
ప్రముఖ సినీ నిర్మాత, జూబ్లీహిల్స్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తల్లి మహానంద కుమారి తన కుమారుడి మరణంపై అనుమానాలు ఉన్నాయంటూ శనివారం హైదరాబాద్, రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు.
ఈరోజు హైదరాబాద్, సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం కూడా నిర్వహించి మాట్లాడారు. ఆమె ఏమన్నారంటే, “నా కొడుకు గోపీనాథ్ కిడ్నీలు చెడిపోవడం వలన డయాలసిస్ చేయించుకునేవాడు. అలాంటి పరిస్థితిలో ఉన్న నా కొడుకు అనారోగ్యంతో హాస్పిటల్లో చేరినప్పుడు, నేను చూసేందుకు వెళితే నన్ను లోనికి అనుమతించలేదు. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌ని అనుమతించారు.
సొంత తల్లినైన నన్ను అనుమతించకుండా కేటీఆర్‌ని అనుమతించడంపై నేను అభ్యంతరం చెప్పినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. డయాలసిస్ పేషంట్ అయిన నా కొడుకుని అటెండర్ కూడా లేకుండా రూములో ఒంటరిగా వదిలేశారు.
నా కొడుకు చనిపోయిన వార్తను కూడా చాలా సేపు బయటపెట్టలేదు?ఈ విషయం నాకు చాలా ఆలస్యంగా తెలిసింది. నా కొడుకు గోపీనాథ్ మూడుసార్లు ఎమ్మెల్యేగా చేశాడు. తను చనిపోతే కనీసం ఒక్క రోజు ఆగలేదు. ఏపీలో ఉన్న మా బంధువులు రాకుండానే హడావుడిగా 5 గంటల్లోనే అంత్యక్రియలు చేసేశారు. ఎందుకు?
నా కొడుకు మృతిపై నాకు అనుమానాలున్నాయి. అందుకే పోలీసులను విచారణ జరిపి నిజానిజాలు బయటపెట్టాలని కోరను,” అని మాగంటి గోపీనాథ్ తల్లి మహానంద కుమారి అన్నారు.
మూడు రోజుల క్రితం కేంద్ర మంత్రి బండి సంజయ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికళ ప్రచారంలో ఇదే అంశం లేవనెత్తి కేటీఆర్‌పై అనుమానాలు వ్యక్తం చేశారు. గోపీనాథ్ ఆస్తుల విషయంలో కేటీఆర్ జోక్యం చేసుకున్నారని, కనుక ఆయనని అరెస్ట్ చేసి విచారణ జరపాలని బండి సంజయ్ కోరారు.
ఇప్పుడు మాగంటి గోపీనాథ్ తల్లి మహానంద కుమారి స్వయంగా పోలీసులకు పిర్యాదు చేసి, ప్రెస్‌మీట్‌లో ఇవన్నీ చెప్పారు.
మంగళవారం జూబ్లీహిల్స్ పోలింగ్ జరుగబోతోంది. ఇటువంటి కీలక సమయంలో గోపీనాథ్ తల్లి పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేయడం, ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడటం వెనుక ఓ రాజకీయ పార్టీ ఉండవచ్చు. కనుక ఇది రాజకీయ ప్రేరితమే అయితే పోలింగ్ తర్వాత ఈ ప్రస్తావన వినిపించకపోవచ్చు.
కానీ ఈ వ్యవహారం ముదిరి న్యాయస్థానం వరకు వెళ్ళినట్లయితే మాగంటి గోపీనాథ్ కుటుంబ వ్యవహారాలు, రాజకీయ పార్టీల ప్రమేయం గురించి ఇంత వరకు ఎవరికీ తెలియని కొత్త విషయాలు బయటపడే అవకాశం ఉంటుంది. మరీ వ్యవహారం ఎక్కడి దాక వెళుతుందో త్వరలోనే తెలుస్తుంది.
Vijay Deverakonda’s Ranabaali is heading towards its USA premieres, but the early pre-sales are raising…
There may have been serious differences between Tanushree Dutta and Nana Patekar, but death is…