నిద్రలు మానుకుని మరీ ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూసిన సలార్ టీజర్ ఇంకా సగం రోజు గడవకుండానే పాతిక మిలియన్ల వ్యూస్ దాటేసింది. తెలివిగా ఒకే భాషలో కట్ చేశారు కాబట్టి యూట్యూబ్ లో కొత్త రికార్డులు నమోదు కావడం ఖాయమే. అయితే ఈ వ్యూస్, లైకుల సంబరం కాదుగా అభిమానులు కోరుకుంది.
ఒక అద్భుతాన్ని చూడబోతున్నామన్న ఉత్సాహం మీద ప్రశాంత్ నీల్ పూర్తిగా నీళ్లు చల్లలేదు కానీ కొంతమేర నిరాశపరిచిన మాట వాస్తవం. తమ హీరో ఫేస్ ని కేవలం ఒక ఫ్రేమ్ లో అది కూడా సైడ్ కట్ లో చూపించడం ఉసూరుమనిపించింది. సరే ఏదో పర్లేదని సర్దిచెప్పుకున్నా సలార్ అడుగడుగునా కెజిఎఫ్ ఛాయలు కనిపించడాన్ని ఎవరూ కాదనలేరు.
చీకటి సామ్రాజ్యం, ట్యాంకర్లు, మెషీన్ గన్లు పట్టుకున్న ప్రైవేట్ ఆర్మీ, వందల సంఖ్యలో గోడౌన్లు మొత్తం సెటప్ ఎంత కాదనుకున్నా రాఖీ భాయ్ బంగారు గనులను గుర్తు చేస్తూనే ఉన్నాయి. ఏ దర్శకుడికైనా ఒక బ్లాక్ బస్టర్ ప్రభావం అతను రాసుకోబోయే తర్వాతి కథల మీద తప్పకుండా ఉంటుంది. అలా అని అదే హ్యాంగోవర్ లో ఉన్నా ఇబ్బందే. కెజిఎఫ్ ని అనుకరించబోయి కబ్జా ఎంత దారుణంగా బోల్తా పడిందో చూశాం.
ఇక్కడ ప్రశాంత్ నీల్ ప్రతిభను, మేధాశక్తిని తక్కువంచనా చేయడం లేదు. కానీ సగటు మూవీ లవర్స్ అతన్నుంచి చాలా అంటే చాలా ఆశిస్తున్నారు. మళ్ళీ కెజిఎఫ్ లాంటి సెటప్ లేదా అదే తరహా ఎలివేషన్ హీరోయిజంనో కోరుకోవడం లేదు. బాహుబలి తర్వాత రాజమౌళి మళ్ళీ జానపద ఫాంటసీ వైపే వెళ్లి ఉండొచ్చు. కానీ ప్రీ ఇండిపెండెన్స్ కాన్సెప్ట్ తీసుకున్నాడు. ఇప్పుడు ఇండియానా జోన్స్ తరహా ఫారెస్ట్ అడ్వెంచర్ ని మొగ్గు చూపాడు. ఏది తీసుకున్నా ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకెళ్లే కలలను కంటున్నాడు.
శాండల్ వుడ్ మాస్టర్ మైండ్ గా చెప్పుకుంటున్న ప్రశాంత్ నీల్ నుంచి కోరుకునేది ఇదే. పదే పదే గ్యాంగ్ స్టర్ డ్రామాలు బోర్ కొట్టే ప్రమాదం లేకపోలేదు. కెజిఎఫ్ ఇండియాలో ఎంత భీకరంగా ఆడినా ఓవర్సీస్ లో మాత్రం ఆర్ఆర్ఆర్ తరహాలో మేజిక్ చేయలేదు. కనీసం ఆస్కార్ ఆలోచన కూడా రాలేదు. సలార్ సినిమా బాగుండొచ్చు. కాదనడం లేదు.
ఇంకా రిలీజ్ దూరంలో ఉంది కాబట్టి అప్పుడే అంచనాకు రాలేం. కానీ సగటు ఆడియన్స్ కి కొత్తగా ఏముందబ్బా, అదే కెజిఎఫ్ లాగే అనిపిస్తోందని ఫీలైతేనే అసలు ముప్పు. సలార్ బ్లాక్ బస్టర్ అయినా సరే ప్రశాంత్ నీల్ కొత్త జానర్ వైపు అడుగులు వేసి తనలో క్రియేటివిటీని పీక్స్ కి తీసుకెళ్ళాలనేదే సగటు సినీ ప్రేమికుడి ఆకాంక్ష. అప్పుడే దక్షిణాది సత్తా ప్రపంచానికి మరింత బలంగా తెలుస్తుంది.



