Telugu

నలుగురు ఎమ్మెల్యేల సస్పెన్షన్… కోర్టులలో జగన్ మెడకు చుట్టుకుంటుందా?

ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందన్నట్లు ఎమ్మెల్సీ ఎన్నికలు వైసీపీ కొంపముంచాయి. “వైనాట్ 175 సీట్స్?” అంటూ గర్వంగా ఎదురు ప్రశ్నిస్తున్న వైసీపీకి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా చిన్నవి…. చాలా సునాయాసంగా గెలుచుకోగలవి… అని అందరూ ధీమా వ్యక్తం చేశారు. కానీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో మూడుకు మూడు సీట్లు టిడిపి గెలుచుకొని షాక్ ఇచ్చింది. అదేం పెద్ద గొప్ప విషయం కాదని సజ్జల తీసిపడేశారు.

ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలలో సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఓటర్లు కనుక ఏడుకి ఏడు సీట్లు మనవే అనుకొంటే వాటిలో కూడా ఒకటి టిడిపి ఎగరేసుకుపోయింది.

ADVERTISEMENT

“అయినా పర్లేదు… కావాలంటే ఆ ఒక్క సీటుతోనే పండగ చేసుకోండి… ఇదే మీ ఆఖరి పండగ… ఈసారి ఎన్నికలలో మీకు ఆ 23 సీట్లు కూడా రావు…” అంటూ మంత్రులందరూ శాపనార్ధాలు పెట్టారు. ఈ ఫలితాలతో షాక్ అయిన తమ అధినేతను ప్రసన్నం చేసుకోవడానికే వారందరూ పోటీపడి టిడిపిని, చంద్రబాబు నాయుడుని విమర్శించినప్పటికీ, వాస్తవ పరిస్థితులు మారవు కదా?

“క్రాస్ ఓటింగ్ చేసిన ఎమ్మెల్యేలను గుర్తించాము. కానీ ఇప్పటికిప్పుడు వారిపై ఎటువంటి చర్యలు తీసుకోబోము,” అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పి 12 గంటలు కూడా కాలేదు. ఇంతలోనే నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆయనే కొద్దిసేపటి క్రితం ప్రకటించారు.

తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “చంద్రబాబు నాయుడు ఒక్కొక్కరికీ రూ.10-15 కోట్లు ఇచ్చి వీళ్ళందరినీ కొనుగోలు చేశారు. ఇటువంటివాళ్ళను ఇంకా ఉపేక్షిస్తే పార్టీకి ఇంకా నష్టం కలిగిస్తారు. అందుకే మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకొన్నాము. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (నెల్లూరు రూరల్), ఆనం రామనారాయణ రెడ్డి(వెంకటగిరి)లతో పాటు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి(ఉదయగిరి), ఉండవల్లి శ్రీదేవి (తాడికొండ)లని పార్టీలో నుంచి తక్షణం సస్పెండ్ చేస్తున్నాము, “ అని సజ్జల రామకృష్ణారెడ్డి కటించారు.

దీనికి ముక్తాయింపుగా, “ఎవరూ కేవలం అసంతృప్తితో క్రాస్ ఓటింగ్ చేయరు. డబ్బుకు ఆశపడే ఇటువంటి నీచమైన పనులు చేస్తారు. కానీ టిడిపి నుంచి మా పార్టీలోకి వచ్చినవారు మాత్రం అసంతృప్తితోనే వచ్చారు. వారిని మేము ప్రలోభపెట్టలేదు,” అని సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పడం విశేషం.

వైసీపీలో తనను అనుమానిస్తూ తన ఫోన్‌ ట్యాపింగ్‌ చేయిస్తున్నారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీకి దూరమైన సంగతి ఆయనే స్వయగా ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ చెప్పుకొన్నారు. వెంకటగిరిలో తన మాటకు విలువలేకుండా, అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వకుండా అవమానిస్తున్నారని ఆనం రామనారాయణ రెడ్డి పార్టీకి దూరమయ్యారు. తాడికొండలో డొక్కా మాణిక్య వరప్రసాద్‌ను నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌గా నియమించి తనకు టికెట్‌ ఇవ్వబోనని చెప్పినందుకు ఉండవల్లి శ్రీదేవి అసంతృప్తిగా ఉన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీ అధిష్టానమే తనకు వ్యతిరేకంగా నాలుగు గ్రూపులు సృష్టించి తనను ముప్పతిప్పలు పెడుతోందని, పార్టీలో ఉండాలో వద్దో చెప్పాలని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఈరోజు ఉదయమే అడిగారు.

అంటే నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ అధినేతపై తీవ్ర అసంతృప్తితోనే క్రాస్ ఓటింగ్ చేశారని స్పష్టమవుతోంది. కానీ డబ్బు కోసమే వారు ఆశపడి క్రాస్ ఓటింగ్ చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి చెపుతున్నారు. డబ్బు కోసమే ఆశపడితే మరో ఏడాదిన్నర పాటు ఉండే ఎమ్మెల్యే పదవులకు ఎందుకు పోగొట్టుకొంటారు. వాటితో అంతకు రెండు మూడు రెట్లు ఆదాయం సమకూర్చుకోగలరు కదా?

చివరిగా ఒక్క ముక్క చెప్పుకోక తప్పదు. “మేము చేస్తే సంసారం… ఇతరులు చేసేది వ్యభిచారం” అన్నట్లున్నాయి సజ్జల మాటలు. టిడిపి ఎమ్మెల్యేలు వైసీపీలోకి వస్తే అసంతృప్తితో, సిఎం జగన్‌ మీద అభిమానంతో వచ్చారట! అదే… వైసీపీలో ఎమ్మెల్యేలు టిడిపికి ఓట్లేస్తే డబ్బుకు ఆశపడి వేశారట! అంటే వైసీపీలో ఉన్నంతకాలం అందరూ స్వాతిముత్యాలే కానీ తేడా వస్తే దుష్టులు, దుర్మార్గులైపోతారన్న మాట!

గమనిక: ఈ సూత్రం వైసీపీలో కొనసాగుతున్న వారందరూ తప్పక గుర్తుంచుకోవడం చాలా అవసరం. లేకుంటే వారిపై కూడా ఇదే స్టాంప్ పడుతుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Ranabaali Sound Issue: Makers Ask Theatres to Turn It Up

Ranabaali has been facing criticism over its background score since its release. Starring Vijay Deverakonda…

9 minutes ago

స్థానిక పరీక్షలు అందరికీ.. మినహాయింపుల్లేవు గురూ!

స్థానిక సంస్థల ఎన్నికలంటే అధికార, ప్రతిపక్ష పార్టీలకు, పోటీ చేస్తున్న అభ్యర్ధులకే పరిమితం అనుకునే రోజులు కావివి. ఈ చెత్త…

13 minutes ago