
మాజీ మంత్రి కొడాలి నాని మళ్ళీ చాలా కాలం తర్వాత పార్టీ కార్యకర్తల మధ్యకు వచ్చారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ వైసీపీ చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమంలోపాల్గొన్నారు.
ఈ సందర్భంగా అయన మీడియాతో మాట్లాడుతూ, “నాకు బైపాస్ సర్జరీ జరిగినందున వైద్యుల సూచన మేరకు ఆరు నెలలు విశ్రాంతి తీసుకున్నాను. ఇక నుంచి పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటాను. మరో ఆరు నెలల తర్వాత పూర్తి స్థాయిలో పనిచేస్తాను. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజల తరపున కూటమి ప్రభుత్వంతో పోరాడుతాను.
కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులతో వైసీపీ కార్యకర్తలని వేధిస్తోంది. వారికి అండగా నిలబడి పోరాడుతాను. వచ్చే ఎన్నికలలో మళ్ళీ వైసీపీని గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేస్తాను,” అని కొడాలి నాని చెప్పారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొడాలి నాని చంద్రబాబు నాయుడుని ఆయన సతీమణి భువనేశ్వరిని, వారి కుమారుడు నారా లోకేష్‌ని ఉద్దేశ్యించి చాలా అనుచితంగా మాట్లాడేవారు. కనుక కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొడాలి నానిపై కటిన చర్యలు తప్పవని నారా లోకేష్ యువగళం పాదయాత్రలో చెప్పారు.
కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్ట మొదట కొడాలి నానితో మొదలు పెడతారనుకుంటే, వేరే కేసులలో వైసీపీలో ఇతర నేతలపై చర్యలు ప్రారంభించింది కూటమి ప్రభుత్వం.
ఆ తర్వాత కొడాలి నానికి గుండెపోటు రావడంతో హైదరాబాద్‌లోని ఓ హాస్పిటల్లో చేరి కొన్ని రోజులు చికిత్స పొందారు. వైద్యుల సూచన మేరకు తర్వాత ముంబాయి ఆస్పత్రిలో చేరగా అక్కడ గుండెకు బైపాస్ సర్జరీ చేశారు. ఆరు నెలల విశ్రాంతి తర్వాత ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు.
బైపాస్ సర్జరీ చేయించుకున్న కారణంగా ఇంతకాలం అయన కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వంతో పోరాటాలకి రెడీ అని చెపుతున్నారు. కొడాలి నాని పోరాటాలంటే బూతులే. కనుక ఇక నుంచి అయన ఎవరిని బూతులు తిడతారో అందరికీ తెలిసిందే.
కనుక ప్రభుత్వం కూడా అటక మీద నుంచి కేసులు ఫైల్స్ కిందకు దించి చర్యలు మొదలు పెడుతుందా? లేదా మొదట ఆయనకే బ్యాటింగ్ అవకాశం ఇస్తుందా? చూడాలి.
Telugu cinema seems to be getting increasingly comfortable with extreme violence. But the latest Ranabaali…
Over the past two weeks, many USICS applicants have received a concerning notice from the…