
మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవిఎంసీ) మేయర్ గొలగాని హరి వెంకట కుమారిపై కూటమి పార్టీలు ప్రవేశపెట్టి అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఆమె పదవి కోల్పోయారు. ఆ పదవి కూటమి పార్టీలకు దక్కబోతోంది.
జీవిఎంసీలో మొత్తం 97 మంది కార్పొరేటర్లు ఉండగా వారిలో పలువురు టీడీపీ, జనసేన పార్టీలలో చేరిపోవడంతో వైసీపీ బలం తగ్గిపోయింది. కనుక ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిపి కూటమికి 74 మంది అయ్యారు.
కనుక అవలీలగా అవిశ్వాస తీర్మానం నెగ్గించుకున్నారు. అవిశ్వాస తీర్మానం నెగ్గడం ఖాయమని గ్రహించడంతో మిగిలిన వైసీపీ కార్పొరేటర్లు ఈ సమావేశాన్ని బహిష్కరించి వెళ్ళిపోయారు.
అనంతరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎంపీ సిఎం రమేష్ మీడియాతో మాట్లాడుతూ, “ఇంతకాలం వైసీపీ నగరాభివృద్ధిని పట్టించుకోకుండా ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లు జీవిఎంసీని నడిపించింది. దాని నుంచి జీవిఎంసీకి, విశాఖ నగరానికి విముక్తి కల్పించాము. ఒక మంచి మేయర్‌ని నగరానికి అందిస్తాము. ఎప్పటికైనా న్యాయం, ధర్మానిదే అంతిమ విజయం అని నేడు మరోసారి నిరూపితమైంది,” అని అన్నారు.
సాధారణంగా శాసనసభ ఎన్నికలలో ఓడిపోయి అధికారం కోల్పోయిన పార్టీలకు ఆ తర్వాత క్రమంగా ఈ విదంగానే మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులు చేజారిపోతుంటాయి. ఇది అవాంఛనీయమైన రాజకీయ విధానమే అయినప్పటికీ ఇదే ఇప్పటి విధానంగా మారిపోయింది. దాదాపు అన్ని రాష్ట్రాలలో ఇలాగే జరుగుతోంది.
రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పార్టీకి, ప్రభుత్వానికి పూర్తి పట్టు ఉండాలనే ఉద్దేశ్యంతో కావచ్చు లేదా పార్టీలో రాజకీయ నిరుద్యోగులందరికీ పదవులతో సంతృప్తి పరచాల్సిన అవసరం వల్ల కావచ్చు.. అన్ని పార్టీలు ఈవిదంగానే ముందుకు సాగుతున్నాయి.
కనుక బురదలో నడుస్తూ కాలికి బురద అంటుకుందని బాధ పడటం లేదా తుడుచుకునే ప్రయత్నం చేయడం కూడా అనవసరమే. కానీ ఆ బురద ఇబ్బంది పెడుతూనే ఉంటుందని మరిచిపోకూడదు.
Sharwa is coming up with the rural period action drama Bhogi. Directed by Sampath Nandi…
Katrina Kaif is in a new phase of life after becoming a mother, but her…