
విశాఖ పోర్టులో వేలకోట్ల విలువైన 25,000 కేజీల నిషేదిత డ్రగ్స్ పట్టుబడితే, దానిపై టిడిపి, జనసేన, వైసీపి మూడు పార్టీలు గట్టిగా తమ వాదనలు వినిపిస్తున్నాయి.
ఏపీలో వైసీపి ప్రభుత్వమే అధికారంలో ఉంది కనుక ఎటువంటి చెకింగ్స్ జరుగకుండా నిషేదిత డ్రగ్స్ దిగుమతి చేసుకోవవచ్చనే ఆలోచన, ధైర్యంతోనే వైసీపి నేతలు వాటిని బ్రెజిల్ నుంచి నేరుగా విశాఖకు రప్పించారని టిడిపి, జనసేనలు ఆరోపిస్తున్నాయి.
రొయ్యల ఆహారం అనే ముసుగులో వాటిని ‘సంద్యా ఆక్వా కంపెనీ’ పేరిట విశాఖకు రప్పించారని వాదిస్తున్నాయి. సంద్యా ఆక్వా అధినేత వీరభద్రరావుకి వైసీపి ఎంపీ విజయసాయి రెడ్డికి, అలాగే ఆ కంపెనీ డైరెక్టర్లకు వైసీపి నేతలకు మద్య ఉన్న బంధాలను ఫోటోలతో సహా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తదితరులు బయటపెట్టారు.
ఈ వ్యవహారం బయటపడగానే ‘వైసీపి డిఫెండింగ్ ఛాంపియన్’ సజ్జల రామకృష్ణా రెడ్డితో సహా పలువురు నేతలు, వారి ఆత్మసాక్షి దీనిని చంద్రబాబు నాయుడు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కుటుంబాలతో ముడిపెడుతూ గట్టిగా వాదించారు.
కానీ సీబీఐ విచారణ లోతుగా సాగుతుండటంతో అందరూ హటాత్తుగా ‘సైలంట్ మోడ్’లోకి వెళ్ళిపోవడం గమనార్హం. అంటే టిడిపి నేతల వాదనలలో ఎంతో కొంత నిజముందని అనుకోవలసి ఉందేమో?
టిడిపి, జనసేన, వైసీపి అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి మీద ఈగ వాలితే ఆయా పార్టీల నేతలు ఎదురుదాడి చేస్తుంటారు. కానీ విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో వైసీపి నేతలు నేరుగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి సంబంధం ఉందని ఆరోపించినా ఆ పార్టీలో ఎవరూ స్పందించక పోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. బహుశః టికెట్ల హడావుడిలో మునిగి తేలుతున్నందున దగ్గుబాటి పురందేశ్వరితో సహా ఏపీ బీజేపీ నేతలు ఎవరూ ఈ వ్యవహారాన్ని, వైసీపి ఆరోపణలను సీరియస్గా తీసుకున్నట్లు లేదు.
ఈ భయంతోనే మూడు పార్టీలు ఈ వ్యవహారంలో గట్టిగా తమ తమ వాదనలు వినిపిస్తున్నాయి. కానీ ఏపీ బీజేపీ నేతలు మాత్రం అసలు ఈ వ్యవహారం గురించి తెలియన్నట్లే అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఈ ‘డ్రగ్స్ మరక’ అంటుకుంటే ఎన్నికలలో ఏపీ బీజేపీ నష్టపోతుందని గ్రహించారో లేదో?
‘దొరికితే దొంగలు లేకపోతే దొరలు’ అన్నట్లు ఈ డ్రగ్స్ పట్టుబడ్డాయి కనుక ఇంత హడావుడి జరుగుతోంది లేకుంటే….? గుట్టు చప్పుడు కాకుండా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో సహా దేశమంత విశాఖ నుంచి డ్రగ్స్ సరఫరా అవుతుండేవి కదా?మరి అటువంటప్పుడు కేంద్ర ప్రభుత్వం స్పందించాలి కదా?
కానీ సీబీఐ దర్యాప్తు చేస్తోంది కనుక మేము స్పందించనవసరం లేదన్నట్లు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుండటం విస్మయం కలిగిస్తోంది. ఇదే… ఏ గుజరాత్ లేదా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పట్టుబడితే కేంద్రం ఇలాగే మౌనంగా ఉండిపోయేదా? ఏపీలో ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడితే కేంద్రం ఎందుకు స్పందించడం లేదు?కేంద్రం మౌనం వెనుక ఏమైనా మతలబు ఉందా? ఏమో!
Vijay Deverakonda is confident about his comeback with Ranabaali and has a strong message for…
YS Jagan has been very successful when it comes to mitigating the legal and judicial…