
మొదట్లో మోడీ-అమిత్ షాలతో కేసీఆర్ రాసుకుపూసుకు తిరుగుతూ రాష్ట్రంలో బిజెపి పట్ల ప్రజలకు అపనమ్మకం కలిగేలా చేశారు. బిఆర్ఎస్, బిజెపిల మద్య ఏదో ఉందనే అనుమానం ప్రజలలో బలంగా నాటుకొనేలా చేశారు. అప్పుడు కేంద్రంతో సఖ్యతగా ఉన్నందున ఈ అనుమానాల వలన బిఆర్ఎస్కు ఎటువంటి నష్టమూ లేదు కానీ తెలంగాణలో ఎదగాలని ప్రయత్నిస్తున్న బిజెపి తీవ్రంగా నష్టపోయింది.
అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ పుంజుకొంది. ఆనాడు బిజెపి-బిఆర్ఎస్ మద్య ఏదో రహస్య అవగాహన ఉందనే అనుమానాలనే బిఆర్ఎస్ మెడకు ఉరితాడులా బిగించేందుకు ప్రయత్నిస్తోంది. రాహుల్ గాంధీ, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తదితర కాంగ్రెస్ నేతలు కేసీఆర్-మోడీల మద్య రహస్య అవగాహన ఉందని, బిజెపికి బిఆర్ఎస్ బీ-టీమ్ అని గట్టిగా ప్రచారం చేస్తున్నారు.
అందుకే కేసీఆర్ కర్ణాటక ఎన్నికలలో బిఆర్ఎస్ని పోటీ చేయించలేదని, అందుకు ప్రతిగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత విషయంలో ఈడీ వెనక్కు తగ్గిందని వాదిస్తున్నారు.
పాట్నాలో బిజెపిని వ్యతిరేకిస్తున్న పార్టీలన్నీ సమావేశమయ్యి కూటమి ఏర్పాటు గురించి చర్చిస్తే, కేసీఆర్ దానికి హాజరుకాకపోగా తన కుమారుడు కేటీఆర్ని అమిత్ షా, రాజ్నాధ్ సింగ్ వద్దకు రాయబారానికి పంపరని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. కనుక బిఆర్ఎస్కి ఓట్లేసి గెలిపిస్తే బిజెపిని గెలిపించినట్లే అని వాదిస్తున్నారు. కాంగ్రెస్ వాదనలు ప్రజలకు బాగానే చేరుతున్నాయి.
కర్ణాటక శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ గెలిచి అక్కడ అధికారంలోకి రావడంతో ఈసారి ఎలాగైనా తెలంగాణలో కూడా అధికారంలోకి రావాలని పట్టుదలగా ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ చేస్తున్న ఈ ప్రచారం వలన ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ నష్టపోతుందని గ్రహించిన కేసీఆర్ అప్రమత్తమయ్యారు.
కాంగ్రెస్ ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టవల్సిందిగా మంత్రులు, ఎమ్మెల్యేలను ఆదేశించారు. అందుకే నేడు ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్లపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారని చెపొచ్చు. అయితే ఆనాడు తాను బిజెపి విశ్వసనీయతను దెబ్బ తీయడానికి ప్రయోగించిన అస్త్రాన్నే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తమపైకి ప్రయోగిస్తుందాని బహుశః కేసీఆర్ కూడా ఊహించి ఉండరేమో?
Kiran Abbavaram, who has acted in several successful films, is making his directorial debut with…
Nagarjuna has decided to present the film Itllu Arjuna under his Annapurna Studios banner after…