
చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా ప్రకటించి ఉత్తరాంధ్ర జిల్లాలకు అన్యాయం చేశారని మంత్రి ధర్మాన ప్రసాదరావు వాదిస్తుంటారు.
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఆయన సామాజిక సాధికార యాత్ర చేస్తున్నప్పుడు మరో కొత్త విషయం చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా విశాఖ రాజధానిగా ఉంటే మంచిదని సూచించినా చంద్రబాబు నాయుడు పట్టించుకోకుండా అమరావతిని రాజధానిగా నిర్ణయించేశారని ధర్మాన ఆరోపించారు.
నేటికీ టిడిపి నేతలు విశాఖ రాజధాని చేయకుండా అడ్డుపడుతూ ఉత్తరాంధ్రా జిల్లాల అభివృద్ధిని అడ్డుకొంటున్నారని ఆరోపించారు. కానీ సిఎం జగన్ విశాఖను రాజధానిగా చేసి ఉత్తరాంధ్రా జిల్లాలను అభివృద్ధి చేయాలని చాలా పట్టుదలగా ఉన్నారని మంత్రి ధర్మాన చెప్పారు.
ఒకవేళ కేంద్రం అమరావతిని రాజధానిగా అంగీకరించకపోయుంటే, ఆనాడు ప్రధాని నరేంద్రమోడీ అమరావతి భూమిపూజలో పాల్గొనేవారే కాదు కదా?అమరావతి అభివృద్ధికి అని విదాలా సహకరిస్తామని హామీ ఇచ్చేవారే కాదు కదా?అమరావతి నిర్మాణం కోసం నిధులు విడుదల చేసేవారే కాదు కదా?ఏపీ బీజేపీ తమ పార్టీ అమరావతి రాజధానికి కట్టుబడి ఉందని చెపుతోందంటే అర్దం ఏమిటి?
అమరావతి రాజధానిగా జగన్మోహన్ రెడ్డి కూడా ఒప్పుకొన్నారు కదా?అయినా విశాఖను రాజధానిగా చేయకపోతే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను ప్రభుత్వం అభివృద్ధి చేయకూడదా?విశాఖను రాజధాని చేయమని వైసీపి నేతలు తప్ప ఉత్తరాంధ్రా జిల్లాల ప్రజలు, కనీసం విశాఖ నగర ప్రజలైనా అడుగుతున్నారా?అనే ప్రశ్నలకు మంత్రి ధర్మాన సమాధానం చెపితే బాగుంటుంది.
నిజానికి మూడు రాజధానుల ప్రతిపాదనపై రాష్ట్ర ప్రజలు విముఖత చూపినందునే, వైసీపి ప్రభుత్వం విశాఖ రాజధాని పల్లవి అందుకొందని అందరికీ తెలుసు. కానీ దానికి విశాఖ రాజధానిపై కూడా నిబద్దత లేదు. ఉండి ఉంటే భారీ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేసి, మోడీ, అమిత్ షాలకు అత్యంత సన్నిహితంగా మెలుగుతున్న జగన్మోహన్ రెడ్డిని టిడిపి, జనసేనలు ఆపగలిగి ఉండేవా?
రాష్ట్రాభివృద్ధికి, ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలవాల్సిన రాజధాని ఏర్పాటుని, కూడా వైసీపి ప్రభుత్వం టిడిపి, జనసేనలను రాజకీయంగా చావుదెబ్బ తీసేందుకు ఓ అస్త్రంగానే ఉపయోగించుకొంటోందని, తమ చేతకానితనాన్ని లేదా వైఫల్యాన్ని టిడిపి, జనసేనల నెత్తిన రుద్ధి తప్పించుకోవాలని ప్రయత్నిస్తోందని మంత్రి ధర్మాన తాజా వ్యాఖ్యలతో మరోసారి స్పష్టమవుతోంది.
కనుక రాష్ట్ర ప్రజలకు అమరావతి కావాలో లేదా వైసీపి నేతలు చెప్పుకొంటున్నట్లు విశాఖ రాజధానిగా కావాలనుకొంటున్నారో త్వరలో జరుగబోయే ఎన్నికలలో ప్రజలే ఎలాగూ తేల్చి చెపుతారు కదా? అంతవరకు వైసీపి ఎన్ని డ్రామాలైనా ఆడుకోవచ్చు.
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…