
ఎవరైనా మరొకరికి మేలు చేస్తే, ఆ మేలు పొందినవారు దాని గురించి చెప్పుకొంటే చేసినవారికి చాలా గౌరవంగా ఉంటుంది. కానీ ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రతీ బటన్ నొక్కుడు సభలో ‘నేను మీకు మహోపకారం చేస్తున్నాను. కనుక చేసిన మేలు మరిచిపోవద్దని,” చెప్పుకోవడం అందరూ వింటూనే ఉన్నారు.
అలాగే ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు ‘సామాజిక సాధికార యాత్ర’ పేరుతో బస్సులు వేసుకొని ఊరూరూ తిరుగుతూ, సంక్షేమ పధకాలతో మేము మీకు చాలా మేలు చేశామని, కనుక తప్పనిసరిగా మీరందరూ మాకే ఓట్లు వేసి కృతజ్ఞత చూపాలని కోరుతున్నారు.
అయితే జగన్ లేదా ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలకు తమ కష్టార్జితాన్ని పంచిపెడుతూ అలా చెప్పుకొన్నా ఎవరూ వేలెత్తిచూపేవారు కాదు. కానీ లక్షల కోట్లు అప్పులు చేస్తూ సంక్షేమ పధకాల పేరుతో పంచిపెడుతూ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తూ, ఆ అప్పులు, వడ్డీల భారాన్ని మళ్ళీ ప్రజల మీదే వేస్తూ ‘మేలు చేస్తున్నాం తప్పనిసరిగా కృతజ్ఞత చూపాలని నిసిగ్గుగా కోరుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ అధికారిక బాధ్యతలను నిర్వర్తించకుండా దీని కోసం బస్సులు వేసుకొని ఊరూరు తిరుగుతుండటం మరో తప్పు.
ఆనాడు సమైక్య రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఐటి రంగాన్ని అభివృద్ధి చేసి లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించారు. వాటితో వారు, వారి కుటుంబాలు జీవితంలో హాయిగా స్థిరపడ్డారు. తమకు ఇంత మహోపకారం చేసిన చంద్రబాబు నాయుడుని జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేయడంతో ఆయనకు సంఘీభావం తెలిపేందుకు హైదరాబాద్లో పనిచేస్తున్న వేలాదిమంది ఐటి ఉద్యోగులు, తమ కుటుంబాలతో సహా ఆదివారం గచ్చిబౌలి స్టేడియంకు తరలివచ్చారు.
ప్రతీ ఒక్కరూ చంద్రబాబు నాయుడు చేసిన ‘మేలు’ గురించి చెప్పుకొని కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. చంద్రబాబు నాయుడు దార్శనికుడు కనుక ఐటి రంగంలో భారీగా ఉద్యోగాలు, సంపద ఉందని గ్రహించి వాటిని ఏర్పాటు చేశారు. ఆయనను తీవ్రంగా ద్వేషించే కేసీఆర్ కూడా ఆయన చూపిన మార్గంలోనే ముందుకు సాగుతూ, ఐటి రంగాన్ని మరింత అభివృద్ధి చేసి తెలంగాణ రాష్ట్రానికి మరింత సంపద సృష్టించుకొంటున్నారు. అయినా చంద్రబాబు నాయుడుని ద్వేషిస్తూనే ఉన్నారు. కానీ దాని వలన తెలంగాణకు ఎటువంటి నష్టమూ జరుగడం లేదు.
కానీ చంద్రబాబు నాయుడుపై ద్వేషంతో అమరావతి నిర్మాణంతో సహా ఆయన చేపట్టిన ప్రతీ పనిని నిలిపివేయడం వలన రాష్ట్రానికి తీరని నష్టం కలుగుతుండటం, ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేనంతగా ఆర్ధిక సమస్యలు చుట్టుముట్టడం అందరూ చూస్తూనే ఉన్నారు.
వైసీపి ప్రభుత్వంపై టిడిపి ప్రభుత్వ ఛాయలు వద్దనుకొన్నప్పుడు, జగన్ ప్రభుత్వం తమదైన శైలిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఉంటే, హైదరాబాద్లో ఐటి ఉద్యోగులు కృతజ్ఞతలు తెలుపుకొన్నట్లే, నేడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా కృతజ్ఞతలు తెలుపుకొంటూ ఉండేవారు.
చంద్రబాబు నాయుడు చేసిన మేలుకి ఎవరూ అడగకుండానే ఐటి ఉద్యోగులు వచ్చి కృతజ్ఞతలు తెలుపుకొంటుంటే, సంక్షేమ పధకాల పేరుతో లక్షల కోట్లు పంచి పెడుతున్నా కూడా బటన్ నొక్కుడు సభలకు బలవంతంగా లబ్ధిదారులను తరలించాల్సి వస్తోంది. పైగా మంత్రులు, ఎమ్మెల్యేలు బస్సులు వేసుకొని ఊరూరూ తిరుగుతూ ‘మేము మీకు మేలు చేశాం మాకు కృతజ్ఞతలు చూపండహో’ అని ప్రజలను వేడుకొంటున్నారు… విడ్డూరంగా లేదూ?
Ranabaali Review: History Without Heart A film rooted in heart-wrenching stories is let down by…
Rajinikanth's Jailer 2 has taken a strong start at the global box office and is…