
పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు జమ్మిచెట్టుపై తమ అస్త్రాలను దాచి పెట్టారు. అజ్ఞాతవాసం ముగియగానే వాటిని తీసుకొని ఉపయోగించుకొని శత్రువులను ఓడించాడు. ఇప్పుడు మన దేశంలో రాజకీయ పార్టీలు కూడా అదే చేస్తున్నాయి.
గత ప్రభుత్వాలు అలియాస్ తమ రాజకీయ శత్రువులని కట్టడి చేసేందుకు, అవసరమైతే శిక్షించేందుకు, పగ తీర్చుకునేందుకు అవినీతి కేసులను వాడుతుంటాయి. అవసరం తీరాక మళ్ళీ మూట కట్టి జమ్మిచెట్టు (అటక)పై పెట్టేస్తున్నాయి.
పాండవుల కంటే మన రాజకీయ నాయకులే ఎక్కువ తెలివైనవారు. పాండవులు తమ ఆయుధాలను ఇతరులు ఎవరూ వాడుకోవడానికి ఇవ్వలేదు. కానీ అధికారంలో ఉన్న మన పార్టీలు తమ ఆయుధాలు అలియాస్ అవినీతి కేసులను పరస్పరం బదిలీ చేసుకుంటున్నాయి.
తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం కేసుతో కేసీఆర్‌ని రాజకీయంగా అస్త్ర సన్యాసం చేయించగలిగారు. కానీ దానిని సంధించి ఆయన రాజకీయంగా కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టడానికి సిద్దమయ్యారు కూడా. కానీ రాత్రికి రాత్రి ఏం జరిగిందో తెలీదు కానీ ఆ కేసుని సీబీఐకి అంటే మోడీ చేతికి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు.
అంటే తన చేతిలో ఉన్న ఆ అస్త్రాన్ని మోడీ చేతికి అందించి కేసీఆర్‌ని కొట్టమన్నారనుకోవచ్చు లేదా మోడీయే రేవంత్ రెడ్డి చేతిలో ఉన్న ఆ అస్త్రాన్ని తీసుకొని ఉండవచ్చు.
కనుక మోడీ దానిని వెంటనే కేసీఆర్‌పై సంధించి బందిస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆయనకు వేరే ఆలోచన ఉన్నట్లుంది. అందుకే సీబీఐని పంపించలేదు! ఆ కాళేశ్వరం అస్త్రాన్ని భద్రంగా జమ్మిచెట్టు (అటక)పై దాచి పెట్టారు.
కనుక దానిని మళ్ళీ ఎప్పుడు కిందకు దింపుతారో.. లేదో?కేసీఆర్‌పై సందిస్తారో లేక ఆ అస్త్రం బారి నుంచి కేసీఆర్‌ని కాపాడటం కోసమే రేవంత్ రెడ్డి వద్ద నుంచి తీసేసుకున్నారో?ఎన్నికలు దగ్గర పడితే గానీ చెప్పలేము.
కనుక ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఫోన్ ట్యాపింగ్, ఎఫ్-1 రేసింగ్, వివేకా హత్య, మద్యం కుంభకోణం… ఇలా కేసులన్నీ రాజకీయ అస్త్రాలు మారిపోయి జమ్మిచెట్టు ఎక్కిపోతూనే ఉన్నాయి.
కనుక వాటిపై నోటీసులు, విచారణ, కేసులు , అరెస్టులు, బెయిలు.. వీటన్నిటి గురించి మీడియా వార్తలు… అన్నీ కూడా సమస్యలతో సతమతమవుతున్న ప్రజలను రంజింపజేయడానికే అని భావించవచ్చు. ఎందుకంటే ఏ కేసులోను ఎవరికీ శిక్షలు పడవు. ఎందుకంటే అవి ప్రత్యర్ధులను కట్టడి చేసేందుకు ఉపయోగపడే రాజకీయ అస్త్రాలని ముందే చెప్పుకున్నాము కదా!
ఓటీటీ లేదా డిష్ టీవీలలో సినిమాలు చూడాలంటే చందా కట్టాల్సి ఉంటుంది. అలాగే ఈ కేసులతో మనోరంజనం కోసం దేశ ప్రజలే పన్నుల రూపంలో ఏటా వేల కోట్లు చెల్లిస్తుంటారు. కానీ తాము సబ్‌స్క్రిప్షన్‌కి సొమ్ము చెల్లిస్తున్నామనే సంగతి వారికి తెలీదు. ఈ కేసుల వెబ్ సిరీస్ ఉచితంగా చూస్తున్నామని అనుకుని ఎంజాయ్ చేస్తుంటారు.
ఒకవేళ ఈ విషయం తెలిసిఉన్నా ఎవరూ ఈ ఉచిత వినోదం ఆపలేరు.. కాదనలేరు. ఎందుకంటే ఒకసారి ప్రారంభమైతే ఎన్నటికీ ఆగని తెలుగు టీవీ సీరియల్స్ వంటివి కనుక!
కనుక ఏదో కేసులో ఏదో జరిగిపోతోందని మీడియాలో ఏవో వార్తలు వస్తే, భారత్-పాక్ మ్యాచ్‌లో భారత్‌ని మనమే దగ్గరుండి గెలిపించేసినట్లు సంతోషం ఉప్పొంగిపోతూనే ఉంటాము… ఉండాలి! ప్రజలందరూ ఇలా కూడా హాయిగా సంతోషంగా ఉన్నప్పుడు అవినీతిపరులకు శిక్షలు అవసరమా?
Telugu cinema seems to be getting increasingly comfortable with extreme violence. But the latest Ranabaali…
Over the past two weeks, many USICS applicants have received a concerning notice from the…