
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ గత కొంత కాలంగా జనంలో మీడియాలో బాగా నానుతోంది. ఒకటి రెండు కాదు పదుల సంఖ్యలో ప్రాజెక్టులను సిద్ధం చేసుకుని ఏకంగా హాలీవుడ్ మార్కెట్ నే టార్గెట్ చేస్తామని నిర్మాత టిజి విశ్వప్రసాద్ ఆ మధ్య చెప్పడం గుర్తే. అయితే ఆలోచన ఎంత గొప్పగా ఉన్నా ఆచరణలో చేస్తున్న పొరపాట్లు పెద్ద మూల్యాన్నే చెల్లించేలా చేస్తున్నాయి. దానికి బాధ్యత ఎవరిదంటే చెప్పడం కష్టం.
గత కొన్ని నెలల్లో ఒక్క ధమాకాని మినహాయిస్తే పీపుల్స్ మీడియా అన్నీ ఎదురు దెబ్బలే తింది. ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయికి పబ్లిసిటీ ఖర్చులు రాలేదు. రామబాణం గోపీచంద్ కెరీర్ బిగ్గెస్ట్స్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. నూటా ఎనభై కోట్లకు కొన్నామని చెప్పుకున్న ఆదిపురుష్ చావు తప్పి కన్నులొట్ట పోయినంత పని చేసింది. టక్కర్ కనీసం ప్రమోషన్ కు తగ్గ ఓపెనింగ్స్ తేలేకపోయింది.
ఇప్పుడు బ్రో మీద ఆశించిన బజ్ కనిపించడం లేదు. ఇవన్నీ ప్రణాళిక లోపం వల్ల జరుగుతున్నవే. ఒకప్పుడు గూఢచారి, ఓ బేబీ, రాజ రాజ చోర లాంటి సినిమాల్లో విజయవంతమైన భాగస్వామ్యం నిర్వహించిన ఈ బడా సంస్థకి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఇబ్బంది పెడుతున్నాయి. ప్రభాస్ దర్శకుడు మారుతీ మూవీ నిర్మాణంలో ఉంది.
సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ కూడా కొంటామని గతంలోనే ప్రకటించారు. కోట్ల పెట్టుబడులు సిద్ధంగా ఉన్నాయని కేవలం కాంబినేషన్లను నమ్ముకుంటే దెబ్బలు తగులుతూనే ఉంటాయి. ధమాకా కూడా మాస్ కంటెంట్, శ్రీలీల గ్లామర్, రవితేజ ఎనర్జీ వల్ల ఆడిందే తప్ప అదేమీ మాస్ మహారాజా బెస్ట్ గా చెప్పుకునేది కాదు. అలాంటప్పుడు పొరపాటు ఎక్కడ జరుగుతోందో సరిచూసుకోవడం అవసరం.
ఇండస్ట్రీలో ఎక్కువ కాలం మనుగడ సాగించాలంటే వరసగా సినిమాలు ప్లాన్ చేసుకోవడం ఎంత ముఖ్యమో హిట్లు దక్కడం కూడా అంతే ముఖ్యం. సురేష్ బాబు స్పీడ్ తగ్గించినా, అల్లు అరవింద్ ఆచితూచి అడుగులు వేస్తున్నా, దిల్ రాజు ప్లాన్డ్ గా పెద్ద హీరోలను మాత్రమే ఎంచుకుంటున్నా అంతా సేఫ్ గేమ్ లో భాగమే. అందరి కంటే మెగా స్పీడ్ తో పరుగులు పెట్టిన మైత్రికు సైతం షాకులు తప్పడం లేదు. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిల సక్సెస్ ల ముందు వెనుకా బోలెడు ఫ్లాపులున్నాయి. డిస్ట్రిబ్యూట్ చేసిన చిన్న సినిమాలన్నీ టపా కట్టాయి. బిల్డింగ్ కట్టే ఆలోచన ఎంత బలంగా ఉన్నా వాడే సిమెంట్ లో నాణ్యత ఉండాలి. లేదంటే దెబ్బ పడుతుంది.
Sai Dharam Tej is pinning big hopes on Sambarala Yeti Gattu. Made on the biggest…
Nagarjuna has raised an important point about the release problems faced by smaller films like…