
భారత్ దౌత్య విధానం గోడ మీద పిల్లిలా ఉంటుందని విమర్శలు వినిపిస్తున్నప్పటికీ, క్లిష్ట సమయాలలో ఆ విధానమే భారత్‌ని గట్టెక్కిస్తుంటుంది.
భారత్‌కు అటు అమెరికాతో ఇటు ఇరాన్‌తో కూడా బలమైన స్నేహ సంబంధాలు, అంతకు మించి వాణిజ్యాలు ఉన్నాయి. కనుక అమెరికా-ఇరాన్ యుద్ధం మొదలైనప్పుడు గోడ మీద పిల్లిలాగే ‘నిశితంగా గమనించడానికే’ పరిమితమైంది. యుద్ధం ఆపలేనప్పుడు అదే మంచిది కదా?
కానీ ఈ యుద్ధం వలన భారత్‌కు చమురు సంక్షోభం మొదలైంది. కనుక అమెరికాతో చర్చలు జరిపి ట్రంప్ వద్దన్న రష్యా నుంచే నెలరోజులు చమురు పొందుతోంది. ఇది గోడ మీద పిల్లి దౌత్య విజయమే కదా?
ఇప్పుడు ఇరాన్ వంతు. భారత్ విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆరగ్చీతో మంగళవారం రాత్రి ఫోన్లో మాట్లాడారు. చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో భారత్ జెండాలున్న చమురు నౌకలపై దాడి చేయబోమని ఇరాన్ హామీ ఇచ్చింది.
ఈ చర్చలు జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే భారత్‌కు చెందిన పుష్పక్, పరిమళ్ అనే రెండు చమురు నౌకలు హర్మూజ్ జలసంధి దాటి భారత్ వైపు వస్తున్నాయి.
అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ఎదుర్కొంటూనే మరో పక్క వాటితో భీకర యుద్ధం చేస్తున్న ఇరాన్‌కు ఇప్పుడు ఏ దేశంతో కూడా ఇలాంటి విషయాల గురించి మాట్లాడే తీరిక, ఆసక్తి లేదు.
కానీ భారత్‌తో మాట్లాడటమే కాదు సానుకూలంగా స్పందించి సహకరిస్తోంది కూడా. ఇది కూడా గోడ మీద పిల్లి దౌత్య విజయమే కదా?
ఇంతకు ముందు రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో రష్యా అమ్ముతున్న చమురుని కొనుగోలు చేసినప్పుడు ట్రంప్ భారత్‌పై పలు ఆంక్షలు విధించి, సుంకాలు పెంచారు. అప్పుడూ వీలైనంత చమురు తెచ్చుకొని నిలువ చేసుకున్న తర్వాత ట్రంప్ ఒత్తిడి మేరకు రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు నిలిపివేసింది.
కానీ ఇందుకు ప్రతిగా వేనిజువేల నుంచి భారత్‌కు చమురు సరఫరా చేసేందుకు ట్రంప్ అంగీకరించారు. భారత్ వంటి దేశానికి ట్రంప్ ఆడమన్నట్లు ఆడాల్సిరావడం చాలా అవమానమే… చాలా బాధాకరమే. కానీ ‘అనువుగాని చోట అధికులమనరాదు’ అనే విజ్ఞతతో ముందుకు సాగుతూ భారత్ చమురు సరఫరాకు డోకా లేకుండా చూసుకుంటోంది కేంద్ర ప్రభుత్వం.
భీకర యుద్ధం చేసుకుంటున్న దేశాలను ఆ యుద్ధ సమయంలోనే ఒప్పించి ఇంత చాకచక్యంగా చమురు సంపాదించుకోవడం మామూలు విషయం కాదు కదా?
గోడ మీద పిల్లని ఎవరు అనుకున్నా పర్వాలేదు. వాళ్ళెవరూ మన చమురు, గ్యాస్ కష్టాలు తీర్చరు. కనుక ఇలాంటి సమయంలో మరక మంచిదే… తర్వాత సంస్కారవంతమైన సబ్బుతో రుద్ది కడిగేసుకోవచ్చు.
Kangan Baruah brings a flash of metallic glamour to this striking portrait series. Her silver…
The makers of the 2018 youth entertainer ‘Husharu’ have officially announced its sequel, ‘Husharu 2’.…