
కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల స్థానాలను 50 శాతం పెంచేందుకు గాను ఈ పార్లమెంట్ సమావేశాలలోనే బిల్లు ప్రవేశపెట్టబోతోంది. ఈ ప్రతిపాదనపై తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు.
ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “ఇదొక పెద్ద కుట్ర! ఇప్పటికే పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాలకు తగిన ప్రాతినిధ్యం, ప్రాధాన్యం లేదు. ఇప్పుడీ ప్రతిపాదనకు పార్లమెంట్ ఆమోదముద్ర వేస్తే, ఇక దక్షిణాది రాష్ట్రాల ప్రమేయం లేకుండా, కేవలం ఉత్తరాది రాష్ట్రాల ఓట్లతోనే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటవుతుంది.
కనుక ఇది రాజకీయ పార్టీలకు సంబందించిన సమస్య కాదు. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల సమస్య! అందరూ కలిసి కట్టుగా పోరాడి దీనిని అడ్డుకోవాల్సి ఉంది. లేకుంటే దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుంది,” అని అన్నారు.
మొదట జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచుదామని కేంద్ర ప్రభుత్వం భావించింది. కానీ ఆవిధంగా చేస్తే తక్కువ జనాభా కలిగిన దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ సీట్లు, ఎక్కువ జనాభా కలిగిన ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ లోక్‌సభ సీట్లు లభిస్తాయి.
అప్పుడు పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాలకు తగిన ప్రాతినిధ్యం ఉండదని దక్షిణాది పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. దాంతో కేంద్ర ప్రభుత్వం ఆ ప్రతిపాదనను పక్కన పెట్టి అన్ని రాష్ట్రాలకు ఒకే విధంగా 50 శాతం సీట్లు పెంచాలనే ఈ ప్రతిపాదన చేసింది.
కానీ పళ్ళూడగొట్టుకునేందుకు ఏ రాయి అయితేనేమి?అన్నట్లు ఈ ప్రతిపాదనతో కూడా జరుగబోయేది అదేనని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
సిఎం రేవంత్ రెడ్డి ఈ ప్రతిపాదన వెనుక ఇమిడి ఉన్న పెద్ద కుట్రని బయటపెట్టి దక్షిణాది రాష్ట్రాలన్నీ పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కానీ దీనికి కాంగ్రెస్ అధిష్టానం అంగీకరిస్తుందా?ఎందుకంటే అది కూడా జాతీయపార్టీయే కనుక ఈ తాజా ప్రతిపాదనతో దానికీ కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు మెరుగుపడతాయి కదా?
కనుక కాంగ్రెస్ అధిష్టానం అభిప్రాయం, అనుమతి తీసుకునే సిఎం రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడారా? దాని అనుమతి లేదనుకుంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సిఎం రేవంత్ రెడ్డి పోరాటానికి మద్దతు లభిస్తుందా?
ఈ ప్రతిపాదనపై సిఎం రేవంత్ రెడ్డి 24 గంటలలో స్పందించారు. మరి 80 వేల పుస్తకాలు చదివిన మహా మేధావి, అపర చాణక్యుడు ఇంకా స్పందించనే లేదు! తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోందని వాదించే బీఆర్ఎస్ పార్టీ కలిసి వస్తుందా?
ఈ పోరాటానికి ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలలో ఎన్ని ప్రాంతీయ పార్టీలు పోరాటానికి ముందుకు వస్తాయి? ఎన్డీయేలో భాగస్వాములుగా ఉన్న టీడీపి, జనసేనలు ఈ ప్రతిపాదనని ధైర్యంగా వ్యతిరేకించగలవా?సింగిల్ సింహానికి కేంద్రానికి వ్యతిరేకంగా ఘర్జించే దమ్ముందా?
తమిళనాడులో అధికార డీఎంకేతో కాంగ్రెస్, ప్రతిపక్ష అన్నాడీఎంకేతో బిజేపి ఉన్నాయి. కనుక అవి నోరెత్తగలవా? కేరళలో కాంగ్రెస్ లేదా వామపక్షాల మద్య అధికార మార్పిడి జరుగుతుంటుంది. ఈ ప్రతిపాదనపై అవి అభ్యంతరం చెప్పగలవా?
అసలు ప్రతిపక్షాల అనైక్యత, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల రాజకీయ పరిమితులు, సమీకరణాలు, విభేదాలు, విద్వేషాలు అవినీతి కేసులే వాటిని ఒకటి కాకుండా చేస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలపై అవి కలిసి ఎలా పోరాడగలవు?
సిఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు దక్షిణాది ఓట్లు, సీట్లు అవసరం లేకుండా కేంద్ర ప్రభుత్వం ఏర్పడితే దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి ఏమిటి? దీనిపై ఇంకా చాలా లోతుగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది.
Crazy Kalyanam is moving ahead of its theatrical release by arriving earlier than originally planned.…
There is a different side of Teja Sajja to be seen in The Traitors Telugu.…