
YSRCP's Mavigan proposal has reignited the debate over Amaravati and the future of Andhra Pradesh's capital.
మావిగన్ – అవిగన్ ఈ రెండిటి మధ్య వ్యత్యాసం చూడడానికి, పలకడానికి ఒక్క అక్షరం మాత్రమే అనిపించవచ్చు. కానీ ఈ రెండిటి మధ్య ఒక రాష్ట్ర భవిష్యత్, 5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవం, గుర్తింపు దాగి ఉంది. రాష్ట్రానికి గుండెకాయ, ఆయువుపట్టు వంటి రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో వైసీపీ సాగిస్తున్న రాజకీయం నానాటికి దిగజారిపోతోంది.
నాడు అమరావతే రాజధాని అంటూ జై కొట్టిన జగన్ అటు పిమ్మట వైసీపీ ప్రభుత్వ హయాంలో మూడు రాజధానులు అంటూ మొదలుపెట్టి, ఇక చివరికి విశాఖే రాజధాని అంటూ ముగించారు. ఇప్పుడు తాజాగా ఆ మూడు ప్రతిపాదనలకు నీళ్లొదిలి మచిలీపట్నం – విజయవాడ – గుంటూరు ….అంటూ మూడు ప్రాంతల సమ్మేళనం పేరుతో మావిగన్ అంటూ ముందుకొచ్చారు.
అసలు వైసీపీ ఇలా ఏడాదికో రాజధాని పేరు చెప్పుకుంటూ చేస్తున్న ఈ రాజకీయం రాష్ట్రానికి ఏ రకమైన ప్రయోజనాన్ని అందిస్తుంది.? ఇప్పటికే వైసీపీ మూడు రాజధానులకు ప్రజల నుంచి బలమైన తిరస్కరణ లభించింది. ఇప్పుడు 2029 ఎన్నికలు మావిగన్ vs అమరావతి అంటూ జగన్ ప్రకటించేసారు.
దీనితో వైసీపీ రాజకీయ పతనానికి జగన్ తన రాజధానుల ప్రకటనలతో పునాదులు తవ్వుతున్నారా.? అంటూ సామాన్య ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు ఎదురవుతున్నాయి. అయినా కూడా తగ్గేదెలా అన్నట్టుగా వైసీపీ నేతలు ముఖ్యంగా మచిలిపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని మావిగన్ కి మద్దతుగా నిత్యం తన గళం వినిపిస్తున్నారు.
అందులో భాగంగానే నిన్న మీడియా ముందుకొచ్చిన పేర్ని జగన్ మావిగన్ దెబ్బకు కూటమి ప్రభుత్వానికి భయం పట్టుకుందని, ఆ భయంతోనే జగన్ మావిగన్ ప్రకటనకు ప్రత్యామ్నాయంగా అమరావతి – విజయవాడ – గుంటూరు…అవిగన్ అంటూ కూటమి ప్రభుత్వం తన క్యాబినెట్ లో రాజధాని పై తీర్మానం చేసిందంటూ పేర్ని ప్రకటించారు.
బందర్ లో బాబు బంధువులు లేరని అందుకే బాబు మచిలీపట్టణం ప్లేస్ లో అమరావతిని చేర్చారంటూ పేర్ని చేస్తున్న ఈ వ్యాఖ్యలు వినేందుకు హాస్యాస్పదంగా అనిపిస్తున్నప్పటికీ ఇది 5 కోట్ల ప్రజల మనోభావాలతో వైసీపీ ఆడుతున్న వికృత రాజకీయ క్రీడగానే చూడాల్సి ఉంటుంది. బందర్ లో బాబు బంధువులు లేరంటూ ఆరోపిస్తున్న పేర్ని మరి అమరావతిలో జగన్ సన్నిహితులు లేరని అమరావతిని అటకెక్కించరా అనే ప్రశ్నకు పేర్ని జవాబు చెప్పగలరా.?
వైసీపీ ఉద్దేశంలో మావిగన్ కి అవిగన్ కి మధ్య తేడా ఒక్క అక్షరమే కావచ్చు. కానీ రాష్ట్ర విభజన గాయాలతో రాజధాని కూడా లేకుండా బయటకొచ్చిన ఆంధ్రుల ఆత్మగౌరవం, వారి గుర్తింపు అమరావతి. రాష్ట్ర విభజన జరిగి పుష్కర కాలం జరిగినప్పటికీ వైసీపీ రోజుకో రాజధాని పేరు చెప్పుకుంటూ వాటి మధ్య ఉన్న అక్షరాల తేడాను మాత్రమే గమనిస్తుంది కానీ రాష్ట్ర భవిష్యత్ ని పట్టించుకోవడం లేదు.
ఐదేళ్ల తమ అధికారంలో రాజధాని గా అమరావతిని ఒక్క ఇంచి కూడా మార్చలేని జగన్, తన ప్రభుత్వ హయాంలో 151 మంది ఎమ్మెల్యే ల బలంతో విశాఖను రాజధానిగా చెయ్యలేని జగన్, మూడు రాజధానులతో ఒక్క ప్రాంత ప్రజల మనసు కూడా మెప్పించలేని జగన్ రేపటి రోజున మచిలీపట్టణం ప్రజల కోసం ఇచ్చిన మాట మీద నిలబడతారా.? దాన్ని ప్రజలు విశ్వసిస్తారా.?
Kiran Abbavaram is coming up with an entertainer, #KA13. Written and directed by Kiran Abbavaram…
The last time the world came to a lockdown was during the Covid outbreak in…