
ఏ రాష్ట్రంలోనైనా ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న పార్టీ, ప్రభుత్వం మీద విమర్శలు ఆరోపణలు చేయడం సహజమే. ఏపీలో కూడా అదే జరుగుతోందని వైసీపి ప్రభుత్వం సర్ధిచెప్పుకోలేకపోతోంది. ఎందుకంటే నెలనెలా జీతాల కోసం ఉద్యోగుల ఆర్తనాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గుంతలు పడిన రోడ్లు కనిపిస్తూనే ఉన్నాయి. బిల్లుల కోసం కాంట్రాక్టర్లు కోర్టులకు వెళుతూనే ఉన్నారు.
నిరుద్యోగులు డిగ్రీలు పట్టుకొని ఇరుగు పొరుగు రాష్ట్రాలకు వలసలు పోతూనే ఉన్నారు. పన్నులు, ఛార్జీల మోత మోగుతూనే ఉంది. బియ్యం ధర కేజీ రూ.70, పప్పులు కేజీ రూ.200 చేరుకోవడంతో నిత్యావసర సరుకులు సామాన్యులకు ‘లగ్జరీ ఐటెమ్స్’గా మారిపోయాయి. కనుక రాష్ట్ర ప్రభుత్వం జాబితాలో కూడా లేని రాజధాని, పోలవరం, రైల్వేజోన్, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ వంటి పెద్ద సమస్యల గురించి సామాన్య ప్రజలు ఎలా ఆలోచించగలరు?
ఇవన్నీ కంటికి కనపడుతున్న సమస్యలే! అప్పులు, వైసీపి నేతల అవినీతి, అక్రమాలు వంటి కంటికి కనపడని సమస్యలు చాలానే ఉన్నాయి. కానీ వైసీపి ప్రభుత్వం దృష్టి అంతా రాబోయే ఎన్నికల మీద, టిడిపి, జనసేనలను ఎలా దెబ్బతీయాలనే దానిపైనే ఉంది.
నాగార్జున సాగర్ డామ్ డ్రామాతో ఏపీ హక్కులను కాపాడుకొన్నామని గొప్పగా చెప్పుకొన్న అంబటి రాంబాబు వరదలకి కొట్టుకుపోతున్న గేట్లను కాపాడలేకపోయారు. మిగ్జామ్ తుఫానుతో నష్టపోయిన రైతులను ఆదుకోలేకపోతున్నారు.
పంటలు నష్టపోయి రైతులు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపులు చూస్తుంటే, తెలంగాణలో జనసేన పార్టీ డిపాజిట్లు కోల్పోయిందని చంకలు గుద్దుకొనేవారు ఒకరు. చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేయాలని దగ్గుబాటి పురందేశ్వరి ఆరాటపడుతున్నారని మరొకరు, మంత్రి పదవి పోయిన తర్వాత లంచాలు తీసుకోవడం పూర్తిగా మానేశానని, ఇప్పుడు బెట్టింగ్లు మాత్రమే చేస్తున్నానని మరొకరు… ఇలా వైసీపిలో ఎవరిని కదిలించినా అందరికీ ఓ కోడి, గుడ్డు, పొటాటో, ఉల్లిగడ్డల కధలు గంటా…అరగంటా చెప్పుకొనేందుకు ఉంటాయి.
కనుక తుఫాను వలన నష్టపోయిన రైతుల వద్దకు చంద్రబాబు నాయుడు, యువగళం పాదయాత్రలో గుంతలు పడిన రోడ్లను చూసుకొంటూ… చూపిస్తూ నారా లోకేష్, ప్రభుత్వానికి తమ బాధ్యతలను గుర్తు చేస్తునే ఉన్నారు. తనంతట తానుగా పనిచేయాల్సిన వైసీపి ప్రభుత్వం ఇలా… ప్రతిపక్ష నేతలు ప్రజల మద్యకు వెళితేనే, ఇలా వేలెత్తి చూపుతుంటేనే పనిచేస్తుందంటే ఆశ్చర్యంగానే ఉంది కదా?
The TDP, Jana Sena and BJP have finalised their seat-sharing agreement for Andhra Pradesh’s urban…
The plot to commit a mass shooting at a Hindu temple in Aurora has been…