
అతి చిన్న వయస్సులో మహిళా ఎమ్మెల్యే గా ఎంపికైన లాస్య నందిత ఈ రోజు ఉదయం కారు ప్రమాదంలో కన్ను మూసిన సంగతి తెలిసిందే. అయితే హైద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి మొన్న 2023 నవంబర్ లో జరిగిన ఎన్నికలలో విజయం సాధించిన లాస్య మృతి పట్ల అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి ఆమె కుటుంబానికి సానుభూతి తెలియచేసారు.
బిఆర్ఎస్ పార్టీ లో కారు గుర్తు పై తన రాజకీయ జీవితాన్ని ఆరంభించిన లాస్య అదే కారు ప్రమాదంలో మరణించడం అత్యంత భాదకరం. మొన్న కేసీఆర్ నల్గొండలో నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన లాస్య తిరిగి స్వస్థలానికి వస్తుండగా కారు ప్రమాదం జరిగింది. అయితే ఆ ప్రమాదంలో క్షేమంగా బయటపడిన లాస్య ఈ సారి విధి రాత నుంచి తప్పించుకోలేకపోయారు.
గత ఏడాది ఫిబ్రవరీలో తండ్రి సాయన్నను కోల్పోయిన లాస్య ఈ ఏడాది ఫిబ్రవరీలో తన ప్రాణాలను కోల్పోవడంతో కుటుంబ సభ్యుల ఆక్రందనలు మిన్నంటుతున్నాయి. వీరి బాధను ఓదార్చడానికి బిఆర్ఎస్ పార్టీ తరుపున స్వయంగా ఆ పార్టీ అధినేత కేసీఆర్, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ వెళ్లారు.
అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా లాస్య స్వగృహానికి వెళ్ళి ఆమె భౌతికకాయానికి నివాళుర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. రేవంత్ తో పాటుగా మంత్రులు, ప్రభుత్వ పెద్దలు ఈ కార్యక్రమానికి హాజరయ్యి లాస్య కుటుంబానికి భరోసాగా నిలబడ్డారు. సీటు బెల్టు పెట్టుకోక పోవడంతోనే ఈ ప్రమాదంలో లాస్య ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.
అతివేగం ఎప్పటికి ప్రమాదకరమే. అలాగే ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, హెల్మెట్, సీటుబెల్టు వంటి జాగ్రత్తలు పాటిస్తే కనీసం ప్రమాదాలను నివారించలేక పోయినా వాటి నుండి ప్రాణాలను కాపాడుకోగలుగుతారని ఇప్పటికైనా వాహనదారులు గ్రహించాలి. లేకపోతే తనతో పాటు తన కుటుంబాన్ని అనాధగా మార్చిన వారవుతారు.
ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉండి చేసిన చిన్న పొరపాటు వలన తన జీవితాన్నే కోల్పోవాల్సి వచ్చింది లాస్య. ఇలా ఎంతమంది ప్రాణాలు బలికొనాలో ఒక్కసారి ఆలోచించండి. ప్రమాదాలు జరిగినప్పుడు మాట్లాడుకోవడం ఆ తరువాత కామ్ అయిపోవడం మానవ తప్పిదమే అవుతుంది. ఒక నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణం ఎప్పటికి కాకూడదు.
Ram Charan is reportedly giving Sukumar complete freedom to shape their next collaboration, tentatively titled…
Sambarala Yeti Gattu, the upcoming period action drama starring Sai Durgha Tej, has released its…