
ప్రస్తుతం వైఎస్ఆర్ కుటుంబంలో జగన్, షర్మిల మధ్య రచ్చకెక్కిన ఆస్తి వివాదాలు చూస్తుంటే పెద్దరికం సినిమాలోని “పగమో ప్రాణమయ్యేనా… ప్రేమలే దూరమయ్యేనా” అనే పాట గుర్తుకొస్తుంది. ఒకప్పుడు రాజకీయంగా, కుటుంబపరంగా ఎంతో అనుబంధంగా, ఒక్కటిగా కనిపించిన అన్నాచెల్లెళ్ల మధ్య ఇప్పుడు ఆస్తి లెక్కలు, కోర్టు వివాదాలు, వ్యక్తిగత విభేదాలు తెరమీదకు రావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ అన్నాచెల్లెళ్ల మధ్య మొదలైన ఈ వారసత్వ ఆస్తుల లెక్కలు సరిచేసేందుకు రాజన్న కుటుంబంలో ‘పెద్దరికం’ చేసేవారే కరువయ్యారా? అన్న ప్రశ్న తలెత్తుతుంది. రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులతో ప్రారంభమైన సాక్షిలో షర్మిలకు వ్యతిరేకంగా కథనాలు, విజయలక్ష్మిని వ్యతిరేకిస్తూ వార్తలు, షర్మిల పై వ్యక్తిగత దాడి, విజయమ్మ పై మానసిక ఒత్తిడి ఇవన్నీ కూడా రాజశేఖర్ రెడ్డి అభిమానులలో ఆందోళన కలిగించే అంశాలే.
ఇద్దరూ రాజన్న బిడ్డలే కానీ విజయమ్మ కు విలువుందా అంటే? తల్లి మీద కోర్టుకు వెళ్లేంత ‘ప్రేమ’ జగన్ దైతే తల్లిని సాక్షిగా చూపించి తన వాటా దక్కించుకోవాలన్నంత ‘గౌరవం’ షర్మిలదిగా కనిపిస్తుంది. ఇలా ఇద్దరూ కూడా లేని తండ్రి కూడబెట్టిన ఆస్తి కోసం ఉన్న తల్లిని మానసిక క్షోభకు గురిచేస్తున్నారు.
మేనకోడలు వివాహ వేడుక అనే కనీస కనికరం కూడా లేకుండా షర్మిల టార్గెట్ గా జగన్ చేస్తున్న ఈ రాజకీయం భవిష్యత్ లో బిడ్డల ఆస్తి పంపకాల్లో తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలి, ఎంత ముందుచూపుతో నిర్ణయాలు తీసుకోవాలి అనేదానికి ఒక హెచ్చరిక పాఠం మాదిరి పనిచేస్తుంది.
సాధారణంగా ఒక కుటుంబంలో ఆస్తి తగాదాలైన లేదా ఇతర అంతర్గత విభేదాలైన తలెత్తినప్పుడు ఆ ఇరు వర్గాల వారిని కూర్చోపెట్టి వారికీ సర్దిచెప్పి ఇంటి గుట్టు బయటకు రాకుండా కాపాడేందుకు సొంత కుటుంబంలోనే కొందరు ‘పెద్దన్న’ పాత్ర పోషిస్తారు. అయితే ఇక్కడ వైఎస్ కుటుంబంలోని ఆస్తి వివాదాలు చక్కదిద్దే ఆ పెద్దన్నే కరువయ్యారా?
అసలు యలహంక షర్మిల చెపుతున్నట్టు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంపాదనా? లేక జగన్ వాదిస్తున్నట్టు ఆయన అత్త గారి ఆస్తా? లేదా విజయమ్మ ప్రకటిస్తున్నట్టు అది షర్మిల వాటాలో భాగమా? ఇక్కడ ఒక్క యలహంక ప్యాలస్ కేంద్రంగా ఇంత రచ్చ జరుగుతున్నా వైఎస్ ఆత్మబంధువుగా చెప్పబడే పెద్దన్న ఎక్కడ? అలాగే వైఎస్ కుటుంబంతో అత్యంత సన్నిహితంగా ఉండే వైఎస్ శ్రేయోభిలాషులు ఎక్కడ?
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొన్ని దశాబ్దాల కష్టంతో, శ్రమతో తన రాజకీయ జీవితంలో ఎంతో కష్టపడి నిర్మించిన వైఎస్ అనే బ్రాండ్, దాని పై సంపాదించుకున్న గౌరవం, ప్రేమ, ఆత్మాభిమానాన్ని అన్నింటిని వైఎస్ వారసులుగా జగన్, షర్మిల బెంగళూరు వీధుల్లో, న్యాయస్థానాల్లో ‘దోషి’గా ఒకరు ‘బాధితులు’గా మరొకరు నిలబెట్టారా?
Sampath Nandi had made a promise to Dimple Hayathi, but the director could not keep…
Naga Chaitanya's birthday celebrations get a special touch as the makers of Vrushakarma release a…