
దేశంలో భిన్న సిద్ధాంతాలు కలిగిన వివిధ పార్టీలకు ఎన్నికల వ్యూహ నిపుణుడుగా సేవలందించిన ప్రశాంత్ కిషోర్, తన సొంత రాష్ట్రం బీహార్‌లో ‘జన్ సూరజ్’ పార్టీతో శాసనసభ ఎన్నికలలో అదృష్టం పరీక్షించుకోబోతున్నారు. దాదాపు రెండేళ్ళుగా ఈ ఎన్నికల కోసం సన్నాహాలు చేసుకొని సిద్దమయ్యారు. ఇప్పటికే రెండు అభ్యర్ధుల జాబితాలు కూడా ప్రకటించారు.
కానీ ఎవరూ ఊహించని విధంగా తాను ఈ ఎన్నికలలో పోటీ చేయడం లేదని ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన చేశారు. తాను ఈ ఎన్నికలలో పోటీ చేసి గెలవడం కంటే తన పార్టీని గెలిపించుకోవడం చాలా ముఖ్యమన్నారు. ఇందుకోసం పూర్తి సమయం కేటాయించేందుకు తాను పోటీ చేయడం లేదని చెప్పారు.
ఈ ఎన్నికలలో అధికార జేడీయు-బీజేపి కూటమి, ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఆర్‌జేడీ-కాంగ్రెస్ కూటమి రెంటికీ ఓటమి ఖాయమన్నారు. మొత్తం 243 స్థానాలలో తమ పార్టీకి కనీసం 150 వస్తాయని, అంతకు ఒక్క సీటు తగ్గినా తాను ఓడిపోయినట్లే అని ప్రశాంత్ కిషోర్ అన్నారు. నితీష్ కుమార్ పాలనతో బీహార్ ప్రజలు విసుగెత్తిపోయారు. కనుక ఆయన మరోసారి అవకాశం ఉండదు.
“మేము అధికారంలో వచ్చిన మూడు నెలల్లోనే అవినీతికి పాల్పడిన 100 మంది రాజకీయ నేతలను, అధికారులపై కేసులు నమోదు చేసి జైలుకి పంపిస్తాము. బీహార్ రాష్ట్రంలో మళ్ళీ శాంతి భద్రతలు పునరుద్దరించి, రాష్ట్రాన్ని అన్ని రంగాలలో దేశంలోనే అగ్రగామిగా నిలుపుతాము,” అని ప్రశాంత్ కిషోర్ అన్నారు.
ఎన్నికలలో పార్టీని గెలిపించుకునేందుకు ప్రశాంత్ కిషోర్ తీసుకున్న నిర్ణయంలో సహేతుకంగానే ఉంది. అయన తన పూర్తి సమయం పార్టీ అభ్యర్ధులకు కేటాయించి గెలుపు వ్యూహాలు రచించి ఇవ్వగలరు. ఆయన వ్యూహాలు ఫలించి పార్టీ ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వస్తే ప్రశాంత్ కిషోర్ మరోసారి ‘కింగ్ మేకర్’గా మంచి పేరు సంపాదించుకుంటారు. ముఖ్యమంత్రి పదవి కూడా చేపట్టగలరు.
కానీ ఆయన ఈ ప్రకటన ఓ మూడు నెలల క్రితమే చేసి ఉండి ఉంటే రాజకీయ ప్రత్యర్ధులకు వేలెత్తి చూపే అవకాశం ఉండేది కాదు. కానీ సరిగ్గా ఎన్నికలకు ముందు ఈ ప్రకటన చేయడంతో, ఓటమికి భయపడి ముందే అస్త్ర సన్యాసం చేశారని ఆయన ప్రత్యర్ధులు విమర్శించకుండా ఉండరు.
దీనినే వారు హైలైట్ చేస్తూ గెలుపుపై ఆయనకే నమ్మకం లేనప్పుడు అలాంటి పార్టీకి ఓట్లు వేసి ఏం ప్రయోజనం? దానికి ఓట్లు వేసి వృధా చేసుకోకుండా మా కూటములకు ఓట్లు వేసి గెలిపిస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని ప్రచారం చేసుకోకుండా ఉండవు. కనుక ప్రశాంత్ కిషోర్ నిర్ణయంతో జన్ సూరజ్ పార్టీకి మేలు కలగవచ్చు లేదా పూర్తిగా నష్టపోయే అవకాశం కూడా ఉంది.
బీహార్ శాసనసభ ఎన్నికలు నవంబర్ 6,11 తేదీలలో రెండు దశలలో జరుగుతాయి. నవంబర్ 14న ఫలితాలు వెలువడతాయి.
A suspected honey-trapping and extortion racket has been busted in Assam’s Jorhat. The police arrested…
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌తో ఢిల్లీలో నిర్వహించిన ‘పైలట్ ప్రాజెక్ట్’ విజయవంతమైందని భావించిన సీజేపీ.. ఇప్పుడు కేంద్ర…