
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయాలను తప్పు పట్టే జగన్, వైసీపి నేతలు, మంచి పనులు జరిగితే మాత్రం తమ వలననే జరుగుతున్నాయని గొప్పలు చెప్పుకోవడం నా కోడి కూయకపోతే సూర్యుడు ఉదయించడు… లోకానికి తెల్లారదన్నట్లుంది.
రాష్ట్ర ప్రభుత్వం మద్యం, ఇసుక పాలసీలు ప్రకటించి అమలుచేయడం మొదలుపెట్టినప్పుడు వాటిలో కొన్ని లోపాలు, సమస్యలు బయటపడ్డాయి.
ముఖ్యంగా టిడిపి ఎమ్మెల్యేలు, నేతలు వాటిలో వేలుపెడుతున్నారని ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి అనుకూల మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. ఈ విషయం సిఎం చంద్రబాబు నాయుడు చెవిలో పడగానే మంత్రులు, ఎమ్మెల్యేలు అందరికీ గట్టిగా వార్నింగ్ ఇచ్చి కట్టడి చేశారు.
ప్రభుత్వం ప్రకటించిన ఇసుక విధానంలో లోపాలను సరిచేసి సామాన్య ప్రజలు నేరుగా నదులు, వాగులు వద్ద ఇసుక తవ్వుకొని తీసుకువెళ్ళేందుకు వీలు కల్పించారు. దీంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విరివిగా ఇసుక సరఫరా అవుతోంది. భవన నిర్మాణాలు మళ్ళీ ఊపందుకున్నాయి. భవన నిర్మాణ కార్మికులకు చేతినిండా పని దొరుకుతోందిప్పుడు.
కానీ దీనిని జగన్మోహన్ రెడ్డి గొప్పదనంగా వైసీపి చెప్పుకుంటోంది. జగన్ చాలా సమర్ధంగా, నిర్మాణాత్మక ప్రతిపక్ష నాయకుడుగా పనిచేస్తున్నారని సెల్ఫ్ సర్టిఫై చేసుకుంటోంది.
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇసుక విధానాన్ని సరిచేయగలిగిన ఘనుడు, మేధావి జగన్, మరి తన 5 ఏళ్ళ పాలనలో ఇసుక ఎవరికీ దొరక్కుండా ఎందుకు చేశారు? వైసీపి మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు యధేచ్చగా ఇసుక, మట్టి, బండరాళ్ళు తవ్వి తీసుకుపోయి బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటుంటే ఎందుకు వారించలేదు?
తత్ఫలితంగా గత 5 ఏళ్లుగా ఇసుక లభించక రాష్ట్రంలో భవన నిర్మాణ పనులు నిలిచిపోయాయి లేదా నత్త నడకన సాగాయి. దీంతో భవన నిర్మాణ కార్మికులకు పని, ఆదాయంలేక ఈసురోమని ఏడుస్తుంటే పట్టించుకోలేదు.
పైగా మద్యపాన నిషేదం అంటూ కల్తీ, నకిలీ మద్యం అమ్మకాలు సాగించి వారి ఆరోగ్యాలు కూడా దెబ్బతీశారు కదా? అవన్నీ మరిచిపోయి, ఇప్పుడు మావల్లనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సరిగ్గా పనిచేస్తోందని చెప్పుకోవడం సిగ్గుచేటు కాదా?
India has emerged as one of the biggest digital currency markets in the world thanks…
Sobhita Dhulipala doesn't think love should be limited to romance. For her, friendship is a…