
కొన్ని విషయాలు చాలా గమ్మతుగా ఉంటాయి. ఇందుకు తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు ఓ చక్కటి ఉదాహరణ. ఈ మెగా ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో కోటి ఎకరాలకు నీళ్ళు అందించామని బీఆర్ఎస్ నేతలు గొప్పగా చెప్పుకుంటారు.
కానీ కమీషన్ల కోసమే ప్రాజెక్టు అంచనాలు పెంచేసి నాసిరకం నిర్మాణం చేయడం వలన లక్ష కోట్ల ప్రాజెక్ట్ ఎందుకు పనికి రాకుండా పోయిందని సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు వాదిస్తున్నారు. ఈ వాదనలు అందరూ విన్నవే.
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్ ఏడాదిపాటు విచారణ జరిపి తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. దానిలో కేసీఆర్ & కో అవినీతికి పాల్పడ్డారని తేల్చేసింది.
కనుక ఏ కాళేశ్వరం గురించి కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు గొప్పలు చెప్పుకున్నారో ఇప్పుడే అదే వారి పీకలకి ఉచ్చులా బిగుసుకోబోతోంది.
ముందుగా ఆ నివేదికని శాసనసభలో ప్రవేశపెట్టి శాసనసభ సాక్షిగా కేసీఆర్ & కో చేసిన దోపిడీ గురించి రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని సిఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఆ తర్వాత సీఐడీ లేదా సిట్‌కి అప్పగిస్తారు.
అయితే ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది. “కేసీఆర్‌ని అరెస్ట్ చేసే దమ్ము, ధైర్యం రేవంత్ రెడ్డికి లేవు కనుక ఈ కేసుని సీబీఐకి అప్పగించాలని,” తెలంగాణ బీజేపి నేతలు కోరుతున్నారు.
ఈ కేసుతో పెను ప్రమాదం పొంచి ఉందని ముందే పసిగట్టిన కేసీఆర్, దీని నుంచి తప్పించుకునేందుకు తన పార్టీని బీజేపిలో చేసేయాలనుకున్నారని కాంగ్రెస్ నేతలు అనుమానిస్తున్నారు.
ఒకవేళ తాము ఈ కేసుని సీబీఐకి అప్పగిస్తే, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని బీజేపిలో విలీనం చేసి లేదా లోపాయికారీ పొత్తులు పెట్టుకోనో ఈ కేసును అటకెక్కించేస్తారని కాంగ్రెస్ నేతలు అనుమానిస్తున్నారు.
అయినా కేసీఆర్‌ని, బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా భూస్థాపితం చేసేందుకు తమ చేతిలో ఉన్న ఈ వజ్రాయుధాన్ని కేంద్రానికి ఎందుకు అప్పగించాలి?రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ లేకపోతే బీజేపిని ఎదుర్కోవడం కాంగ్రెస్ పార్టీకి చాలా సులువు. కనుక దీనిని తామే ఉపయోగించుకొని బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయగలిగితే మళ్ళీ మరోసారి అధికారంలో రావచ్చు కదా?అని కాంగ్రెస్ నేతలు ఆలోచించడం సహజం.
కనుక లక్ష కోట్ల రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు రైతులకు ఉపయోగపడకపోయినా కాంగ్రెస్, బీజేపిలకు బాగా ఉపయోగపడబోతున్నట్లే ఉంది. నీళ్ళ కోసం కట్టిన ప్రాజెక్టు రాజకీయాలకు ఉపయోగపడుతుండటం గమ్మత్తుగానే ఉంది కదా?
The Kollywood film Mandaadi starring Soori and Suhas in lead roles and directed by Mathimaran…
Victory Venkatesh, Nandamuri Kalyanram are coming together for the first time in the direction of…