
ఇటీవల మహారాష్ట్రలో శివసేన సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏక్‌నాథ్ షిండే అనే కట్టప్ప సాయంతో కూల్చివేసి అతనితోనే కలిసి బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తరువాత హైదరాబాద్‌లో రెండు రోజులపాటు బిజెపి జాతీయ కార్యవర్గసమావేశాల హడావుడి చేసింది. బిజెపి రాజ్యసభ సభ్యుడు కే.లక్ష్మణ్ నిన్న ఢిల్లీలో మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీలో కట్టప్పలున్నారని, వారు సమయం వచ్చినప్పుడు పార్టీని, ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి సిద్దంగా ఉన్నారని అన్నారు.
ఇవన్నీ చూస్తున్న సిఎం కేసీఆర్‌కు భయం పుట్టుకొందని, కనుక ఆయన జాతీయ రాజకీయాల ఆలోచన విరమించుకొని మళ్ళీ తెలంగాణలో తన పార్టీని బలోపేతం చేసుకొనే పనిలో పడ్డారని మీడియాలో జోరుగా వార్తలు వచ్చాయి.
కానీ తాను ఇటువంటి తాటాకు చప్పుళ్ళకు భయపడేవాడిని కానని సిఎం కేసీఆర్ నిరూపించుకొన్నారు. తన మంత్రులతో కలిసి ఆదివారం ప్రగతి భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించి, ప్రధాని నరేంద్రమోడీపై తీవ్ర విమర్శలు చేశారు.
మోడీ అసమర్దుడని ఆయనకు తెలిసే లక్షల కోట్లు అవినీతి జరుగుతోందని కేసీఆర్ ఆరోపించారు. మరికొంత కాలం మోడీ దేశానికి ప్రధానిగా ఉంటే దేశం మళ్ళీ ఎప్పటికీ కోలుకోలేని స్థాయికి పతనం అయిపోతుందని అన్నారు. కనుక దేశహితం కోసం ప్రధాని నరేంద్రమోడీని గద్దె దించక తప్పదని అన్నారు. ఇందుకోసం తాను జాతీయ పార్టీతో జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించబోతున్నట్లు సిఎం కేసీఆర్ చెప్పారు.
బిజెపి నిసిగ్గుగా ప్రజా ప్రభుత్వాలను కూల్చి దొడ్డిదారిలో అధికారం చేజిక్కించుకొంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపికి దమ్ముంటే తన ప్రభుత్వాన్ని కూలద్రోయాలని సిఎం కేసీఆర్ సవాల్ విసిరారు. ముందస్తు ఎన్నికలకి టిఆర్ఎస్ సిద్దంగా ఉందని, మోడీ కూడా తన ప్రభుత్వాన్ని రద్దు చేసుకొని ఎన్నికలకి డేట్ ఫిక్స్ చేసి ప్రకటించాలని సిఎం కేసీఆర్ సవాల్ విసిరారు.
బిజెపి నేతలు గొప్పగా చెప్పుకొనే డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణలో లేకపోయినా, తమ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసి దేశంలో అగ్రస్థానంలో నిలుపిందని చెప్పారు. కానీ తెలంగాణతో పోలిస్తే డబుల్ ఇంజిన్ సర్కారులున్న బిజెపి పాలిత రాష్ట్రాలలో దయనీయ పరిస్థితులు నెలకొని ఉన్నాయని సిఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వానికి, బిజెపి అధిష్టానానికి దమ్ముంటే ముందస్తు ఎన్నికలకు రావాలని సిఎం కేసీఆర్ సవాల్ విసిరారు.
Chatrapathi is set to re-release in a 4K version this year on the occasion of…
Following the terrible failure of Retro, director Karthik Subbaraj made a comeback with his indie…