
ఈరోజు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు 5 శాసనసభ నియోజకవర్గాలలో అభ్యర్ధులను మార్చి వేరేవారికి బీ-ఫారంలు అందజేశారు.
ముందు నుంచి చెప్పుకొంటున్నట్లే పశ్చిమగోదావరి జిల్లా ‘ఉండి’ అభ్యర్ధి మంతెన రామరాజు స్థానంలో రఘురామ కృష్ణరాజుని అభ్యర్ధిగా ప్రకటించి బీఫారం అందించారు. ఇందుకు ప్రతిగా మంతెన రామరాజుని నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం టిడిపి అధ్యక్షుడుగా నియమించారు.
ఇందుకు ఆయన కూడా సమ్మతించి తన సీటుని రఘురామ కృష్ణరాజు కోసం వదులుకున్నారు. ప్రస్తుతం పార్లమెంట్ నియోజకవర్గం టిడిపి అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న మాజీ ఎంపీ తొత సీతారామ లక్ష్మిని పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు.
పాడేరు అభ్యర్ధిగా ప్రకటించిన కిల్లు వెంకట రమేశ్ నాయుడుని స్థానిక టిడిపి నేతలు, కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నందున వారి అభీష్టం ప్రకారం మాజీ ఎమ్మెల్యే గిద్ది ఈశ్వరిని ఖరారు చేసి బీ-ఫారం అందజేశారు.
విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం జనసేనకు కేటాయించడంతో అక్కడ నుంచి పోటీ చేయాలనుకున్న సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తికి మాడుగుల అభ్యర్ధిగా పోటీ చేసేందుకు బీ-ఫారం అందించారు.
మడకశిర నుంచి మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు డాక్టర్ సునీల్ని అభ్యర్ధిగా ప్రకటించినప్పటికీ ఆయన ఎన్నికల ప్రచారంలో బాగా వెనకబడిపోయిన్నట్లు సర్వేలో తెలియడంతో ఆయన స్థానంలో టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజుని ఖరారు చేశారు.
వెంకటగిరిలో వైసీపి అభ్యర్దిగా దివంగత సిఎం నేదురుమిల్లి జనార్ధన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ టిడిపికి గట్టి పోటీ ఇస్తున్నారు. కనుక ముందు ప్రకటించిన కురుగొండ్ల లక్ష్మీప్రియ స్థానంలో ఆమె తండ్రి కురుగొండ్ల రామకృష్ణను అభ్యర్ధిగా ఖరారు చేసి చంద్రబాబు నాయుడు బీ-ఫారం అందజేశారు.
ఈ నెల 25తో నామినేషన్స్ దాఖలుకు గడువు ముగుస్తుంది. టిడిపి అభ్యర్ధులకు నేడు బీ-ఫారంలు కూడా చేతికి వచ్చాయి. కనుక రేపటి నుంచి 25లోగా అందరూ నామినేషన్స్ వేయబోతున్నారు. రఘురామ కృష్ణరాజు రేపు ఉండి టిడిపి అభ్యర్ధిగా నామినేషన్స్ వేయబోతున్నారు.
ఇక తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి సీటుపై నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోబోతోంది. అక్కడి నుంచి టిడిపి అభ్యర్ధిగా నల్లమిల్లి రామకృష్ణా రెడ్డిని ప్రకటించినప్పటికీ పొత్తులో భాగంగా ఆ సీటు బీజేపీకి ఇవ్వాల్సి వచ్చింది. అనపర్తికి శివరామ కృష్ణంరాజుని బీజేపీ అభ్యర్ధిగా ప్రకటించింది. కానీ రామకృష్ణా రెడ్డి స్వయంగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిని కలిసి తాను బీజేపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నానని, కనుక ఆ సీటు తనకే ఇవ్వాల్సిందిగా అభ్యర్ధించారు. రాజమండ్రి నుంచి లోక్సభకు పోటీ చేస్తున్న దగ్గుబాటి పురందేశ్వరికి ఆయన సహాయసహకారాలు చాలా అవసరం కనుక శివరామ కృష్ణంరాజుతో ఆ తర్వాత బీజేపీ అధిష్టానంతో మాట్లాడి అనపర్తి సీటుని నల్లమిల్లికి ఇచేందుకు ఒప్పించిన్నట్లు తెలుస్తోంది.
టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ వార్తను ధృవీకరిస్తూ, నల్లమిల్లిని వదులుకోవడం చాలా బాధ కలుగుతోంది. కానీ ఆయన టిడిపి, జనసేన, బీజేపీ కూటమిలోనే పార్టీ మారి అనపర్తి నుంచి పోటీ చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు.
Aadarsha Kutumbam - AK47 was recently postponed again, and there is still no clarity about…
The USCIS has officially removed the 540-day automatic extension granted to H-4 visa holders with…