
తొలి 9 రోజుల్లో దాదాపుగా 90 కోట్ల షేర్ ను ఒక్క నైజాం ఏరియా నుండే రాబట్టిన “ఆర్ఆర్ఆర్” ఆదివారం నాటి కలెక్షన్స్ తో 100 కోట్లు పూర్తి చేసుకోబోతున్నారు. ఇదేమి సాధారణ విషయం కాదు. ఒకప్పుడు ఏపీ, తెలంగాణా మొత్తానికి కలిపి 100 కోట్లు అంటే అది అద్వీతీయమైన విషయం. కానీ దానిని తృణప్రాయంగా 10 రోజుల్లోనే సొంతం చేసుకోవడం విశేషం.
‘ఆర్ఆర్ఆర్’తో ఒక్క నైజాం నుండే 100 కోట్లు అందుకోవడంతో కధ ఇంకా పూర్తి కాలేదు. ఏప్రిల్ 14వ తేదీన విడుదల కాబోతున్న “కేజీఎఫ్ 2” వరకు ఈ హంగామా ఇలాగే కొనసాగే అవకాశాలు పుష్కలంగా కనపడుతుండడంతో, ఫైనల్ ఫిగర్స్ ట్రేడ్ వర్గాలను విస్మయపరిచే విధంగా ఉండడం ఖాయం అంటూ ట్రేడ్ పండితులు లెక్కలు కడుతున్నారు.
నైజాం పరిస్థితి ఇలా ఉంటే సీడెడ్, ఉత్తరాంధ్రలలో కూడా కనీవినీ ఎరుగని రీతిలో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. సీడెడ్ లో 40 కోట్ల మార్క్ ను, ఉత్తరాంధ్రలో 30 కోట్ల మార్క్ ను సొంతం చేసుకోనుంది. ఇదంతా కేవలం 10 రోజుల్లోనే! మన పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, కర్ణాటకలలో పరిస్థితులు కూడా ఇందుకు విరుద్ధంగా ఏమీ లేవు.
బాలీవుడ్ నాట కూడా ‘ఆర్ఆర్ఆర్’ హంగామా కొనసాగుతోంది. జాన్ అబ్రహం వంటి యాక్షన్ ఇమేజ్ కలిగిన హీరో నటించిన “ఎటాక్” సినిమా విడుదలైనా, మన సినిమానే జెండా ఎగురవేస్తోంది. బాలీవుడ్ లో ఇప్పటికే 150 కోట్ల గ్రాస్ ను అందుకున్న “ఆర్ఆర్ఆర్” ఫైనల్ ఫిగర్స్ 200 కోట్ల పైబడి ఉంటాయని అంచనా వేస్తున్నారు.
ఇక యుఎస్ లో 11 మిలియన్ డాలర్స్ ను దాటి 12 మిలియన్స్ కు చేరువలో ఉన్న “ఆర్ఆర్ఆర్” అమీర్ ఖాన్ ‘దంగల్’ను అయితే ఖచ్చితంగా క్రాస్ చేస్తుంది గానీ, ‘బాహుబలి 2’ నెంబర్స్ కు చేరువ అవుతుందా? లేక దాటుతుందా? అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఓవర్సీస్ లో మిగిలిన ఏరియాలైన ఆస్ట్రేలియా తదితర దేశాలలో కూడా “ఆర్ఆర్ఆర్” రికార్డుల పరంపర కొనసాగుతోంది.
ఈ నెంబర్స్ అన్నీ ఒక్క రాజమౌళి వలనే సాధ్యం అనిపించే విధంగా మరోసారి దేశవ్యాప్తంగా “జక్కన్న” పేరు మారుమ్రోగుతోంది. రాజమౌళి సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ ఇచ్చినా చాలు అనుకునే విధంగా పరిస్థితులు ఉన్నాయని, విలన్ క్యారెక్టర్లు వేసే రాహుల్ దేవ్ వెల్లడించడం, జక్కన్న కీర్తి ప్రతిష్టతలకు అద్దం పడుతోంది. నిజంగా రాజమౌళికి ‘హ్యాట్సాఫ్’ చెప్పాల్సిందే!
Bigg Boss 20 has reportedly become the centre of another controversy. This time, the discussion…
Rajinikanth's most anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar, is gearing up for a…