
సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్‌పై విస్తృత ధర్మాసనానికి పంపాలనే నిర్ణయంపై అప్పుడే రాజకీయ విశ్లేషణలు మొదలైపోయాయి. సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం దీనిపై స్పష్టమైన తీర్పు చెప్పకుండా కేసును గాల్లో ఉంచడం ద్వారా చంద్రబాబు నాయుడుకి ఊరట కల్పించిందని కొందరు వాదిస్తుంటే, తీర్పు చెప్పకుండా ఆయన తలపై కత్తిని వ్రేలాడదీస్తూ మోడీ ప్రభుత్వం ఆయనను ఒత్తిడికి గురి చేస్తోందని మరికొందరు వాదిస్తున్నారు.
చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌తో నేరుగా చేతులు కలపనప్పటికీ దానికి దగ్గరవుతున్నారు కనుక కాంగ్రెస్‌కు దూరంగా ఉంచుతూ బీజేపీ పరిధిలో ఉంచేందుకే ఈ కేసు తేలకుండా చేస్తోందని కొందరు వాదిస్తున్నారు.
కానీ వాస్తవానికి చంద్రబాబు నాయుడు బీజేపీ కూడా తమతో కలవాలనే ఎదురుచూస్తున్నారని అందరికీ తెలుసు. అయినా జగన్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు మోడీ, అమిత్ షాలు స్పందించకుండా మౌనంగా ఉండిపోయారు ఎందుకు? అంటే తమ చేతికి మట్టి అంటకుండా జగన్ ఆయనని అరెస్ట్ చేసి, టిడిపిని రాజకీయంగా దెబ్బ తీసి బలహీనపరుస్తుంటే అడ్డుకోవలసిన అవసరం ఏముంది? అని వారు భావించి ఉండవచ్చు.
అదేవిదంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా జగన్మోహన్ రెడ్డిని, వైసీపిని ఎన్నికలలో ఓడించడానికి కాంగ్రెస్‌కు కాస్త దగ్గరవుతున్నారని మోడీ, అమిత్ షాలకు బాగా తెలుసు. కనుక తమ చేతికి మట్టి అంటకుండా చంద్రబాబు నాయుడు వైసీపిని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తుంటే అడ్డుకోవలసిన అవసరం ఏమిటి? అని వారు భావిస్తుండవచ్చు.
ఏపీలో బీజేపీ బలపడకపోవడానికి ప్రధాన కారణం టిడిపి, వైసీపిలు బలంగా ఉండటమే. కనుక రెండు పార్టీలు పరస్పరం దెబ్బ తీసుకుంటూ బలహీనపరుచుకొంటుంటే మోడీ, అమిత్ షాలు వద్దంటారా?ఏపీలో బీజేపీ ఇప్పట్లో అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. బీజేపీ అధిష్టానానికి ఆ ఆసక్తి కూడా లేదు. వారికి కావలసింది ఏపీలో ఉన్న 25 ఎంపీ సీట్లు మాత్రమే. వాటిని వైసీపి లేదా టిడిపి, జనసేనలు అందించేందుకు సిద్దంగా ఉన్నప్పుడూ వారు కాదంటారా? టిడిపి, జనసేన, వైసీపి మూడు ప్రధాన పార్టీలు తమ దయాదాక్షిణ్యాల కోసం పరితపిస్తుంటే మోడీ, అమిత్ షాలు వద్దంటారా?
అయితే చంద్రబాబు నాయుడు, జగన్, కేసీఆర్ వంటివారిని వారు తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి ఈ కేసులే చాలా ముఖ్యం. తమకు అనుకూలంగా ఉన్నంతకాలం వారిపై ఈ కేసులన్నీ అటకపై ఉండిపోతాయి లేకుంటే కేసులలో కదలికలు మొదలవుతుంటాయి. కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీస్ పంపడం ఇందుకు తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కనుక చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్ కూడా ఈ కోవలోనే ఉంటుందని వేరే చెప్పక్కరలేదు.
Andhra Pradesh has proposed a ₹20,369 crore plan to widen busy two-lane national highways into…
Varsha Rekhate turns a rainy backdrop into a style moment in this striking gallery. Dressed…