
ఈ నాలుగేళ్ళలో ప్రభుత్వం ఇదివరకే శంకుస్థాపనలు జరిగినవాటి పనులు పూర్తి చేసి నేడు ప్రారంభోత్సవాలు చేస్తున్నట్లయితే, అది ఆయన ప్రభుత్వానికి, ఆయనకు కూడా ఎంతో గౌరవంగా ఉండేది. కానీ మరో 7-8 నెలల్లో ఎన్నికల గంట మ్రోగబోతుంటే మళ్ళీ శంకుస్థాపనలు చేస్తూ నవ్వులపాలవుతున్నారు.
ఇక నాలుగేళ్ళుగా రాష్ట్రంలో ప్రజలు రోడ్లు, కాలువలు, వీధి దీపాలు, తాగునీరు, సాగునీరు వంటి మౌలికసదుపాయాలు కల్పించాలని ప్రజలు జగన్ సర్కార్‌కి మొరపెట్టుకోని రోజులేదు. లక్షలాదిమంది పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ళ స్థలాలు, సంక్షేమ పధకాల కోసం కాళ్ళు అరిగిపోయేలా తిరుగుతూనే ఉన్నారు. ఉద్యోగులు జీతాల కోసం రోడ్లెక్కి ఆందోళనలు చేస్తూనే ఉన్నారు.
ఇవన్నీ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలకు తెలియనివి కావు. కానీ ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నందున, ‘జగనన్నకు చెపుదాం’ అంటున్నారు. ఒక్క ఫోన్ కొడితే చాలు… మీ సమస్యలన్నీ చిటికలో పరిష్కరించేస్తామని చెపుతున్నారు. ప్రజలు ఆశాజీవులు, అల్పసంతోషులు, అమాయకులు. కనుక తమ సమస్యలను నేరుగా నేరుగా జగనన్నతోనే చెప్పుకోవచ్చనుకొని ఫోన్ కొడితే తాడేపల్లి ప్యాలస్‌లో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ సిబ్బంది మాట్లాడుతున్నారు!
రాష్ట్ర ప్రజలందరితో ఏ ముఖ్యమంత్రి మాట్లాడలేరు ఈ ఏర్పాటును తప్పు పట్టలేము. కనీసం వారి ద్వారా జగనన్న చెవిలో పడుతుందని జనాలు భావిస్తుంటే, ప్రజల పిర్యాదులు ఆయా శాఖల అధికారులకు అక్కడి నుంచి జిల్లా అధికారులకు, మళ్ళీ అక్కడి నుంచి సంబందిత పట్టణం లేదా గ్రామాధికారులకు లేదా సచివాలయాలకు బదిలీ చేస్తున్నారు. అంటే ఇదీ…రివర్స్ గేరు ప్రయాణమే అన్నమాట!
ప్రజలు చేసిన పిర్యాదులు తాడేపల్లి మీదుగా తిరిగి తిరిగి మళ్ళీ వారు ఫిర్యాదు చేస్తున్న చోటికే చేరుకొనే మాటయితే, ఈ మాత్రం దానికి ‘జగనన్నకు చెపుదాం’ అంటూ హడావుడి చేయడం దేనికి?ప్రజలు ఎలాగూ తమ సమస్యలను సచివాలయాలలోనే చెప్పుకొంటున్నారు కదా?
పోనీ ఈవిదంగానైనా అన్ని సమస్యలు తీర్చగలరా?అంటే అనుమానమే. ఎందుకంటే పింఛనులు, సంక్షేమ పధకాలు, రోడ్ల మరమత్తులు, ఫ్లైఓవర్‌ల నిర్మాణాలకు సంబందించిన పిర్యాదులు పరిష్కరించాలంటే ‘మంత్ర దండం’ అవసరం ఉంటుంది. అది మన బిడ్డ జగనన్న దగ్గర లేదు కనుక వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ చెప్పిన్నట్లు పది పనుల్లో ఒకటో రెండో తేలికపాటివి… అంటే రోడ్లు, కాలువలు శుభ్రపరచడం వంటివి తప్పక పరిష్కరించబడతాయి. వాటన్నిటినీ పద్దులో రాసుకొన్నాక వైసీపీ నేతలు మీ ఇళ్లకు వచ్చి ‘చూశారా మీ సమస్యతో సహా రాష్ట్రంలో ఇన్ని లక్షలమంది సమస్యలను మన జగనన్న పరిష్కరించేశాడు… కనుక వైసీపీకే ఓట్లేసి గెలిపించమని’ అడగడానికి వస్తారు. అందరూ సిద్దంగా ఉండండి.
Rajinikanth's Jailer 2 is maintaining strong momentum at the box office on its second day,…
Shah Rukh Khan’s fans have been eagerly waiting for an update on his next film,…