
తెలంగాణ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మధ్యాహ్నం ఒంటి గంటవరకు పూర్తయిన ఓట్ల లెక్కింపులో 4 సీట్లు గెలుచుకొని మరో 60 స్థానాలలో ఆధిక్యతలో దూసుకుపోతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 60 సీట్లు సాధించవలసి ఉండగా కాంగ్రెస్ జోరు చూస్తుంటే 65 నుంచి 70 సీట్లు గెలుచుకొని పూర్తి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్లు స్పష్టమవుతోంది.
‘కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరు?’ అని బిఆర్ఎస్ పార్టీ మొదటి నుంచే నిలదీస్తూండేది. ఆ ప్రశ్నకు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరుల పేర్లు వినబడ్డాయి. కానీ రేవంత్ రెడ్డే కాబోయే ముఖ్యమంత్రి అని తెలంగాణ డిజిపి అంజనీ కుమార్ ఖరారు చేసేశారు!
ఓ డిజిపి ముఖ్యమంత్రిని ఖరారు చేయడం ఏమిటని అనుకోవచ్చు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని స్పష్టం కాగానే డిజిపి అంజనీ కుమార్ రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి అభినందనలు తెలియజేసి, ఆయనకు భద్రత పెంచారు.
డిజిపితో పాటు రాచకొండ సిపి మహేష్ భగవత్, తెలంగాణ సిఐడీ చీఫ్ సంజయ్ కుమార్ జైన్ తదితర ఉన్నతాధికారులు కూడా రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. ఆయన పిసిసి అధ్యక్షుడు కనుక అభినందనలు తెలిపామని చెప్పుకోవచ్చు గాక కానీ రేవంత్ రెడ్డే కాబోయే సిఎం అని వారుకూడా భావిస్తున్నట్లు స్పష్టమైంది.
ఇక కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలలో ఆధిక్యతలో కొనసాగుతుండటంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు అప్పుడే టపాసులు పేల్చి సంబరాలు చేసుకొంటున్నాయి. కాంగ్రెస్ ముఖ్య నేతల ఇళ్ళవద్దకు భారీగా కార్యకర్తలు చేరుకొని ఒకరికొకరు అభినందనలు తెలుపుకొంటున్నారు.
ఈరోజు ఉదయం ఓట్ల లెక్కింపు మొదలయ్యే ముందు కూడా బిఆర్ఎస్ పార్టీ వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్ ట్రిక్ సాధించబోతోందని, కనుక బిఆర్ఎస్ శ్రేణులు అందరూ సంబరాలు చేసుకోవడానికి సిద్దంగా ఉండాలంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. దానిలో ఆయన తుపాకి పట్టుకొని గురిపెడుతున్న ఫోటోని జత చేశారు. కానీ అయన గురి తప్పిందని స్పష్టమయ్యింది.
The plot to commit a mass shooting at a Hindu temple in Aurora has been…
The reported differences between Andhra Pradesh Chief Minister Chandrababu Naidu and Deputy Chief Minister Pawan…