
పదవి రాక ముందు వరకు ఒక లెక్క, పదవి వచ్చాక మరొక లెక్క అన్నట్లు.. పదవి రాక ముందు ఆయన ఓ ఉద్యమకారుడు. ఆయన జాతులకు అండగా నిలబడి కేంద్రం స్థాయిలో కొట్లాడిన వ్యక్తి. అలాంటి ఆ ఉద్యమకారుడిని ప్రతి పార్టీ గౌరవించింది. తీరా ఆయనకు పదవి వచ్చేసరికి ఉద్యమకారుడు కాస్తా రాజకీయ నాయకుడై నమ్మిన జాతినే వ్యక్తులకు తాకట్టుపెట్టే స్థాయికి దిగజారిపోయాడని ఆయన్ని దేవుడిగా చూసిన సంఘాలే ఆయనపై వ్యతిరేక స్వరాలను వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరు ఆ ఉద్యమకారుడు, ఎవరిని ఎవరికి తాకట్టు పెట్టాడని ఆలోచిస్తున్నారా! అదేంటో చూద్దాం పదండి…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బీసీ హక్కుల కోసం గళమెత్తిన నాయకుల్లో ఆర్.కృష్ణయ్య ముందుంటారు. బిసిల ఐక్యత కోసం, వారికి అన్నింటా తగిన గుర్తింపు కోసం ఆర్.క్రిష్ణయ్య చేసిన పోరాటం అంతా ఇంతా కాదు. బిసి లకు జాతీయ స్థాయిలో కూడా ఆయన ఓ గుర్తింపు తెచ్చారు. దీంతో బీసీ ల్లో కృష్ణయ్యకు మంచి ఫాలోయింగ్ కూడా వచ్చింది.
బీసీల్లో ఆర్ క్రిష్ణయ్య కు ఉన్న క్రేజ్ చూసి వివిధ పార్టీలు కూడా ఆయనకి చట్టసభల్లో అవకాశం కల్పించాయి. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున ఎల్.బి.నగర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే గా పోటీ చేసి గెలుపొందారు. తరువాత 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున మిర్యాలగూడ నుండి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం ఆంధ్రలో వైసీపీ ప్రభుత్వం ఆర్.క్రిష్ణయ్య ని రాజ్యసభకు పంపించింది.
ఆర్ క్రిష్ణయ్య రాజ్యసభ సభ్యుడిగా అయిన తరువాత నుండి ఆయనలో చాలా మార్పు వచ్చిందని, బీసీ సంఘాలను, బిసిల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని బిసి సంఘాలు క్రిష్ణయ్య పై నిప్పులు చెరుగుతున్నాయి. పార్టీలకు అతీతంగా బిసి లకు సంక్షేమాన్ని అందించాల్సింది పోయి, ఓ పార్టీ అధినేతకు కొమ్ము కాస్తున్నారంటూ ఆయన పై విమర్శలు చేస్తున్నాయి బిసి సంఘాలు. మరికొంతమంది బీసీ నాయకులైతే ఆంధ్రలో బిసి సంఘాన్ని జగన్ కి అమ్మకానికి పెట్టేసారంటూ క్రిష్ణయ్య తీరుపై విరుచుకుపడుతున్నారు.
బీసీ లంతా వచ్చే ఎన్నికల్లో జగన్ నే గెలిపించాలి అని బిసి సంఘాలకు క్రిష్ణయ్య పిలునిచ్చారు. దీంతో ఇదేం పద్ధతి, ఇదేం పెత్తనం అంటూ ఆయన పై బిసి సంఘ నేతలే బహిరంగంగా విమర్శలు చేశారు. విశాఖలో అయితే కొంతమంది బిసి సంఘం నేతలు ఏకంగా సమావేశం పెట్టి మరీ క్రిష్ణయ్య తీరుపై విమర్శలు చేశారు. తీరు మార్చుకోవాలని క్రిష్ణయ్య ని హెచ్చరించారు కూడా. క్రిష్ణయ్య వ్యవహరశైలిలో మార్పు రాకుంటే కొత్త సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటామని కూడా వారు ప్రకటించిన పరిస్థితి.
మరీ ముఖ్యంగా క్రిష్ణయ్య పూర్తిగా జగన్ ఆధీనంలోకి వెళ్లిపోయారని, జగన్ ఎలా ఆడిస్తే అలా ఆడుతున్నారని బీసీ సంఘాల నేతలు విచారం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే బీసీ లు ఓ పార్టీకి బానిసత్వం చేయాల్సిన పరిస్థితి వస్తుందని ఆ సంఘ నేతలు ఆందోళన చెందుతున్నారు.
ఇక సామాన్యులు అయితే పదవి కోసం క్రిష్ణయ్య జగన్ తో జత కట్టాడు, బీసీ సంఘాలకు దూరమై ఒంటరవుతున్నాడు అంటూ చర్చించుకుంటున్నారు.
Political tensions are rising in Andhra Pradesh as clashes continue during the municipal election nomination…
SS Rajamouli's Varanasi is one of the most ambitious projects in Indian cinema, with Mahesh…