
ఏపీ మద్యం కుంభకోణం విచారణ క్లైమాక్స్‌కి వచ్చేసిందా?నేడో రేపో వైసీపీ పెద్దలందరికీ నోటీసులు అందబోతున్నాయా? అంటే అవుననే అంటున్నారు మాజీ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. ఈ కుంభకోణంలో కర్త, ఖర్మ, క్రియ అన్నీ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని తాను మొదటే చెప్పానన్నారు.
అంతే కాదు.. ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతీ వైసీపీ నేతని బట్టలూడదీసి చట్టం ముందు దోషులుగా నిలబెట్టేందుకు దర్యాప్తు అధికారులకు తాను అన్నివిధాలా సహకరిస్తానని విజయసాయి రెడ్డి అన్నారు.
విజయసాయి రెడ్డి ఈ మద్యం కుంభకోణంతో తనకు ఎటువంటి సంబందమూ లేదని ఆయన చెప్పుకుంటున్నప్పటికీ, దీనికి బీజం తన నివాసంలోనే పడిందని ఆయనే స్వయంగా చెప్పుకున్నారు.
ఇప్పుడు ఈ కుంభకోణం గురించి తనకు తెలిసిన ప్రతీ సమాచారం పోలీసులకు ఇస్తానని విజయసాయి రెడ్డి చెపుతున్నారు.
వైసీపీలో ఉన్నప్పుడు జగన్ తర్వాత రెండో స్థానంలో విజయసాయి రెడ్డి ఉండేవారు. కనుక ఆయనకు తెలియని విషయమంటూ ఏమీ ఉండదు. కనుక ఈ కేసులో ఆయన చెప్పే ప్రతీ మాటకు చాలా విలువ ఉంటుంది. చాలా కీలకంగా మారబోతోంది. అంటే ఈ కేసులో ఆయన అప్రూవరుగా మారేందుకు అంగీకరించారని అనుకోవచ్చు.
మరోపక్క ఈ కేసులో కర్త, ఖర్మ, క్రియగా వ్యవహరించిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే జగన్ కోటరీలో కీలకంగా వ్యవహరించిన ఏపీ ఇంటలిజన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులుని కూడా వేరే కేసులో పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు.
ఇప్పటికే ఈ కేసులో కీలకంగా భావిస్తున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, ఏపీఎస్ బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవరావుతో సహా పలువురిని విచారించారు. కనుక ఇదే వేగంతో ఈ కేసు విచారణ సాగితే, తర్వాత వైసీపీ పెద్దలందరి పేర్లు బయటకు వస్తాయి. ఈ మద్యం కుంభకోణంలో వారి పాత్రలు, దిగమింగిన సొమ్ము తాలూకు వివరాలన్నీ బయటకు వస్తాయి.
కనుక పాత సినిమాలలో క్లైమాక్స్ సన్నివేశం ముగిసే ముందు హీరో, హీరోయిన్, ముఖ్య పాత్రదారులు, విలన్లు అందరూ ఏవిదంగా ఒక చోట చేరేవారో అలాగే ఈ మద్యం కుంభకోణం కేసులో కూడా దాదాపు అందరూ ఒక సీన్‌లోకి వచ్చేసిన్నట్లే కనిపిస్తోంది.
పాత సినిమాలలో క్లైమాక్స్ సన్నివేశంలో హటాత్తుగా పోలీసులు వచ్చి ‘హ్యాండ్సప్ యూఆర్ అండర్ అరెస్ట్’ అంటూ అందరినీ అరెస్ట్ చేసేవారు. కానీ ఈ కేసులో పోలీసులే ముందుగా నిందితులందరినీ ఒకరొకరిగా ముందే అరెస్ట్ చేస్తున్నారు లేదా నోటీసులు ఇచ్చి ప్రశ్నిస్తున్నారు. కనుక మద్యం కుంభకోణం విచారణ కూడా క్లైమాక్స్‌కి వచ్చేసినట్లే అనిపిస్తోంది.
కానీ వైసీపీ నేతలు మాత్రం, “మా హయాంలో మద్యం ఉత్పత్తి, అమ్మకాలు అన్నీ చాలా పారదర్శకంగా జరిగాయి. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మసిపూసి మారేడు కాయ చేసినట్లుగా ఈ కేసు సృష్టించి, ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా నిరాధారమైన ఆరోపణలతో మమ్మల్ని రాజకీయంగా వేధిస్తున్నారు. ఈ తాటాకు చప్పుళ్ళకు భయపడే ప్రసక్తే లేదు,” అని మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. వైసీపీ నేతలకు ఈ నమ్మకం, ధైర్యం ఉంటే మంచిదేగా?
Tollywood’s December release race is getting more interesting, with Nithiin’s Alias Rukmini joining the December…
Vijay’s son Jason Sanjay chose to make his entry into films as a director rather…