
నాడు హైటెక్ సిటీ, ఐటి కంపెనీలు మొదలు నేడు అమరావతి.. దానిలో క్వాంటం వ్యాలీ వరకు సిఎం చంద్రబాబు నాయుడి ఆలోచనలు ఎప్పుడూ రాబోయే కాలానికి సంబందించినవే ఉంటాయి. కనుక ఆయన ఆలోచనలను, దూరదృష్టిని అర్థం చేసుకోలేనివారు విమర్శిస్తూనే ఉంటారు.. ఎద్దేవా చేస్తూనే ఉంటారు.
కానీ తర్వాత అవే అందరికీ ఉపయోగపడుతున్నప్పుడు అందరూ అయన దూరదృష్టిని అర్థం చేసుకొని ఆశ్చర్యపోతుంటారు.
ఆయన రాజకీయ ప్రత్యర్ధులు బహిరంగంగా ఆయనని మెచ్చుకోకపోయినా ఏదో ఓ సందర్భంలో అయన గురించి నాలుగు ముక్కలు మాట్లాడుతూనే ఉంటారు.
రాష్ట్ర విభజన తర్వాత సిఎం చంద్రబాబు నాయుడు ‘పట్టిసీమ ప్రాజెక్టు’ చేపట్టినప్పుడు కూడా అలాగే విమర్శలు పాలయ్యారు. ముఖ్యంగా ఆయన రాజకీయ ప్రత్యర్ధులు దానిని ప్రస్తావిస్తూ, ఆయనపై చేసిన విమర్శలు, వెటకారాలు అన్నీ ఇన్నీ కావు.
నేడు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో కృష్ణా-గోదావరి పవిత్ర సంగమంలో జలహారతి ఇచ్చిన తర్వాత అక్కడ జరిగిన సభలో సిఎం చంద్రబాబు నాయుడు పట్టిసీమ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.
“2014లో పట్టిసీమతో కృష్ణా గోదావరి అనుసంధానం చేస్తానంటే చాలా మంది నవ్వారు. పొరుగు రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఇందుకు మనపై విరుచుకు పడ్డాయి.
ఓ పక్క కృష్ణానదిలో నీళ్ళు క్రమంగా తగ్గిపోతుంటే, మరోపక్క ఏటా సగటున సుమారు 2,000 టీఎంసీల గోదావరి నీళ్ళు వృధాగా సముద్రంలో కలిసిపోతున్నాయి. కనుక రెండు నదులను అనుసంధానం చేయగలిగితే కృష్ణ డెల్టాకు నీళ్ళు అందించవచ్చనే ఆలోచనతోనే ఈ పట్టిసీమ ఏర్పాటయింది.
ఈ పట్టిసీమతోనే అప్పటి నుంచి 450 టీఎంసీల నీళ్ళు కృష్ణ డెల్టాకు అందాయి. కృష్ణా డెల్టాను ఈ పట్టిసీమ ప్రాజెక్టే కాపాడింది. పట్టిసీమ లేకపోయుంటే కృష్ణా డెల్టా పరిస్థితి ఏమిటి? అని ఒకసారి ఆలోచిస్తే దీని ప్రాధాన్యత అర్ధమవుతుంది,” అని అన్నారు.
నాడు హైటెక్ సిటీ, ఐటి కంపెనీల గురించి సిఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నప్పుడు “కంప్యూటర్లు తిండి పెడతాయా?” అని విమర్శించేవారు. కానీ అవి తిండి పెట్టడమే కాదు.. లక్షలాది మంది జీవితాలను మార్చేశాయని ఇప్పుడు అందరికీ తెలుసు.
రాజధాని రాష్ట్రానికి నడిబొడ్డున ఉండాలని అమరావతిని ఖరారు చేసినప్పుడు, భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాలనప్పుడు కూడా రాజకీయ ప్రత్యర్ధులు ఇదేవిధంగా సిఎం చంద్రబాబు నాయుడుని అవహేళన చేశారు.
కానీ అమరావతిలో ఆయన కట్టించిన సచివాలయం, శాసనసభలోనే మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి కూర్చొని ఐదేళ్ళు పాలన చేశారు.
తాను వద్దనుకున్న భోగాపురం విమానాశ్రయాన్ని ఓన్ చేసుకొని, దాని క్రెడిట్ కోసం నిర్మాణ పనులు కొనసాగించడం అందరూ చూశారు.
ఇప్పుడు అమరావతి నిర్మాణపనులు శరవేగంగా సాగుతుంటే ‘మావిగన్’ అంటూ మాట్లాడటం ఈ కోవలోకే వస్తుంది. మరో 20-30 ఏళ్ళ తర్వాత అమరావతి ఎంత అవసరమో, అది గొప్పదో క్రమంగా జగన్మోహన్ రెడ్డితో సహా విమర్శకులకి కూడా అర్ధమవుతుంది.
దీర్ఘకాలిక ప్రణాళికలు అమలు కావడానికి సమయం పడుతుంది. అందుకే వాటి ఫలితాలు వెంటనే కనిపించవు. కనుక ముందుగా రాజకీయ విమర్శలు వస్తాయి. తర్వాత ఫలితాలు కనిపిస్తాయి. కనుక గతంలో చేసిన పనులకు ప్రశంశలు, వర్తమానంలో చేస్తున్న పనులకు విమర్శలు భరించడం సిఎం చంద్రబాబు నాయుడుకి అలవాటే.
YouTuber Nandana has reportedly appeared before the police in connection with the financial fraud case…
Suriya and Jyothika have completed 20 years of marriage. Instead of just celebrating a wedding…