జూట్ నుంచే జనపనార వస్తుంది కదండీ… జూట్ అంటే గోంగూరేనండి?

AdvantageAndhraPradesh-Bengaluru-Industry -Meet

అవును… జూట్, జనపనార, జూట్ మిల్లుల గురించి మన అధికారులకి తెలియదనే విషయం బెంగళూరులో పెట్టుబడిదారుల సదస్సులో బయటపెట్టుకొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలు పెట్టాలని కోరుతున్నప్పుడు పారిశ్రామికవేత్తల సందేహాలకి పూర్తి సాధికారతతో మంత్రి, అధికారులు సమాధానాలు ఇవ్వగలగాలి. అయితే జూట్ అంటే తెలీదు… జనపనార అని చెప్పినా తెలీదు.. పైగా జనపనార అంటే గోంగూరేనండి?అని ఎదురుప్రశ్నించేసరికి ఆ పారిశ్రామికవేత్త షాక్ అయ్యారు. ఆయనే కాదు… జనపనార అంటే గోంగూరా? అని ప్రశ్నిస్తే ఎవరైనా షాక్ అవుతారు కదా?

ADVERTISEMENT

ఇంతకీ ఏం జరిగిందంటే, ఆ సదస్సులో టాంజానియాలో జనపనార పంటలు, ఉత్పత్తులని డీల్ చేస్తున్న తమిళనాడుకి చెందిన ఓ పెద్దాయన, “ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జనపనార పండించేందుకు తగిన వాతావరణం ఉంది. రాష్ట్రంలో 13 జూట్ మిల్లులు ఉన్నాయని చెపుతున్నారు. అయితే ఏపీలో జనపనార ఏ మేరకు సాగుచేస్తున్నారో, ఆ మిల్లులు ఎక్కడున్నాయో… వాటి ఉత్పత్తి ఎక్కడికి వెళ్తోందో మాకు తెలీదు. కాస్త వివరిస్తారా?” అని ప్రశ్నించారు.

అయితే ఆయన అడిగిన, ప్రశ్న, ఆ ఉత్పత్తి ఏమిటో వేదిక మీదున్న అధికారులెవరికీ అర్దంకాక మొహాలు చూసుకొంటుంటే, మళ్ళీ ఆయనే “సైసల్ అంటే జనపనార. జూట్ అంటే ప్రీపూస” అని చెప్పారు. అయితే జూట్ మిల్స్ అని ఇంగ్లీషులో స్పష్టంగా చెప్పిన ఆ మహిళా అధికారికి అవేమిటో తెలీదు. కనుక తనకి వాటి గురించి తెలీదనే విషయం దాచిపెట్టుకొనేందుకు “మీరు మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనుకొంటున్నారా?” అని ఎదురు ప్రశ్నించారు.

“నాకు తెలిసిన పెట్టుబడులు పెట్టేవారిని మీ వద్దకి పంపించగలనని”, ఆ పెద్దాయన సమాధానం చెప్పారు. అయితే జూట్, జనపనార అంటే ఏమిటో వాటితో ఏమి తయారవుతాయో, రాష్ట్రంలో జూట్ మిల్లులు ఎక్కడున్నాయో కూడా తెలీని ఆ మహిళా అధికారి మళ్ళీ కవర్ చేసుకొంటూ,”ఆ యస్… ఈ రంగంలో మా దగ్గర చాలా అవకాశాలున్నాయి. మీరు మాకు వారి ఫోన్‌ నెంబర్లు ఇస్తే మేము వారితో మాట్లాడి అన్నీ వివరిస్తాము,” అని తెలివిగా సమాధానం చెప్పానని అనుకొన్నారు.

కానీ అంతలోనే ఆమె జనపనార ఈజ్ మేడ్ ఫ్రం జూట్ ఐ థింక్ (జూట్ నుంచే జనపనార తయారవుతుందనుకొంటాను కదా సర్?)” అని ప్రశ్నించడంతో అసలు ఆమె జూట్, జనపనార అనే పదాలు ఎప్పుడూ వినలేదని స్పష్టమైంది.

దానికి ఆ పెద్దాయన జనపనార మొక్క ఏవిదంగా ఉంటుందో వివరించే ప్రయత్నంలో “ఇది గ్రే కలర్లో ముళ్ళ చెట్టులా రెండు అడుగులు ఎత్తు పెరుగుతుంది…” అంటూ వివరించబోతుంటే ఆ అధికారిణి చటుక్కున క్యాచ్ చేసిన్నట్లు “ఆ… గోంగూరే కదండీ…?” అన్నారు!!!

దానికి ఆయన “కాదమ్మా… ఆలోవేరా పేరు ఎప్పుడైనా విన్నారా? వాటికి ముళ్ళు కూడా ఉంటాయి?” అని ఎదురు ప్రశ్నించేసరికి ఆమె మరోసారి అయోమయం మొహం పెట్టి “ఆ… విన్నాను సర్…” అని చెప్పగా ఆయన “ఈ జనపనార మొక్కలు కూడా ఇంచుమించు అలాగే ఉంటాయి. టాంజానియాలో వాటికి సంబందించిన పరిశ్రమలున్నాయి. వాటితో నేను డీల్ చేస్తుంటాను,” అని వివరించారు.

ఇంకా ఎక్కువ మాట్లాడితే అందరి ముందు నవ్వుల పాలవుతానని ఆమె అనుకొన్నారో ఏమో, “ఈ పంట ఉత్పత్తి గుర్తించి నేను మరికొంత అవగాహన ఏర్పరచుకొన్నాక మీతో మాట్లాడుతాను. మీరు వెళ్ళేటప్పుడు మీ విజిటింగ్ కార్డ్ నెంబర్ ఇచ్చి వెళ్లగలరా?” అని ఆమె అభ్యర్ధించి అక్కడితో ఈ అయోమయ చర్చ ముగించారు.

ఇంతకీ ఆ అధికారిణి ఎవరో తెలుసా? ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత!!!

ADVERTISEMENT
Latest Stories