హత్య చేసింది పాత్రనే కానీ బలయ్యింది ప్రేక్షకులు

Hatya-Telugu-Movie-Reviewఓవర్ నైట్ సెన్సేషన్ ఎక్కువ రోజులు నిలవదు. దాన్ని నిలబెట్టుకోవాలంటే చాలా కష్టపడాలి. బిచ్చగాడు రాక ముందు విజయ్ ఆంటోనీ మన ప్రేక్షకులకసలు పరిచయమే లేదు. కానీ ఆ సినిమాలో మదర్ సెంటిమెంట్ ద్వారా తెలుగు ఆడియన్స్ కి బాగా కనెక్టయ్యాడు. తర్వాత చాలా అంటే చాలా సినిమాలొచ్చాయి. ఏదీ కనీస స్థాయిలో ఆడలేదు. తిరిగి బిచ్చగాడు 2నే అంతో ఇంతో డబ్బులు తెచ్చింది.

ADVERTISEMENT

తాజాగా హత్యతో వచ్చాడు. ఇదో క్రైమ్ థ్రిల్లర్. అలా అని ఊహించని కథా కథనాలు ఏమీ ఉండవు. హీరో డిటెక్టివ్ (విజయ్ ఆంటోనీ). ఒక లేడీ మోడల్(మీనాక్షి చౌదరి) హత్యకు గురైతే హంతకుడిని పట్టుకోవడం కోసం ఇన్స్ పెక్టర్ సంధ్య(రితిక సింగ్)తో కలిసి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి ఎవరు మర్డర్ చేశారో క్లైమాక్స్ లో కనుక్కుంటాడు. ఈ పాయింట్ మీద కొన్ని వందల చిత్రాలు తెరమీదకొచ్చాయి.

దర్శకుడు బాలాజీ కుమార్ ఏ ఉద్దేశంతో ఇంత పాత లైన్ రాసుకున్నాడో కానీ ట్రీట్ మెంట్ కూడా అంతే అత్తెసరుగా సాగింది. గ్రిప్పింగ్ గా ఉండాల్సిన స్క్రీన్ ప్లేని నత్తనడకతో తీసుకెళ్లడం దగ్గరే పూర్తిగా దెబ్బ తిన్నాడు. పాత్రల పరిచయం, వాళ్ళ మీద అనుమానం వచ్చే సంఘటనలు ఏవీ ఆసక్తికరంగా ఉండవు. పోనీ వినాయక్ చేసే ఇన్వెస్టిగేషన్ ఏమైనా సస్పెన్స్ ఇస్తుందా అది ఏ కోశానా కనిపించదు.

సెకండ్ హాఫ్ లో హంతకుడెవరనే పాయింట్ మీద నడవడంతో కొంచెం బెటరనిపిస్తుందే తప్ప సంతృప్తి చెందడానికి అది ఏ మాత్రం సరిపోలేదు. అసలు కిల్లర్ ని రివీల్ చేసే విధానంలో కొంత ట్విస్టు ఉన్నా ఈ తతంగమంతా మరీ నెమ్మదిగా సాగుతుంది. దీంతో రెండు గంటల పది నిముషాలు బరువైపోయి త్వరగా ముగించమని ఎదురుగా లేకపోయినా బాలాజీ కుమార్ ని బ్రతిమాలుకోవాల్సి వస్తుంది.

కొన్నేళ్ల క్రితం విశాల్ డిటెక్టివ్ వచ్చింది. మిస్కిన్ దర్శకత్వంలో తెలుగులోనూ బాగా ఆడింది. ఊహించని మలుపులు, షాకిచ్చే నేపధ్యం దాని స్థాయిని పెంచాయి. ఒక మర్డర్ మిస్టరీకి ఉండాల్సిన ప్రాధమిక లక్షణం అది. హత్యలో ఆ లక్షణాలేవీ ఉండదు. పైగా రెగ్యులర్ గా మూవీస్ చూసే వాళ్ళు హత్యలు చేసిందెవరో సులభంగానే గుర్తు పడతారు. అవసరం లేని హీరో కూతురి ఫ్లాష్ బ్యాక్ అదనపు తలనొప్పి.

క్యాస్టింగ్ భారీగానే ఉంది. రాధికా, మురళి శర్మ, జాన్ విజయ్ లను చేతులారా వేస్ట్ చేసుకున్నారు. సంగీతం గురించి మాట్లాడుకోకపోవడం మంచిది. కెమెరా, ఆర్ట్ వర్క్ ఈ రెండు విభాగాలు మాత్రమే సిన్సియర్ డ్యూటీ చేశాయి. ఓటిటిలోనే చూసేందుకే విసుగొచ్చే ప్లాట్ తో ఇలా ధైర్యంగా థియేటర్ మెటీరియల్ గా మార్చే రిస్క్ తీసుకున్న నిర్మాతకు సెల్యూట్ చేయడం తప్ప ఇంకే సానుకూలాంశం హత్యలో లేదు.

ADVERTISEMENT
Latest Stories