
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు రోజురోజుకీ మారిపోతున్నాయి. గెలిచేదెవరో, ఓడేదెవరో, అసలు గెలుపుని డిసైడ్ చేసేది ఎవరో అనే చర్చ జరుగుతుంది. పార్టీల పరంగా ఎవరి స్ట్రాటజీలు వారికున్నాయి. అధికార, ప్రతిపక్షాలు గెలుపు పై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పైకి ఎంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా లోలోపల ఎవరికి ఉండే గుబులు వారికుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు కూడా బాగా వినిపిస్తుంది. అసలు ఆంధ్రా రాజకీయం మొత్తం పవన్ చుట్టూనే తిరుగుతున్నట్లు కనిపిస్తుందట. ఏ పార్టీ గెలవాలో డిసైడ్ చేసే శక్తిగా పవన్ మారిపోయారని రాజకీయవర్గాలు చర్చించుకోవడం విశేషం. త్వరలో జరగబోయే ఎన్నికల్లో పవన్ సొంతంగా అధికారంలోకి రాలేకపోయినా, గెలుపు ఎవరి సొంతం కావాలో మాత్రం నిర్ణయించే పరిస్థితికి వచ్చేసారనే వ్యాఖ్యలే వినిపిస్తున్నాయి.
పార్టీని నడిపించడంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల మధ్య ఉన్న వ్యత్యాసం పైన కూడా చర్చజరుగుతున్న పరిస్థితి. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి 18 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్నప్పటికి, పార్టీని కొనసాగించకుండా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారనే నెగిటివ్ టాక్ చిరంజీవి పై ఉంది.
కానీ పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం చాలా పాజిటివ్ టాక్ వినబడుతుంది. జనసేన పార్టీని స్థాపించి సుమారు 10 సంవత్సరాలు అవుతున్నా పార్టీని వేరే పార్టీలో విలీనం చేయాలనే ఆలోచన గాని, పార్టీని ఏమి నడిపిస్తాంలే అనే ఆలోచనగాని, చివరకి గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఓటమి చెందినా ఏమాత్రం నిరుత్సాహ పడకుండా ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తూ పార్టీని కొనసాగించడం వంటి అంశాలతో పవన్ కళ్యాణ్ పై ప్రజల్లో ఓ సదాభిప్రాయం వచ్చినట్లయిందని విశ్లేషకుల విమర్శ.
ప్రస్తుతం కర్ణాటకలో ఎన్నికల ఫలితాలు ఆంధ్ర రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపబోతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలపై సర్వేలన్ని కాంగ్రెస్ కి అనుకూలంగా చెప్తున్నా.. అసలు మ్యాజిక్ ఫిగర్ పైన సందిగ్ధం మాత్రం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జేడీఎస్ పార్టీ కీలకంగా మారబోతుందనే వ్యాఖ్యలే వినిపిస్తున్నాయి.
గతంలో కర్ణాటకలో కుమారస్వామి ఏవిధంగా అయితే ముఖ్యమంత్రి అయ్యారో, మరలా ఇప్పుడు కూడా కర్ణాటకలో హాంగ్ వస్తే కుమారస్వామినే కీలకం కాబోతున్నారు అనే వ్యాఖ్యలే వినిపిస్తున్నాయి. ఇప్పుడు అదే తరహలో పవన్ కళ్యాణ్ కి కూడా అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతానికి పవన్ బాబుతో సఖ్యతగా ఉంటున్నారు. బాబుతో కలసి నడవాలనే యోచిస్తున్నట్లు పరిస్థితులు కనబడుతున్నాయి. అతి స్వల్ప వ్యవధిలోనే బాబు తో మూడు సార్లు భేటీ అవ్వడం బాబుతో కలసి పవన్ నడవాలనుకుంటున్నారు అన్న వ్యాఖ్యలకు బలం చేకూరుస్తుంది. మరో పక్క బీజేపీ కూడా పవన్ తోనే ఎన్నికల బరిలోకి వెళ్లాలని చూస్తుంది. బీజేపీ కూడా కలసి వస్తే టిడిపి, బీజేపీ, జనసేన కలసి పోటీచేయాలనే ఆలోచన పవన్ కళ్యాణ్ కి బలంగా ఉన్నట్లు తెలుస్తోంది.
కానీ అనుకోని విధంగా కర్ణాటక పరిస్థితులు చూశాక జనసేన శ్రేణుల్లో కొత్త ఆలోచన మొదలయ్యిందని, ఆ ఆలోచనతో పవన్ కళ్యాణ్ పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం జరుగుతుందని టాక్ వినిపిస్తుంది. బాబుతో కలసి నడిస్తే మంత్రి పదవులు వస్తాయేమో కానీ జనసేన పార్టీకి గాని, పవన్ కళ్యాణ్ కి గాని అంతగా గుర్తింపు లభించదనేది పవన్ అభిమానుల అభిప్రాయంగా కనిపిస్తుంది.
ప్రస్తుతం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చితే వైసీపీ లాభం జరుగుతుంది. కానీ రాజకీయంగా ఆపై వచ్చే ఎన్నికలకి పూర్తి స్థాయిలో సిద్ధం అయ్యే పరిస్థితి వస్తుంది కదా అనేది కూడా అభిమానుల నుండి వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తుంది.
మరోపక్క పవన్ కళ్యాణ్ పోటీ చేసినా ఆశించిన మేరకు సీట్లు రాకపోతే పరిస్థితి ఏంటి అనే చర్చ కూడా జరుగుతుంది. అసలు పోటీ చేసి భంగపాటుకు గురయ్యే కంటే కింగ్ మేకర్ లా మారి బరిలో దిగకుండా పూర్తి స్థాయిలో చంద్రబాబు కి సహకరిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో కూడా పవన్ ఉన్నట్లు తెలుస్తుంది. వైసీపీ, టీడీపీ ల మధ్య అమీతుమీ పోరులో టీడీపీకి వెన్నంటే ఉండి నడిపిస్తే పవన్ కి గెలుపుని డిసైడ్ చేసిన వ్యక్తిగా మరింత పేరు వస్తుందని, రాబోయే రోజుల్లో జనసేనకి తిరుగులేకుండా ఉంటుంది కదా అనే అభిప్రాయాన్ని జనసేన నేతలు పవన్ వద్ద వ్యక్తపరుస్తున్నారని సమాచారం.
ఒకవేళ ఎన్నికల బరిలో జనసేన ఒంటరిగా పోటీచేస్తే సాధ్యమైనంతవరకు ఎక్కువ సీట్లు తెచ్చుకోని కీలకం కావాలనే ఆలోచనలో కూడా ఉన్నారట. వారు ఊహిస్తున్నట్లుగా ఎక్కువ సీట్లు సాధించగలిగితే కర్ణాటకలో కుమార స్వామి ఎలా కీలకం అయ్యారో, పవన్ కూడా అంతే కీలకం అవుతారు, ముఖ్యమంత్రి సీటు ఖాయం అనే అభిప్రాయాన్ని కూడా ఓ వర్గం జనసేన నేతలు వ్యక్తపరుస్తున్నారని తెలుస్తుంది. పవన్ నే అన్నింటా కీలకం కావాలనేదే జనసైనికులు, పవన్ అభిమానులది లక్ష్యంగా కనబడుతుంది.
ఏదిఏమైనా పవన్ నిర్ణయాన్ని బట్టే పార్టీల గెలుపు డిసైడ్ అయ్యే పరిస్థితి వచ్చిందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతుంటే, పవన్ మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది
Rajinikanth's Jailer 2 is maintaining strong momentum at the box office on its second day,…
Shah Rukh Khan’s fans have been eagerly waiting for an update on his next film,…