
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నతో ఆస్తుల గొడవల గురించి మూడు రోజులుగా ప్రెస్‌మీట్‌లు పెట్టకుండా కాస్త బ్రేక్ ఇవ్వడంతో జగన్‌కు చాలా ఉపశమనం లభించిందనే చెప్పాలి. లేదా మధ్యవర్తుల ద్వారా ఆమెతో సెటిల్‌మెంట్ చేసుకుంటున్నారేమో? అందువల్లే షర్మిల మళ్ళీ ‘సైలంట్ మోడ్’లోకి మారారేమో?
ఏది ఏమైనప్పటికీ ఆమె ఆస్తుల గురించి ప్రెస్‌మీట్‌లు పెట్టి మాట్లాడకపోవడంతో జగన్‌కు కాస్త ఊపిరి పీల్చుకునేందుకు సమయం లభించింది అనుకుంటే ఇంతలోనే చంద్రబాబు నాయుడు విశాఖలోని ఋషికొండ ప్యాలస్‌లను సందర్శించి తీవ్ర విమర్శలు చేయడంతో ఇంతకాలం పక్కన పడున్న ఈ పాత సమస్య కొత్తగా జగన్ మెడకు చుట్టుకోవడం మొదలైంది.
వైట్‌హౌస్‌ని సైతం తలదన్నేలా ఉన్న ఋషికొండ ప్యాలస్‌లు, వాటిలో ఖరీదైన ఫర్నీచర్, ఫ్లోరింగ్, లైటింగ్ వగైరాల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెట్టి మరీ టిడిపి జగన్‌ని ఎండగట్టేస్తోంది. అవన్నీ కళ్ళకు కనబడుతున్న నిజాలు… విలాసాలే!
కనుక వాటిని ఏవిదంగా సమర్ధించుకోవాలో తెలీక వైసీపి సోషల్ మీడియా టీమ్ తలపట్టుకున్నట్లు కనిపిస్తోంది. అందుకే ఈ ప్యాలస్‌ల గురించి టిడిపి సోషల్ మీడియాలో ఇంతగా వాయించేస్తున్నా వాటికి వైసీపీ సోషల్ మీడియా ఎటువంటి కౌంటర్లు వేయకుండా వేరే అంశాల గురించి పేజీలు నింపేస్తోంది.
చంద్రబాబు నాయుడు ఇంత తీవ్రంగా విమర్శితే, జగన్ కట్టించిన ఆ అద్భుతమైన భవనాలను చంద్రబాబు నాయుడు చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోయారని వైసీపి చెప్పుకోవడం చూసి అందరూ నవ్వుకుంటున్నారు. కానీ ‘నవ్వితే నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు’ అని అనుకున్నారేమో?
చంద్రబాబు నాయుడు తమ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఇంతగా విమర్శిస్తే, వైసీపిలో ఏ ఒక్క సీనియర్ నాయకుడు ముందుకు వచ్చి జగన్‌ని సమర్ధిస్తూ మాట్లాడకపోవడం మరీ ఆశ్చర్యంగా ఉంది. అంటే వారు కూడా ఈ విషయంలో జగన్ తీరుని సమర్ధించడం లేదా? వారు కూడా తమ అధినేతనే తప్పుపడుతున్నారా? అంటే వారి మౌనం చూస్తే అయ్యుండవచ్చనిపిస్తుంది.
Sobhita Dhulipala doesn't think love should be limited to romance. For her, friendship is a…
One of the crucial developments with regard to South Indian politics is happening today as…