
తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం ‘మా’ అనే అనుబంధంతో ముడిపడి ఉంటుంది అంటూ సగర్వంగా చెప్పుకునే సినీ పెద్దలు అసలు వాస్తవ రూపంలో మాత్రం ‘మా’ అంటే మాకేం సంబంధం అంటూ వ్యవహరిస్తున్నారు.
సినిమాలలో ఎదురు వాడి కష్టం చూసి తానేమైనా పర్వాలేదు అంటూ 100 మందిని సైతం ఒంటి చేతితో మట్టి కరిపించే మన హీరోలు నిజ జీవితంలో మాత్రం తమ తోటి నటుడికి కష్టం వస్తే కనీసం మాట సాయం కూడా చేయడానికి వెనకడుగు వేస్తున్న వైనాలు కోకొల్లలు.
వీరి ‘మాకెందుకులే’ అనే నిర్లక్ష్య ధోరణి రాజకీయ పార్టీలకు, ఆయా పార్టీల నాయకులకు, ప్రభుత్వాలకు వరంలా మారుతున్నాయి. మొన్న ఇండస్ట్రీ పెద్దన్న అని చెప్పుకునే చిరు వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం అనుసరించిన తీరు దగ్గర నుంచి నేడు నాగార్జున కుటుంబ వ్యక్తిగత వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు అనుసరిస్తున్న విధానం వరకు ఇండస్ట్రీ నుండి ‘మా’కెందుకులే అనే ధోరణే కనిపిస్తుంది.
లక్షల కోట్ల అవినీతి మరకలు మోస్తున్న నాయకులకు మద్దతు దొరుకుతుంది, అలాగే కేసులలో ఇరుక్కుని కోర్టుల చుట్టూ తిరిగే నేతలకు మేమున్నాం అనే భరోసా కనిపిస్తుంది, కానీ నటన తప్ప మరేమి తెలియని సినీ వర్గాల విషయంలో ఒకరి నుండి ఒకరికి కనీస సహకారం ఎందుకు కరువవుతుంది.? తమ తోటి నటుడిని అగౌరవ పరిచినా, వారి కుటుంబ పరువుని బజారుకు లాగినా వారికి మద్దతుగా సినీ పెద్దలుగా చెప్పుకునే స్టార్ లు ఎవ్వరు ముందుకు రారు ఎందుకు?
వీరి మాకెందుకెలే అనే మౌనం సినీ ఇండస్ట్రీకి శాపంలా మారుతున్నా వారిలో చలనం మాత్రం శూన్యమనే చెప్పాలి. గతంలో పవన్ కు సంబంధం లేని విషయంలో శ్రీరెడ్డి అనే మహిళ అతని తల్లిని అవమానించినా, అలాగే ఇండస్ట్రీకి సంబంధించిన పోసాని లాంటి వారు పవన్ కూతుర్ల విషయంలో సమాజం సిగ్గుపడేలా అసభ్యకర వ్యాఖ్యలు చేసినా ఇండస్ట్రీ తరుపున ఆ వ్యాఖ్యలను ఖండించి పవన్ కు మద్దతుగా రెండు మాటలు మాట్లాడడానికి కూడా ఎవ్వరు ఆసక్తి చూపలేదు.
అలాగే పవన్ ను టార్గెట్ చేయడానికి ఆయన వ్యక్తిగత విషయాల ప్రస్తావన తీసుకొచ్చి రాజకీయాలకు సంబంధం లేని మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసేలా వైసీపీ నేతలు ప్రవర్తించినా ఇది తప్పు అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీయడానికి సినీ పరిశ్రమ నుండి ఒక్కరుకూడా సాహసించలేదు. ఇదేనా తోటి నటుడి పట్ల వారి కుటుంబాల పట్ల ‘మా’ ఇచ్చే గౌరవం.?
ఇప్పుడు సమంత – నాగ చైతన్య వివాహ బంధం గురించి, నాగార్జున కుటుంబ పరువు గురించి రాజకీయ నాయకులుగా చెలామణి అయ్యే పెద్దమనుషులు అందునా మహిళలు బహిరంగంగా ప్రకటనలు జారీ చేస్తున్నా ఇంకా అదే మెతక వైఖరి అవలంబిస్తూ మిన్నకుండి పోయింది ‘మా’. మాకెందుకులే అనే భావన, మాకేం సంబంధం అనే నిర్లక్ష్యం రెండు కలిసి ‘సిని’మా ప్రపంచాన్ని రాజకీయ నాయకుల రాజకీయ అవసరాలకు బలి చేస్తున్నాయి.
ప్రకృతి విపత్తులు సంభవించి రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించిన పరిస్థితులలో అటు ప్రజలకు, ఇటు ప్రభుత్వానికి తమవంతు చేయూతగా మేము సైతం అంటూ పోటీ పడి మరి సాయానికి ముందడుగు వేసే సినీ తారలు, తమ సినిమా కుటుంబ సభ్యుల విషయంలో మాత్రం కనీసం మాట సాయం చేయడనికి కూడా ఎందుకు వెనకడుగు వేస్తుంది.?
‘మా’ అంటూ గొప్పగా పేరు పెట్టుకుని ఇది ‘మా కుటుంబం’, ‘సినిమా కుటుంబం’ అంటూ జబ్బలు చరుచుకోవడం కాదు, కష్టంలో ఒకరికొకరు మద్దతుగా నిలబడాలి, అవసరమైతే ప్రభుత్వాలతో తలపడాలి కూడా. ఐకమత్యం మాటలలో కాకుండా చేతలలో చూపించిన నాడు ఇండస్ట్రీకి మంచి రోజులు వస్తాయి. ఒక సినిమా హిట్ అయ్యి కలెక్షన్ల మోత మోగిస్తున్నప్పుడు కాదు ఒకరు కష్టంలో కన్నీరు కారుస్తున్నప్పుడు వారికి మేమున్నాం ఇది మన సమస్య అని ముందుకొచ్చిన నాడు సినీ తారల అద్దాల మెడల జీవితాలకు రక్షణ దొరుకుతుంది.
A Reddit post has gone viral for claiming that the cybersecurity firm Fortinet has laid…
An Indian F-1 student finds herself in serious trouble. A misunderstanding at Walmart has left…