
నేడు మహాశివరాత్రి.. సందర్భంగా రాష్ట్రంలో శివాలయాలన్నీ తెల్లవారుజాము నుంచే భక్తులతో కిటకిట లాడుతున్నాయి. ఆలయాలు శివ నామస్మరణతో మారుమ్రోగుతున్నాయనే విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
మిగిలిన పర్వదినాలకు పూర్తి భిన్నమైనది శివరాత్రి. ఇతర పండుగలు పర్వదినాలలో పిండి వంటలు వండి నైవేద్యాలు సమర్పిస్తారు. కానీ శివరాత్రికి ఉపవాసాలు చేస్తారు.
ఉపవాసం, ధ్యానం, అర్చన, అభిషేకం, జాగరణ అనే ఐదు క్రియలతో పరమేశ్వరుని ఆరాధిస్తే చాలు ఆ దేవదేవుడు తృప్తి చెందుతాడు. నోరు తిరగని సంస్కృత శ్లోకాలతో పూజించలేకపోయినా పర్వాలేదు. భక్తితో ఓం నమఃశివాయ అనుకుంటే చాలు.
శివయ్యకు పంచభక్ష్య పరమాన్నాలు అవసరమే లేదు. మాంసం నైవేద్యం పెట్టిన కన్నప్పకైనా, తన స్వామిని ఆకులు అలములతో అపవిత్రం చేస్తోందని గజరాజుపై ఆగ్రహించిన పాముకైనా, ఆ పాము తన పూజకు ఆటంకం కలిగిస్తోందనుకున్న గజరాజుకైనా శివయ్య ముక్తి ప్రసాదిస్తాడు. కేవలం భక్తి ఉంటే చాలు!
ఈ లోకంలో కష్టం, బాధ, వేదన లేని ప్రాణులుండవు. మనుషులైతే కష్టాలు సృష్టించుకుని మరీ బాధలు పడుతుంటారు. కనుక వాటి నుంచి ఉపశమనం కోసం గుళ్ళూ, గోపురాలు సందర్శిస్తుంటారు. కానీ ఎవరూ ఆలోచనలను కట్టడి చేయలేరు. వాటిని కట్టడి చేయనంత వరకు మనం ఎక్కడకు వెళ్ళినా మనసులో బాధ మన వెంట వస్తూనే ఉంటుంది.
ఆ ఆలోచనలను కట్టడి చేసేందుకు మహాశివరాత్రినాడు చేసే ఉపవాసం, ధ్యానం, అర్చన, అభిషేకం, జాగరణ అనే ఐదు క్రియలు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటితో శారీరిక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
మనిషి బాధలు, వేదన నుంచి విముక్తి పొందడం చాలా కష్టం. కానీ విముక్తి పొందేందుకు ఇంత సులువైన మార్గం ఒకటి ఉందని మహాశివరాత్రి గుర్తు చేస్తుంది. మన దేశంలో కోట్లాది మంది హిందువులు తరతరాలుగా ఈ ధ్యానం, ఉపవాసం, అర్చనలు చేస్తున్నారంటే వాటి విలువ గుర్తించబట్టే కదా?
మోక్ష ప్రాప్తి అనేది జీవితం ముగిసిన తర్వాత ఉంటుంది. కానీ జీవించి ఉన్నప్పుడే ఇలాంటి చిన్న చిన్న ప్రక్రియలతో తాదాత్మ్యం సాధించగలిగితే ఇక ఏ సమస్యలు మనల్ని బాధించలేవు. శివుడు నిరాడంబరుడు. శివతత్వం కూడా అంతే నిరాడంబరమైనది.
For the first time in Bigg Boss history, there is a double eviction in the…
Toxic has emerged as an epic disaster at the box office. While the movie bombed…