
ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు ఓ పార్టీలో టికెట్ దొరకలేదని మరో పార్టీలో చేరి టికెట్ సంపాదించుకోవడం సర్వసాధారణ విషయమే.
విజయవాడ పశ్చిమ నుంచి జనసేన అభ్యర్ధిగా పోటీ చేయాలనుకున్న పోతిన మహేష్ కూడా అదే చేశారు. పొత్తులో భాగంగా ఆ సీటు బీజేపీకి వెళ్ళిపోవడంతో ఆయన తీవ్ర నిరాశ చెంది అధినేత పవన్ కళ్యాణ్‌పై కొన్ని ఘాటు విమర్శలు చేసి నిన్న పార్టీ వీడారు. నేడు గుంటూరులో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపిలో చేరిపోయారు.
విజయవాడ పశ్చిమ నుంచి వైసీపి అభ్యర్ధిగా షేక్ ఆసిఫ్ పోటీ చేస్తున్నారు కనుక పోతిన మహేష్ జనసేనపై అలిగి వైసీపిలో చేరినా ఆయనకు టికెట్ లభించదు. కానీ వైసీపిలో చేరారు కనుక షేక్ ఆసిఫ్‌కు మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఆయన వలన వైసీపి లాభపడుతుంది తప్ప ఆయనకు ఒరిగేదేమీ లేదని స్పష్టం అవుతోంది.
మరోవిషయం ఏమిటంటే అక్కడ నుంచి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న సుజనా చౌదరి వైసీపి అభ్యర్ధి కంటే అన్నివిదాలా చాలా బలమైనవారు. కనుక పోతిన వైసీపి అభ్యర్ధి షేక్ ఆసిఫ్‌కు మద్దతు ఇచ్చినా నిరుపయోగంగా మారే అవకాశం ఉంది.
ఒకవేళ షేక్ ఆసిఫ్ గెలవకపోతే ఆయనను ఎలాగూ జగన్ పక్కన పెట్టేస్తారు. ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్ధినే పక్కన పెట్టేసినప్పుడు పార్టీలోకి కొత్తగా వచ్చిన పోతిన మహేష్‌ని కూడా పక్కన పెట్టేయకుండా ఉండరు కదా?
అన్నిటికీ కంటే ముఖ్యంగా ఈసారి ఎన్నికలలో టిడిపి, జనసేన, బీజేపీల కూటమికే విజయావకాశాలు ఉన్నాయని సర్వేలన్నీ సూచిస్తున్నప్పుడు, టికెట్ ఇవ్వలేదని పోతిన మహేష్ లేదా మరొకరు గెలిచే కూటమిని వదిలిపెట్టి, ఓడిపోయే సూచనలు కనిపిస్తున్న వైసీపి లేదా కాంగ్రెస్ పార్టీలో చేరడం రాజకీయంగా పెద్ద తప్పటడుగే అవుతుంది.
ఎందుకంటే, పార్టీకి చాలా అవసరమైన సమయంలో బయటకు వెళ్ళిపోయి, ఆనక తిరిగి రావాలనుకున్నా అధికార పార్టీలోకి ప్రవేశం అంత సులువు కాబోదు.
ఈసారి టిడిపి, జనసేన, బీజేపీల కూటమికి విజయావకాశాలు ఉన్నందున వైసీపిని వీడి ఈ కూటమిలో చేరుతున్నవారు, చేరి టికెట్స్ సంపాదించుకున్నవారు, సంపాదించుకొని ఎన్నికలలో గెలిచినవారు అందరూ అదృష్టవంతులే అనుకోవచ్చు.
కానీ కూటమి విజయావకాశాలను గుర్తించలేక ఎన్నికలకు నెలరోజులు ముందు కూటమిని విడిచిపెట్టి వైసీపిలో చేరుతున్నవారు దురదృష్టవంతులే అనుకోకతప్పదు. వారిలో పోతిన మహేష్ కూడా ఒకరు కావచ్చు. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఈ వాదన నిజమో కాదో అందరూ చూడవచ్చు.
Aadarsha Kutumbam - AK47 was recently postponed again, and there is still no clarity about…
The USCIS has officially removed the 540-day automatic extension granted to H-4 visa holders with…