూడా బదిలీలు చేసుకోలేకపోతోంది. తెలంగాణతో పోలిస్తే ఏపీలో విద్యావ్యవస్థ చాలా అద్భుతంగా ఉంది. మన విద్యా వ్యవస్థ యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. అందుకే యావత్ దేశం మన విద్యావ్యవస్థను ఆదర్శంగా తీసుకొంటోంది,” అని అన్నారు.
ఊహించినట్లే అటువైపు నుంచి తెలంగాణ మంత్రులు ఇంకా ఘాటుగా స్పందిస్తూ, ఏపీలో పరిస్థితులు, వైసీపీ పాలన గురించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ ఇద్దరూ స్పందిస్తూ, “ఏపీలో వైసీపీ పాలన ఎంత గొప్పగా ఉందో అందరూ చూస్తూనే ఉన్నారు. దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ మాత్రమే. రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్ళు అయినా ఇంతవరకు రాజధాని ఏర్పాటు చేసుకోలేదు. పోటీ పరీక్షలలో ఏపీ రాజధాని ఏది? అని ప్రశ్నిస్తే ఏమని జవాబు చెప్పాలో కూడా తెలియదు.
ఏపీలో గుంతలు పడిన రోడ్లు, విద్యుత్ కోతలు, నిరుద్యోగం తప్ప ఏమున్నాయి? ఏపీ మంత్రులెవరికైనా ఆరోగ్య సమస్య వస్తే హైదరాబాద్ పరిగెత్తుకు వస్తుంటారు… దేనికి? అక్కడ ఏపీలో మీ ప్రభుత్వం సరైన హాస్పిటల్స్ నిర్మించునందునే కదా? ఏపీ నుంచి లక్షలాది మంది నిరుద్యోగులు తెలంగాణకు వస్తే వారందరికీ మేమే ఇక్కడ ఉద్యోగాలు కల్పిస్తున్నాము. వాళ్ళందరూ ఏపీని కాదని తెలంగాణకు ఎందుకు వస్తున్నారు? అక్కడ పరిశ్రమలు, ఐటి కంపెనీలు లేనందున ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లేవనే కదా?
ఏపీని కించపరచాలని మా ఉద్దేశ్యం కాదు. కానీ మీ వైసీపీ ప్రభుత్వం ఎంత గొప్పగా పనిచేస్తోందో వివరించడానికే ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది.
అసలు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు విడిపోవడానికి బొత్స సత్యనారాయణ వంటి స్వార్ధ రాజకీయ నాయకులే కారణం కాదా? వారు సమైక్య రాష్ట్రంలో తెలంగాణను దోచుకొని తిన్న మాట వాస్తవం కాదా? లాడ్జీలలో గదులు డబ్బు కట్టలతో నింపేసి పట్టుకుపోయేవారు కదా?
మీ రాష్ట్రంలో ప్రతిపక్షాలతో మీకు ఏవైనా రాజకీయ సమస్యలు ఉంటే వారితో తేల్చుకోండి అంతే కానీ తెలంగాణ గురించి అవాకులు చావకులు వాగితే ఊరుకోము.
మేము మీ జోలికి రాము. మీరు మాజోలికి రావొద్దు. మమ్మల్ని రెచ్చగొట్టి మా చేత ఇటువంటి మాటలనిపించుకోవద్దు. బొత్స సత్యనారాయణను మంత్రి వర్గం నుంచి తక్షణం తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఆయన మా ప్రభుత్వానికి క్షమాపణ చెప్పిన తర్వాతే మళ్ళీ హైదరాబాద్లో అడుగుపెట్టాలని సూచిస్తున్నాము,” అంటూ ఘాటుగా తిప్పి కొట్టారు.
పవన్ కళ్యాణ్ చేస్తున్న ఆరోపణల కంటే తెలంగాణ మంత్రులు వేసిన ఈ వాతలే ఎక్కువ నొప్పిగా ఉంటాయని వేరే చెప్పక్కరలేదు. కానీ ఏపీలో ప్రజల దృష్టిని మళ్ళించి, వాలంటీర్ వ్యవస్థని కాపాడుకోవడం కోసం అవసరమైతే తెలంగాణ ప్రభుత్వం మీద మరో రెండు రాళ్ళు వేసి మళ్ళీ తిట్టించుకోవలసిందే. ఈ మాత్రం నొప్పి భరించాల్సిందే…. తప్పదు!
Kiran Abbavaram, who has acted in several successful films, is making his directorial debut with…
Nagarjuna has decided to present the film Itllu Arjuna under his Annapurna Studios banner after…