
ఒకప్పుడు దేశంలో సతీ సహగమనాలు, బాల్య వివాహాలు ఉండేవి. కానీ బుల్లెట్ రైళ్ళు, డ్రోన్ టాక్సీలు, ఏఐ, క్వాంటం వంటివి వచ్చేస్తున్న ఈరోజుల్లో కూడా కోడలిని అత్తమామలు హింసించడం, భర్త కూడా వారితో కలిసి భార్యని హింసించడం వంటి ఘటనల గురించి విన్నప్పుడు మనం ఏ యుగంలో ఉన్నాము? అని డౌట్ రాకమానదు.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో డెహ్రాడూన్‌లో జరిగిన ఈ ఘటన గురించి విన్నప్పుడు దిగ్బ్రాంతి కలుగుతుంది. ఆడపిల్లలు పుట్టింటివారిని, వారి ప్రేమలని, రక్షణని అన్నిటినీ వదులుకొని అనేక కలలతో భర్త వెంట అత్తారింట్లో అడుగు పెట్టి ఇక అదే తన ఇల్లు, తన కుటుంబమని అంకితమైపోతారు.
అలా వచ్చిన ఓ యువతిని ఆమె భర్త తల్లితండ్రులకు అప్పగించేసి ఉద్యోగం కోసం ఢిల్లీ వెళ్ళిపోతే అత్తమామలు నరకం అంటే ఎలా ఉంటుందో ఇంట్లోనే చూపారు. అప్పటికే ఆమె కవల పిల్లల తల్లి కూడా. అయినా వారు ఏమాత్రం ఆమెపై కనికరం చూపలేదు.
ఆమెను ఓ బాత్ రూములో బందించారు. ఒక గంటో ఒక రోజో కాదు ఏకంగా 10 నెలల పాటు బందించి, చిత్ర హింసలకు గురిచేశారు. అత్తమామలు ఇద్దరూ రోజూ ఆమెను కర్రతో చితక బాదుతూ పైశాచికానందం అనుభవించేవారు. అన్నం బదులు బియ్యం, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఆహారంగా ఇచ్చేవారు. అప్పుడప్పుడు ఢిల్లీ నుంచి వచ్చిన భర్త కూడా ఆమెపై తన ప్రతాపం చూపి వెళ్ళిపోయేవాడు.
పది నెలలైనా కూతురుతో ఫోన్లో మాట్లాడనీయకపోవడంతో ఆమె తల్లి తండ్రులు నేరుగా డెహ్రాడూన్ వస్తే అత్యంత దైన్యస్థితిలో ఆమె కనపడింది. వెంటనే పోలీసులకు పిర్యాదు చేయడంతో ఆమె భర్త, అత్తమామలపై కేసులు నమోదు చేసి ముగ్గురినీ అరెస్ట్ చేశారు.
కనుక కూతురుకి పెళ్ళి చేసి పంపించేశామని, అక్కడితో తమ బాధ్యత పూర్తయిపోయిందని తల్లితండ్రులు అనుకోవడానికి లేదు. తప్పనిసరిగా అత్తారింట్లో ఉన్న కూతురు యోగక్షేమాలు తెలుసుకుంటూనే ఉండాలి. చాలా మంది తెలుసుకుంటూనే ఉంటారు కూడా.
అలాగే ఇరుగు పొరుగులు కూడా కాస్త సామాజిక స్పృహతో ఉండటం చాలా అవసరం. అనుమానం వస్తే వెంటనే నిలదీయడం లేదా కనీసం పోలీసులకు సమాచారం ఇవ్వడం చాలా అవసరం. అప్పుడే ఇలాంటి వేధింపుల నుంచి మహిళలకు రక్షణ ఉంటుంది.
For the first time in Bigg Boss history, there is a double eviction in the…
Toxic has emerged as an epic disaster at the box office. While the movie bombed…