
Jagan 2.0 and YSRCP's Political Comeback Strategy
మన పార్టీ తప్పకుండా ఎన్నికల్లో గెలుస్తుందని నమ్మడం, పార్టీ శ్రేణులకు నమ్మకం కలిగించి ఉత్సాహపరచడం, ప్రజలకు చెప్పుకోవడం తప్పు కాదు.
కానీ ఎందుకు గెలిచి అధికారంలోకి వస్తుందో బలమైన కారణాలు కూడా చెప్పగలగాలి. ఇదివరకు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు, వాలంటీర్ల సైన్యంతో బలమైన ఓటు బ్యాంకు నిర్మించుకుంది.
కనుక జగన్ 175/175 సీట్లు మనకే అని చెప్పుకునేవారు. అది బలమైన కారణమే కానీ రాష్ట్ర ప్రజలు జగన్ ఆలోచనలు, విధానాలను తిరస్కరించి 11 సీట్లతో సరిబెట్టారు.
కానీ ఇప్పుడు ‘జగన్ 2.0’ తథ్యం అంటున్నారు. దీనికి ఆయన చెబుతున్న ఏకైక కారణం సిఎం చంద్రబాబు నాయుడు పాలనలో అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని! కనుక ప్రజలు మార్పు (జగన్ 2.0) కోరుకుంటున్నారని చెబుతున్నారు. నేటికీ రాష్ట్రంలో 38 శాతం ప్రజలు వైసీపీ వైపు ఉండటం, తన నాయకత్వంపై పార్టీలో అందరికీ అచంచలమైన విశ్వాసం కలిగి ఉండటం ఇతర కారణాలుగా కనిపిస్తున్నాయి.
అయితే ఇవి ఎన్నికలలో గెలుపుకు దోహదపడతాయి ఇవే గెలిపించలేవు. ఏవిధంగా అంటే వైసీపీ ఇప్పటి కంటే నాడు చాలా మెరుగైన పరిస్థితుల్లో ఉన్నప్పుడే ఎన్నికలలో ఓడిపోయింది కదా?
మన మనసులో కోరికలు, ఆలోచనలే ప్రజాభిప్రాయాలని భావిస్తూ, ఆత్మవంచన చేసుకుంటే మనమే నష్టపోతామని ‘జగన్ 1.0’లోనే స్పష్టమైంది కదా?
ఓ పక్క కూటమి ప్రభుత్వం పనితీరు, రాష్ట్రాభివృద్ధి, పరిశ్రమల స్థాపన, వాటితో ప్రైవేట్ ఉద్యోగాల కల్పన, జాబ్ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వోద్యోగాల భర్తీ వంటివన్నీ కళ్ళారా చూస్తున్నా అవన్నీ ఉత్తివే అని వాదిస్తోంది.
అలాగే అమరావతి, పోలవరం, వెలిగొండ వంటి భారీ ప్రాజెక్టుల నిర్మాణ పనులు చకచకా సాగుతుంటే, వాటిలో అవినీతి జరిగిపోతోందని దుష్ప్రచారం చేస్తోంది. రాష్ట్రంలో జరిగే అభివృద్ధి పనులన్నిటికీ మేమే కొబ్బరికాయలు కొట్టాము కనుక అవన్నీ మా పద్దులోనే అని వితండవాదంతో కాలక్షేపం చేస్తోంది.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ప్రధాని మోడీ, అమిత్ షాలతో సహా కేంద్ర మంత్రులతో సిఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లకు సత్సంబంధాలు కలిగి ఉండటం మరో ఎత్తు.
గత ఎన్నికలలో టీడీపి-జనసేన-బిజేపిల పొత్తుల వల్లనే వైసీపీ ఓడిపోయిందని జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు. అలాగే గతంతో పోలిస్తే ఇప్పుడు వాటి మధ్య సంబంధాలు మరింత బలపడ్డాయని తెలుసు. అవి నానాటికీ బలపడేలా చంద్రబాబు, పవన్, లోకేష్ ముగ్గురూ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని తెలుసు. అయినా జగన్ 2.0 తధ్యం అంటున్నారు.
రాజకీయంగా, అభివృద్ధిపరంగా లేదా పాలన, విధానాలపరంగా.. ఏవిధంగా చూసినా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూటమికే సానుకూల వాతావరణం కనిపిస్తోంది.
కనుక వైసీపీ చెప్తున్న ‘చంద్రబాబు నాయుడు పట్ల ప్రజలలో వ్యతిరేకత’ కాకుండా ‘జగన్ 2.0’కి ఇలాంటి బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే చెప్పగలదా?
లేకపోతే తక్షణం ఆత్మవిమర్శ చేసుకొని, పార్టీ వైఖరి సమూలంగా మార్చుకోవడం చాలా అవసరం. కాదని జగన్ 2.0 అని కాలక్షేపం చేస్తుంటే అది మరో 175/175 అవుతుంది.
BOTTOM LINE Decent Debut, Decent First Half RATING 2.25/5 Story, Screenplay, Director: Mahesh Uppala Cast:…
Amitabh Bachchan is back on the sets of Kaun Banega Crorepati 18 after taking a…