
సినిమా కధలో బలం ఉందా లేదా? హిట్టవుతుందా లేదా?అనేవి ఇప్పుడు ముఖ్యం కావు. పెద్ద హీరో… పెద్ద దర్శకుడు… పెద్ద బడ్జెట్ సినిమా అంటే కనీసం రెండు మూడేళ్ళు తీయాల్సిందే. అదీ… పాన్ ఇండియా మూవీగా తీయాల్సిందే.
నేటివిటీ… తొక్కాతోటకూర అని ఆలోచించాల్సిన పనిలేదు. ఎందుకంటే దానిలో అన్ని ఇండస్ట్రీల నుంచి ఒక్కో పెద్ద నటుడిని తీసుకువచ్చి సర్దేస్తున్నారు కనుక! ఆయా రాష్ట్రాల ప్రజలు వారి మొహాలు చూసి ఇది మన సినిమాయే అని గుడ్డిగా నమ్మేస్తారనే గుడ్డి నమ్మకం భలే అనిపిస్తుంది.
అవసరమున్నా లేకపోయినా గ్రాఫిక్స్ తప్పనిసరి. కధలో దమ్మున్నా లేకపోయినా రెండో మూడో భాగాలుగా తీయాల్సిందే. ఈ నియమాలలో ఏది పిసరంత తగ్గడానికి వీల్లేదు. తగ్గితే అవమానమే!
ప్రస్తుతం ఈ ట్రెండ్ కొనసాగుతోంది. సినిమా షూటింగ్ ఏళ్ళ తరబడి సాగదీస్తున్నంత కాలం ఎవరికీ ఎలాంటి టెన్షన్ ఉండదు. కానీ సినిమా రిలీజ్ అవుతోందంటే అందరికీ టెన్షనే. అన్నీఇంత గొప్పగా ఉన్నప్పుడు ఇంకెందుకు టెన్షన్?తెలీదు.
సినిమాలో హీరోలు కొత్త కొత్త ఆయుధాలతో వరుసగా విలన్ గ్యాంగులని నరుక్కుపోతుంటే, బయట సోషల్ మీడియాలో కూడా అభిమాలు కూడా యుద్ధాలు చేసుకుంటారు.
సినిమా రిలీజ్ అయ్యాక జరిగే యుద్దాలు మరో రకంగా ఉంటాయి. కొందరు ‘ఆహా ఓహో… సినిమా అదిరిపోయిందని’ సర్టిఫికేట్స్, ర్యాంకులు జారీ చేస్తుంటే, ‘సినిమా ఫ్లాప్ అయిన బిల్డప్ తగ్గడం లేదు. అసలు ఆ సినిమాలో ఏముందని… ఫస్ట్ హాఫ్‌లో ఏమీ లేదు. సెకండ్ హాఫ్‌లో చాలా స్లోగా ఉంది. స్క్రీన్ ప్లే, నరేషన్ బాలేదు. మ్యూజిక్ అసలే బాలేదు….’ అని యాంటీ తీర్మానాలు వినిపిస్తుంటాయి.
కనుక ఓ సినిమా నిజంగా హిట్ అయ్యిందా లేదా? అని ఎలా తెలుసుకోవడం అంటే దానికీ ఓ ఫార్ములా కనిపెట్టారు. పెద్ద సినిమాలకైతే వాటి కలక్షన్సే కొలమానం. చిన్న సినిమాలకు, బాగున్న సినిమాలకైతే ‘మౌత్ టాక్’ మాత్రమే కొలమానం.
కనుక పెద్ద సినిమాలు నెల రోజులలో కలక్షన్స్ రాబట్టుకొని ‘హిట్’ అనుకుంటే, వాటిలో బాగున్న సినిమాలు, చిన్న సినిమాలు నెలరోజులు థియేటర్లలో ఆడి హిట్ అనిపించుకుని బయట పడతాయి.
నదులన్నీ చివరికి సముద్రంలో కలిసిన్నట్లు చివరికి హిట్లు, ఫట్లు అన్నీ కూడా ఓటీటీలనే అనే మహాసముద్రంలో కలవాల్సిందే. అక్కడకు చేరుకునేసరికే సదరు సినిమా సత్తా ఏపాటితో తేలిపోతుంది కనుక ఇక వాటి గురించి ఎవరికీ టెన్షన్ ఉండదు.
అప్పుడు ఓటీటీ ప్రేక్షకులు వేడివేడిగా కాఫీలు, టీలు చప్పరిస్తూ, పళ్ళ కింద పకోడీలు వేసుకొని నమిలేస్తూ, వాటి సత్తాని బట్టి ఒకేసారి లేదా తాపీగా వాయిదాల పద్దతిలోనో చూసేస్తుంటారు.
సినిమాల గురించి వారి తీర్పులు, తీర్మానాలతో ఒరిగేదేమీ ఉండదు కనుక అక్కడితో ఆ సినిమా స్టోరీ పూర్తిగా పూర్తయిపోయిన్నట్లే!
A Reddit post has gone viral for claiming that the cybersecurity firm Fortinet has laid…
An Indian F-1 student finds herself in serious trouble. A misunderstanding at Walmart has left…