కొన్ని కొన్ని సినిమాల టీజర్లు చూసినపుడే ప్రేక్షకులకు ఒక రకమైన అనుభూతి కలుగుతుంది. అలా తమ టీజర్ ద్వారా వీక్షకుల మదిలో స్థానం సంపాదించుకున్న “పెళ్లిచూపులు” చిత్ర యూనిట్, తాజాగా విడుదల చేసిన ట్రైలర్ తో ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేలా చేసింది. ఎలాంటి హంగామా లేకుండా సింపుల్ గా కనపడుతున్న సన్నివేశాలు… అలాగే ఓవర్ యాక్షన్ కు తావు లేకుండా నటిస్తున్న తారాగణం… రనగణధ్వనులు లేకుండా వినిపించే సంగీతం… ఈ సినిమా ట్రైలర్ ను ప్రేక్షకులకు ఫ్రెష్ గా పరిచయం చేసాయి.
సహజంగా అందరి జీవితాలలో జరిగే ఉదంతం కావడంతో ఈ ‘పెళ్లిచూపులు’ అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. అలాగే నేటితరం మహిళామణుల మాదిరి అబ్బాయిలను ప్రశ్నలు అడుగుతూ సాగిన విధానం, దానికి పెళ్ళికొడుకు ఇచ్చిన సమాధానాలు అన్ని ఎంటర్టైన్మెంట్ పంథాలో సాగాయి. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జంటగా నటిస్తున్న రీతూ వర్మ, విజయ్ ల జోడి ఆడియన్స్ కు ఫ్రెష్ నెస్ ను పంచుతోంది.



