
ఏపీ శాసనసభ, లోక్సభ ఎన్నికలలో టిడిపితో పొత్తుకి బీజేపీ అధిష్టానం మొదట ససేమిరా అంటే పవన్ కళ్యాణ్ మాట్లాడి ఒప్పించారు. ఏపీలో జగన్ అండ్ కో దౌర్జన్యాలను ఎదుర్కోవాలంటే కేంద్రం… కేంద్ర ఎన్నికల కమీషన్ సహాయ సహకారాలు చాలా అవసరమని భావించిన చంద్రబాబు నాయుడు కూడా బేషజాలకు పోకుండా బీజేపీతో పొత్తుకి సిద్దపడ్డారు.
అప్పుడు టిడిపితో పొత్తు అవసరమా? అని ఏపీ బీజేపీలోని కొందరు నేతలు ప్రశ్నించగా, ఏపీలో బలమే లేని బీజేపీ కోసం ఇన్ని సీట్లు త్యాగం చేయడం అవసరమా? అని టిడిపి అభిమానులు చంద్రబాబు నాయుడుపై ఆసహనం వ్యక్తం చేశారు. బీజేపీతో పొత్తు కోసం జనసేన కూడా సీట్లు త్యాగం చేయాల్సి రావడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన నేతలు, కార్యకర్తలు అసహనం వ్యక్తం చేశారు.
ఎన్ని విమర్శలు, అభ్యంతరాలు వచ్చినా మోడీ, చంద్రబాబు, పవన్ ముగ్గురూ పొత్తుకే మొగ్గుచూపారు. అది చాలా మంచి నిర్ణయమని ఇప్పుడు ఎన్నికల ఫలితాలు చూస్తే అర్దమవుతుంది. పోలింగ్ సమయంలో వైసీపి పెట్రేగి పోకుండా కేంద్ర ఎన్నికల కమీషన్ కట్టడి చేస్తూ టిడిపి, జనసేనలకు తోడ్పడింది.
అందుకు ప్రతిగా ఆ రెండు పార్టీలు తమ ఓట్లు బీజేపీకి బదిలీ అయ్యేలా చేసి ఆ పార్టీ అభ్యర్ధులు గెలుపుకి దోహదపడ్డారు. మూడు పార్టీలు కలిసి ఏపీలో 175కి 165 సీట్లు గెలుచుకొని జగన్ రాక్షస పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ప్రజలకు విముక్తి కల్పించాయి.
అయితే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వలన టిడిపి, జనసేనలు లాభపడిన్నట్లే, వాటితో పొత్తు పెట్టుకోవడం వలన ఇప్పుడు బీజేపీ కూడా లాభపడబోతోంది. ఈసారి లోక్సభ ఎన్నికలు ఎన్డీయే కూటమి 370-400 సీట్లు గెలుచుకుంటుందని బీజేపీ నేతలు ప్రగల్భాలు పలికారు.
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుకి 272 సీట్లు అవసరం ఉండగా టిడిపి, జనసేన, బిహార్లోని జెడియూ (నితీష్ కుమార్), మహారాష్ట్రలోని శివసేన వంటి ప్రాంతీయ పార్టీల ఎంపీ సీట్లతో కలిపి ఎన్డీయే కూటమి 295 వరకు వచ్చి ఆగిపోయింది. కనుక మోడీ మళ్ళీ ప్రధానిగా అధికారం చేపట్టాలంటే టిడిపి (16), జనసేన (2), జెడియూ (14), శివసేన (6) మద్దతు చాలా కీలకం.
ఒకవేళ నితీష్ కుమార్ మళ్ళీ ఇండియా కూటమిలోకి జంప్ చేస్తే అప్పుడు ఎన్డీయే బలం 295 నుంచి ప్రమాదకర స్థాయికి అంటే 279కి పడిపోతుంది. కనుక ఈసారి ఎన్డీయే ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చాలా కీలకపాత్ర పోషించబోతున్నట్లు స్పష్టమవుతోంది.
ఇది అవాంఛనీయ పరిణామమే అయినప్పటికీ టిడిపి, జనసేనల మద్దతు బీజేపీకి కీలకం కావడం వలన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చాలా మేలు కలుగుతుంది.
ముఖ్యంగా రాష్ట్ర ఆర్ధిక సమస్యల నుంచి బయటపడటానికి, అమరావతి, పోలవరం నిర్మాణాలు వేగవంతం కావడానికి, రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు, పెండింగ్ ప్రాజెక్టులు, నిధులు తెచ్చుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే టిడిపి, జనసేనలకు కేంద్రమంత్రి పదవులు లభించే అవకాశం ఉంటుంది.
లోక్సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో చక్రం తిప్పుతానని కేసీఆర్ ప్రగల్భాలు పలికి సొంత రాష్ట్రంలోనే శాసనసభ, లోక్సభ ఎన్నికలలో వరుసగా రెండుసార్లు ఘోరపరాజయం, నవ్వులపాలయ్యారు. కానీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనవసరంగా ఒక్క మాట మాట్లాడకుండా కేంద్రంలో కీలక పాత్ర పోషించబోతున్నారు.
Vijay Deverakonda is confident about his comeback with Ranabaali and has a strong message for…
YS Jagan has been very successful when it comes to mitigating the legal and judicial…