
వైసీపిలో చేరితే అందరి ఆలోచనలు, భాష, ధోరణి అన్నీ ఇంతగా మారిపోతాయా?అంటే అవుననే నిరూపిస్తున్నారు ముద్రగడ పద్మనాభం. ఆయన తన కూతురు క్రాంతి గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలు వింటే అవుననే అనిపిస్తుంది.
ఇదివరకు ముద్రగడ పద్మనాభం చాలా హుందాగా ఆచితూచి మాట్లాడేవారు. కానీ వైసీపిలో చేరినప్పటి నుంచి ఆయన మాట తీరు, భాష, వైఖరి అన్నీ పూర్తిగా మారిపోయాయి. ఇంత తక్కువ సమయంలో ఒకరి వ్యక్తిత్వం ఇంతగా మారడం సాధ్యమేనా? అంటే సాధ్యమే అని ముద్రగడ పద్మనాభంని చూస్తే నమ్మక తప్పదు.
ఆయన పవన్ కళ్యాణ్‌ని పిఠాపురం నుంచి తన్ని తగిలేయాలని, పవన్ కళ్యాణ్‌ని ఓడించకపోతే తన పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని శపధం చేశారు.
ఆయన మాటలను కుమార్తె క్రాంతి తప్పు పట్టారు. ఎంతో హుందాగా మాట్లాడే తన తండ్రి వైసీపిలో చేరగానే ఇతరుల గురించి ఇంత చులకనగా మాట్లాడటాన్ని, పేరు మార్చుకుంటానని శపధం చేసి తన ప్రతిష్టను తానే దిగజార్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని ఈవిదంగా మాట్లాడితే తర్వాత చాలా బాధపడవలసి వస్తుందని కూడా ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి తండ్రిని హెచ్చరించారు.
ఆమె వ్యాఖ్యలపై ముద్రగడ పద్మనాభం స్పందించిన తీరు ఇంకా ఎబ్బెట్టుగా ఉంది. ముద్రగడ పద్మనాభమేనా ఈ మాటలు మాట్లాడింది? ఆయన తన కూతురు గురించేనా ఇంత చులకనగా మాట్లాడారు? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఇంతకీ ఆయన ఏమన్నారంటే, “నా కూతురు చేత అలా ఎవరు మాట్లాడిస్తున్నారో నాకు తెలుసు. అయినా ఆమె మాటలకు నేను భయపడను. ఎందుకంటే ఇప్పుడు ఆమె నా ప్రాపర్టీ కాదు. ఆమెకు పెళ్ళయ్యి అత్తారింటికి వెళ్ళిపోయింది. ఆమె వారి ప్రాపర్టీ. కనుక ఆమె చేత ఎవరు ఎటువంటి మాటలు మాట్లాడించినా నేను పట్టించుకోను. నేను ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డికి సేవకుడిగానే ఉంటాను. పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ని ఓడించి మా పార్టీ అభ్యర్ధి వంగా గీతను భారీ మెజార్టీతో గెలిపించుకుంటాను,” అని అన్నారు.
ఆయన తన కూతురుని ‘ప్రాపర్టీ’ అని సంభోదిస్తున్నప్పుడు పక్కనే వంగా గీత కూడా ఉన్నారు. సాటి మహిళను ఆమె తండ్రే ‘ప్రాణం లేని వస్తువు లేదా ఆస్తి అన్నట్లు మాట్లాడుతుంటే ఆమెకు అభ్యంతరకరంగా అనిపించలేదా? అనే సందేహం కలుగుతుంది.
అయినా కాపు జాతికి శ్రేయోభిలాషిని, సేవకుడిని అని చెప్పుకునే ముద్రగడ పద్మనాభం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సేవకుడిని అని చెప్పుకోవడం సిగ్గుచేటు కాదా?
ముద్రగడ పద్మనాభం కాపుల ఓట్లను వైసీపికి పడేలా చేస్తారనే ఉద్దేశ్యంతోనే జగన్ ఆయనను పార్టీలోకి చేర్చుకున్నారు తప్ప ఆయనపై గౌరవంతో కాదని అందరికీ తెలుసు.
కానీ ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశ్యించి చేస్తున్న అనుచిత వ్యాఖ్యలతో ఒక్క పిఠాపురంలోనే కాదు… రాష్ట్రమంతటా పవన్ కళ్యాణ్ పట్ల ప్రజలలో ముఖ్యంగా కాపు సామాజికవర్గంలో సానుభూతి ని పెంచుతూనే ఉన్నాయి. కనుక జనసేనను గెలిపించేది ఆయనే. వైసీపిని ఓడించబోయేది కూడా ఆయనే కావచ్చు.
Andhra Pradesh’s local body elections are becoming an important test for the relationship between Chandrababu…
Yash’s look as Ravana in Nitesh Tiwari’s Ramayana has sparked another debate, with Aarya Babbar…