
మనిషి జీవితం ఎప్పుడు, ఎవరికీ వడ్డించిన విస్తర మాదిరి నిండుగా సంతోషాన్ని అందించదు. కొన్ని కొన్ని సందర్భాలలో చిన్న చిన్న సంతోషాలకు కూడా పెద్ద పెద్ద త్యాగాలు చెయ్యాల్సి ఉంటుంది, భారీ శ్రమ పడాల్సి వస్తుంది.
మనిషి జీవితం ఒక వైకుంఠపాళి ఆట మాదిరి, ఒక్కో సారి ఎదుగుదల అనే నిచ్చెన దొరుకుతుంది, మరోసారి ఎదురుదెబ్బలు అనే పాము కాటులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదిఏమైనా లక్ష్యం వైపు అడుగులు వేస్తూనే జీవన ప్రయాణాన్ని కొనసాగించాల్సి ఉంటుంది.
అలాగే ఈ జీవితంలోనే ఓటమి అనే అవమానాలను మోయాలి, గెలుపు అనే ఆనందాలను అనుభవించాలి. ఇక కష్టాలు అనే సుడిగుండాలను చూడాలి, సుఖాలు అనే సంతోషాన్ని ఆస్వాదించాలి. కానీ చాలామంది ఈ ఎత్తుపల్లాల పల్లకిలో ఎత్తులను ఎంజాయ్ చేస్తున్నారు కానీ పల్లాలను తట్టుకోలేకపోతున్నారు.
క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటూ దిద్దుకోలేని తప్పులను చేస్తున్నారు, సరిదిద్దలేని పొరపాట్లకు కారకులుగా మారుతున్నారు. చదువు దగ్గర నుంచి ఉద్యోగం వరకు, ఉద్యోగం దగ్గర నుంచి విలాసం వరకు, ప్రేమ దగ్గర నుంచి పెళ్లి వరకు, పెళ్లి దగ్గర నుండి పిల్లల వరకు ఇలా ప్రతి విషయంలోనూ పంతానికో, పట్టుదలకో పోయి జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు.
చెప్పేవారు లేక కొందరు, చెప్పినా వినే మనస్తత్వం లేక మరికొందరు, ఒత్తిడికి కొందరు, కోరుకున్న జీవితం దక్కలేదని కొందరు ఇలా నిత్యం ఉన్నదాన్ని వదులుకుని లేని దాని కోసం పరుగులు పెడుతూనే ఉంటున్నాడు, చేతిలో ఉన్న ఆనందాన్ని వదులుకుని కంటికి కనిపించని సంతోషం కోసం వెతుకుతూనే ఉంటున్నాడు.
కష్టపడితే కానీ ఫలం దక్కని ఈ రోజులలో అసలు ఒంటికి శ్రమే లేకుండా లక్షలు ఆర్జించాలనే అత్యాశ కొందరిదైతే, ఒంటి నిండా చమట పట్టేలా శ్రమించినా పూట గడవని ఆకలి కేకలు మరికొందరిది. ఇక తరాల తరబడి కూర్చొని తిన్నా తరగని ఆస్తి ఉంది కూడా ఇంకా ఎదో కావాలి అనే అసంతృప్తి ఇంకొందరిది.
ఉన్నవాడు ఉన్నదాన్ని రెండు, మూడింతలు చేయడం కోసం ఆరాటపడుతుంటే, లేని వాడు రోజు పొట్టకూటి కోసం పోరాటం చేస్తాడు. ఇక మధ్యతరగతి వాడు రేపటి కోసం ఆలోచిస్తూ ప్రస్తుతాన్ని మరచి పోయి గతంలోనే బతుకుతూ ఉంటారు. ఇలా మనిషి భూమి మీద పుట్టింది మొదలు మట్టిలో కలిసే వరకు నిత్యం తన ప్రయాణంలో బతుకు పోరాటాన్ని కొనసాగించాల్సిందే..!
For the first time in Bigg Boss history, there is a double eviction in the…
Toxic has emerged as an epic disaster at the box office. While the movie bombed…