
వైసీపి నేతలందరూ ముక్త కంఠంతో కేంద్ర ఎన్నికల కమీషన్ చాలా పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. కీలకమైన ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి పురందేశ్వరి సూచించిన పోలీస్ అధికారులందరిపై ఈసీ వేటు వేసిందని ఆరోపిస్తున్నారు.
వారు ఈవిదంగా ఆక్రోశించడం చూస్తున్నప్పుడు, చంద్రబాబు నాయుడు ఎంత దూరదృష్టితో వ్యవహరించారో అర్దమవుతుంది.
ఈ ఎన్నికలలో గెలిచేందుకు జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ళుగా సంక్షేమ పధకాల పేరుతో డబ్బు ముట్టజెప్పి ఓటు బ్యాంకు నిర్మించుకొంటూ, ఆ ఓటు బ్యాంకుకి వాలంటీర్లతో కాపలా పెట్టి కాపాడుకుంటూ వస్తున్నారు.
అయినా చొక్కా చేతులు మడత పెట్టి యుద్ధం చేయకపోతే ఈ ఎన్నికలలో గట్టెక్కడం కష్టమని భావించి, అందరినీ ‘సిద్ధం’ కమ్మని పోస్టర్స్ వేసి, ‘మనమందరం సిద్దం’ అంటూ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.
ఈ ఎన్నికలలో గెలిచేందుకు జగన్మోహన్ రెడ్డి ఎంతకైనా తెగిస్తారని చంద్రబాబు నాయుడు ముందే ఊహించారు. అయితే కేంద్ర ఎన్నికల కమీషన్‌ని కలిసి ‘ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిపించండి…. ప్లీజ్’ అని కోరితే జరిపించేయదని ఆయనకు తెలుసు. ఈసీ అనే ఏనుగుకి మోడీ అనే అంకుశంతోనే కదలిక వస్తుందని తెలుసు.
అందుకే జగన్మోహన్ రెడ్డి, వైసీపి నేతలు ఎంతగా అవహేళన చేస్తున్నప్పటికీ, ఏమాత్రం వెనకంజ వేయకుండా బీజేపీతో పొత్తు ఖరారు చేసుకున్నారు.
టిడిపితో బీజేపీ పొత్తు పెట్టుకుంటే ఇలా జరుగుతుందని జగన్‌తో సహా వైసీపి నేతలందరికీ కూడా తెలుసు. అందుకే వాటి పొత్తు కుదరకుండా ఉండేందుకు దగ్గుబాటి పురందేశ్వరిని అనరాని మాటలు అన్నారు. పొత్తు కుదిరిన తర్వాత కూడా టికెట్స్ దక్కని ఏపీ బీజేపీ నేతలను చంద్రబాబు, పురందేశ్వరిలపైకి ఉసిగొల్పేందుకు చాలా ప్రయత్నించారు కానీ అదీ ఫలించలేదు.
“టిడిపితో బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పటి నుంచే ఈసీ ధోరణిలో మార్పు మొదలైందని” పేర్ని నాని, అంబటి రాంబాబు వంటివారు ఆరోపించారు. అంటే చంద్రబాబు నాయుడు ఆలోచన ఫలించిందని వైసీపి నేతలు కూడా అంగీకరించారన్న మాట!
అయితే ఈ ఎన్నికలలో వైసీపి పెట్రేగిపోకుండా నియంత్రిస్తూ ప్రజలు ధైర్యంగా తమ ఓట్లు వేసేందుకు తోడ్పడుతూ నిష్పక్షపాతంగా పోలింగ్ జరిగేలా చేయాలని మాత్రమే చంద్రబాబు నాయుడు ఆశించారు తప్ప టిడిపి కూటమిని ఏకపక్షంగా ఈసీయే గెలిపించేయాలని కోరుకోలేదు.
ఈసీ ఎన్ని జాగ్రత్తలు తీసుకునప్పటికీ పోలింగ్ సమయంలో, తర్వాత కూడా వైసీపి మూకలు చెలరేగిపోయాయి. అల్లర్లు చెలరేగాయి. వైసీపి ఎమ్మెల్యే పిన్నెల్లి ఏకంగా పోలింగ్ బూత్‌లో ప్రవేశించి ఈవీఎంని ధ్వంసం చేసి, వైసీపి తడాఖా రుచి చూపించారు కూడా.
ఒకవేళ చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు విషయంలో వెనక్కి తగ్గి ఉంటే, నేడు ఎన్నికలు మరోలా జరిగేవి. అప్పుడు ఫలితాలు కూడా మరోలా ఉండేవని ఈ అల్లర్లు, విధ్వంసమే నిరూపిస్తున్నాయి.
కనుక వైసీపి దౌర్జన్యాల గురించి చంద్రబాబు నాయుడు అంచనాలు, దానిని కట్టడి చేసేందుకు ఆయన తీసుకున్న ఈ నిర్ణయం రెండూ సరైనవే అని స్పష్టం అయ్యింది.
Ranbir Kapoor, Yash and Sai Pallavi are starring in the upcoming adaptation of Ramayana, directed…
Hanuman Ansh created a sensation at the Hindi box office, but its Telugu-dubbed version has…