
తెలంగాణ ఉద్యమాల సమయంలో కేసీఆర్ & కో తెలుగు సినీ పరిశ్రమపై ఆంధ్ర ముద్రవేసి ఈసడించుకున్నప్పటికీ, ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టాక అదో బంగారు గుడ్లు పెట్టే బాతు అని గ్రహించి అక్కున చేర్చుకున్నారు.
అయినా కేసీఆర్ మనసులో సినీ పరిశ్రమ ఆంధ్రాకు చెందినదనే భావన ఉన్నందునో లేదా తెలంగాణకు చెందిన కళాకారులకు అవార్డులు ఇచ్చే పరిస్థితి లేనప్పుడు ఆంధ్రా వాళ్ళకు ‘నంది అవార్డులు’ ఇవ్వడం దేనికనుకున్నారో కానీ ఆ ఆలోచనే చేయనే లేదు.
మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత సిఎం రేవంత్ రెడ్డి నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇవ్వబోతున్నారు. జయసుధ అధ్యక్షతన ఏర్పాటు చేసిన జ్యూరీ ఉత్తమ చిత్రంగా కల్కి ఏడీ 2898, ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ ఎంపిక చేసింది. ఇంకా పలువురు నటీనటులు, దర్శకులు, సినిమాలకు ఈ అవార్డులు ప్రకటించింది.
కానీ ఇక్కడే మళ్ళీ రాజకీయాలు మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. జ్యూరీలో అధ్యక్ష పదవి మొదలు సినీ నటీనటులు, దర్శకులు దాదాపు అందరూ ఆంధ్రాకు చెందినవారే ఉన్నారని, వారికి, వారి సినిమాలకు తెలంగాణ ప్రభుత్వం అవార్డులు ఇవ్వాల్సిన అవసరం ఏముందని బిఆర్ఎస్ పార్టీ ఏదో రోజు ప్రశ్నించకుండా ఉండదు.
సినీ పరిశ్రమలో ఆంధ్రా పెత్తనం ఉందనే వాదన ఎప్పటి నుంచో వినిపిస్తోంది. అది నిజం కూడా. కనుక ఇప్పుడు ఈ అవార్డుల విషయంలో తెలంగాణ కళాకారులకు, వారి సినిమాలకు అన్యాయం జరుగుతోందంటూ రాజకీయాలు చేయకుండా ఉండదు.
గద్దర్ అవార్డులకు మొత్తం 1248 నామినేషన్స్ వచ్చాయని జయలలిత చెప్పారు. వాటిలో తెలంగాణ నేపధ్యంతో తీసిన సినిమాలకు, తెలంగాణ నటీనటులకు, దర్శకులకు అవార్డులు ఆశించి లభించకపోతే వారు తప్పకుండా అసంతృప్తి చెందుతారు. ఉదాహరణకు సిఎం రేవంత్ రెడ్డి విమర్శించిన అల్లు అర్జున్‌కి ఉత్తమ నటుడు అవార్డు ఇచ్చారని అనకుండా ఉంటారా?
గద్దర్ అవార్డులలో కూడా వివక్ష అంటూ విమర్శలు వినిపించక మానవు. ఇది ఊహాజనీతమైన ఆలోచన అనిపించవచ్చు కానీ ఏదో ఓ రోజు ఈ వివక్ష, రాజకీయాలు జరుగకమానవు.
ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ మురళీమోహన్ మరో ముఖ్యమైన విషయం కూడా చెప్పారు. ఏపీ ప్రభుత్వం కూడా సినీ అవార్డులు ఇవ్వాలనుకుంటోంది కనుక రెండు రాష్ట్రాలు ఒకేసారి ఒకే సినిమాకు అవార్డులు ఇస్తే వివాదాలకు దారి తీస్తుందన్నారు.
కనుక ఒక ఏడాది ఏపీ, మరో ఏడాది తెలంగాణ ప్రభుత్వాలు అవార్డులు ఇస్తే బాగుంటుందని, అందుకోసం ఇరు ప్రభుత్వాలు మాట్లాడుకొని నిర్ధిష్టమైన విధానాలు రూపొందించుకోవాలని మురళీ మోహన్ సూచించారు.
సినీ పరిశ్రమ ఆంధ్రాదర్శక నిర్మాతలు, నటీనటుల చేతుల్లో ఉందని బాధపడటం కంటే జై తెలంగాణ అంటూ రోజూ నినాదాలు చేసే కేసీఆర్ & కో, దాదాపు పదేళ్ళు పాలన చేసినా తెలంగాణ సినీ పరిశ్రమని, కళాకారులను ప్రోత్సహించలేదనే విషయం మరిచిపోకూడదు. ఏది ఏమైనప్పటికీ ఈ సినీ అవార్డులపై ఎవరూ రాజకీయాలు చేయకుండా పురస్కారాలుగా మాత్రమే చూస్తే చాలా సంతోషమే!
BOTTOM LINE Novel Thriller, Slightly Overstuffed PLATFORM SonyLIV RUNTIME 6 Hours [7 Episodes] What Is…
Paid negativity has become an increasingly familiar phrase whenever a big film enters a crucial…