
శశికళపై అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలు పన్నీర్ కు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. రిసార్ట్ లో ఎమ్మెల్యేలను కలవాలనుకుంటున్న పన్నీర్ సెల్వం నిర్ణయించుకున్న నేపథ్యంలో రిసార్టు పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పన్నీర్ రిసార్ట్ కు రానున్నారని తెలుసుకున్న శశికళ వర్గీయులు, భారీ సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటుండగా, వారిని రిసార్ట్ పరిసర ప్రాంతాల్లోకి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇదే సమయంలో పన్నీర్ అనుచరులు సైతం ఇక్కడికి పయనం కావడంతో, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా బందోబస్తు పెంచారు.
అయితే తాజా సమాచారం మేరకు… తొలుత ఈ రిసార్ట్ లో 120 మంది ఎమ్మెల్యేలకు పైగా తరలించినప్పటికీ, అందులో 30 మంది వరకూ ఆంధ్రప్రదేశ్ లోని రహస్య ప్రాంతాలకు తరలించినట్టు వార్తలు వస్తున్నాయి. వీరిని తిరుపతి సమీపంలోని ఓ స్టార్ హోటల్ లో ఉంచినట్టు వదంతులు వినిపిస్తున్నా, దీనిపై అధికారిక సమాచారం లేదు. మొత్తానికి శశికళ వర్గానికి మైండ్ బ్లాక్ అయ్యే విధంగా పన్నీర్ సెల్వం తీసుకున్న నిర్ణయంతో చెన్నై వ్యాప్తంగా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఆపద్ధర్మ సిఎంగా ఉన్న పన్నీర్ ను లోనికి అనుమతిస్తారా? లేక అడ్డుకుంటారా? అనేది సర్వత్రా ఆసక్తి రేపుతున్న అంశం.
శశికళకు ముచ్చెమటలు పట్టించే విధంగా పన్నీర్ స్కెచ్ ఇలా ఉంటే… శశికళ స్వరం పెంచి, గవర్నర్ విద్యాసాగర్ రావుపై డైరెక్టుగానే విమర్శలు గుప్పించారు. తన ప్రమాణ స్వీకారాన్ని గవర్నర్ ఉద్దేశపూర్వకంగానే వాయిదా వేస్తున్నారని నిప్పులు చెరిగారు. సాధ్యమైనంత త్వరగా సీఎం పీఠాన్ని ఎక్కాలని భావిస్తున్న ఆమె, భారీ స్కెచ్ రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది. సాయంత్రం 4 గంటల వరకూ వేచి చూసి, ఆపై తన వర్గం ఎమ్మెల్యేలతో బస్సుల్లో ర్యాలీగా రాజ్ భవన్ కు వెళ్లి పరేడ్ పెట్టాలని భావిస్తున్నట్లుగా చెన్నై వర్గాల సమాచారం.
అప్పటికీ పని కాదని భావిస్తే, వారందరితో ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లి, జాతీయ స్థాయిలో తనకు జరుగుతున్న అన్యాయాన్ని తెలియజేయాలని శశి నిర్ణయించుకున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అలాగే ఢిల్లీ నుంచి రాగానే మెరీనా బీచ్ లో జయలలిత సమాధి వద్ద నిరాహార దీక్షకు దిగాలని, దీని ద్వారా మహిళల నుంచి మద్దతు పొందవచ్చని శశికళ అంచనాగా తెలుస్తోంది. ఆపై నియోజకవర్గాల వారీగా తన మద్దతుదారులతో నిరసనలకు దిగాలన్న సమాచారం పోలీసులకు అందడంతో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.
Raaka is already shaping up to be one of the most ambitious films of Allu…
Dhanush is currently one of the busiest actors in Kollywood with multiple projects in his…