
తెలంగాణలో ఇంటలిజన్స్ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్టుతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటపడింది. తీగ లాగితే డొంక కదిలిన్నట్లు ఈ వ్యవహారంలో ఇద్దరు ఎస్పీలు శనివారమే అరెస్ట్ అయ్యారు. మరో ముగ్గురు మాజీ పోలీస్ అధికారులను కూడా అరెస్ట్ చేయవచ్చని తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో తమ ఫోన్లను జగన్ ప్రభుత్వం ట్యాపింగ్ చేయిస్తోందని టిడిపి నేతలు వాదిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న (శనివారం) విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ హాల్లో టిడిపి, జనసేన, బీజేపీ అభ్యర్ధులకు శిక్షణా కార్యక్రమం జరుగుతుంటే, అక్కడకు మఫ్టీలో వచ్చి నిఘా పెడుతున్న ఇంటలిజన్స్ కానిస్టేబుల్ జి.విశ్వేశ్వరరావుని టిడిపి, జనసేన నేతలు పట్టుకున్నారు.
టిడిపి నేతలు కేశినేని చిన్ని, పట్టాభిరామ్ మీడియాతో మాట్లాడుతూ, “ఈ విషయం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేస్తాము. మా ఫోన్లను ట్యాపింగ్ చేయిస్తున్న ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులని తక్షణం విధులలో నుంచి తొలగించాలని కోరుతాము,” అని అన్నారు.
ఈ వ్యవహారంపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందిస్తూ, “నేను వైసీపిలో ఉన్నప్పుడే జగన్ నా ఫోన్ ట్యాపింగ్ చేయించారు. నేను పార్టీ వీడటానికీ అదీ ఓ కారణమే. అప్పుడే నేను రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష నేతలందరి ఫోన్లను జగన్ ప్రభుత్వం ట్యాపింగ్ చేయిస్తోందని చెప్పాను. కానీ అప్పుడు నా మాటలని ఎవరూ నమ్మలేదు. నేను వైసీపిని నుంచి బయటకు వచ్చాను కనుక జగన్ ప్రభుత్వంపై బురద జల్లుతున్నానని అందరూ అనుకున్నారు.
కానీ ప్రతిపక్ష నేతల ఫోన్లను జగన్ ప్రభుత్వం ట్యాపింగ్ చేయిస్తోందని ఇప్పుడు అందరూ గ్రహించారు. ఈ వ్యవహారంపై ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోకపోతే, రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పకుండా విచారణ జరిపించి, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెనుకున్నవారందరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణలో ఒక డీఎస్పీ, ఇద్దరు ఎస్పీలు అరెస్ట్ అయ్యారు. రేపు ఏపీలో కూడా అలాగే జరుగుతుంది,” అని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరుగుతోందంటూ ఏడాది క్రితం తాను వ్రాసిన లేఖను మీడియాకు విడుదల చేశారు.
Aadarsha Kutumbam - AK47 was recently postponed again, and there is still no clarity about…
The USCIS has officially removed the 540-day automatic extension granted to H-4 visa holders with…