
తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి నుంచి టిడిపి అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి పోటీ చేయవలసి ఉండగా, పొత్తులో భాగంగా ఆ టికెట్ బీజేపీకి దక్కడంతో శివరామ కృష్ణంరాజుని బీజేపీ అభ్యర్ధిగా ప్రకటించింది.. అప్పటి నుంచే ఆయన జోరుగా ఎన్నికల ప్రచారం చేసుకొంటున్నారు కూడా.
అయితే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి మాత్రం ఎట్టి పరిస్థితులలో అక్కడ నుంచి తానే పోటీ చేయాలని చాలా పట్టుదలతో ఉన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా బుజ్జగించినప్పటికీ ఆయన వెనక్కు తగ్గడం లేదు. టిడిపి వైపు నుంచి పని జరగదని గ్రహించగానే ఆయన శుక్రవారం ఉదయం ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి నివాసానికి వెళ్ళి కలిశారు.
అనపర్తి నుంచి తన భార్యకు టికెట్ ఇవ్వాలని ఆయన కోరిన్నట్లు తెలుస్తోంది. దగ్గుబాటి పురందేశ్వరి రాజమండ్రి నుంచి లోక్సభకు పోటీ చేస్తున్నందున, ఆయన సహాయ సహకారాలు ఆమెకు చాలా అవసరం. కనుక ఆయన ప్రతిపాదనపై బీజేపీ అధిష్టానంతో మాట్లాడుతానని హామీ ఇచ్చి పంపించిన్నట్లు తెలుస్తోంది.
దీంతో శివరామ కృష్ణంరాజు, అనుచరులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పార్టీ అభ్యర్ధిగా ప్రకటించిన తర్వాత ఇప్పుడు తనను పక్కన పెట్టి నల్లమిల్లి కుటుంబాన్ని పార్టీలో చేర్చుకొని వారికి టికెట్ ఇస్తే సహించే ప్రసక్తే లేదని హెచ్చరిస్తున్నారు.
కనుక అనపర్తి నుంచి పోటీ చేయబోయేది ఎవరో తెలీని పరిస్థితి నెలకొంది. బీజేపీలో ఏర్పడిన ఈ అయోమయ పరిస్థితిని వైసీపి అభ్యర్ధి సత్తి సూర్యనారాయణ రెడ్డి తెలివిగా తనకు అనుకూలంగా మలుచుకొని ఎన్నికల ప్రచారం చేసుకొంటూ దూసుకుపోతున్నారు.
ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంది. అదే రోజు నుంచి ఏప్రిల్ 25వరకు నామినేషన్స్ సమర్పించేందుకు గడువు ఉంటుంది. కనుక ఒకటి రెండు రోజులలలోనే అనపర్తి నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారనే విషయం బీజేపీ అధిష్టానం తేల్చేయవచ్చు. తేల్చకపోతే దగ్గుబాటి పురందేశ్వరి కూడా నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది.
Aadarsha Kutumbam - AK47 was recently postponed again, and there is still no clarity about…
The USCIS has officially removed the 540-day automatic extension granted to H-4 visa holders with…