
రాజకీయ ప్రత్యర్థులను ఎన్నికల్లో ఓడించాలనుకోవడం పాత ఆలోచన. వారి సొంత నియోజకవర్గాల్లోనే ఓడించాలనుకోవడం కొత్త ట్రెండ్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుని కుప్పంలో, నారా లోకేష్‌ని మంగళగిరిలో, అచ్చెన్నాయుడుని టెక్కలిలో ఓడించాలని జగన్ చేసిన ప్రయత్నాలు అందరికీ తెలుసు.
అదేవిధంగా ఇప్పుడు వైసీపీ కంచుకోటలుగా భావించే అనంతపురం, నెల్లూరు, కడప, కర్నూలు, కోనసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆ పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడించి కూటమి పార్టీలు రాజకీయంగా పైచేయి సాధించాయి. ముఖ్యంగా జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలో కూటమి జెండాలు రెపరెపలాడించాయి.
ఇప్పుడు పొరుగు రాష్ట్రంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే ట్రెండ్‌ను అనుసరిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో ఇటీవల భారీ బహిరంగ సభ నిర్వహించారు. నేడు బీఆర్ఎస్ పార్టీ మూలస్తంభం వంటి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేటలో బహిరంగ సభ నిర్వహించబోతున్నారు.
అయితే ఆ నియోజకవర్గాలపై రాజకీయంగా పట్టు సాధించగలిగితే పర్వాలేదు. కానీ, కేవలం ప్రత్యర్థులను వారి సొంత నియోజకవర్గాల్లో దెబ్బతీయాలనే లక్ష్యంతో ఈ ప్రయత్నాలు చేస్తుంటే మాత్రం ఇది చాలా ప్రమాదకరమైన ట్రెండ్ అని చెప్పక తప్పదు.
ఎందుకంటే రాజకీయాల్లోనే కాదు.. ఏ రంగంలోనైనా ఎవరూ తమ స్థానాన్ని వదులుకోవడానికి ఇష్టపడరు. తమ స్థానానికి సవాలు ఎదురైనప్పుడు దానిని కాపాడుకునేందుకు సర్వశక్తులు ఒడ్డి పోరాడుతారు.
చంద్రబాబు నాయుడుని కుప్పంలో, నారా లోకేష్‌ని మంగళగిరిలో సవాలు చేసినందున వారు అక్కడే తమ ప్రత్యర్ధులను ఓడించి, భారీ మెజారిటీతో గెలిచి తమ సత్తా చాటుకోవడమే కాకుండా, రాజకీయంగా పైచేయి సాధించారు.
అదేవిధంగా కడపలో వైసీపీకి ఎదురైన రాజకీయ ఎదురుదెబ్బలు దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి కూడా రాబోయే శాసనసభ ఎన్నికల్లో సర్వశక్తులూ ఒడ్డి పోరాడి కూటమిపై పైచేయి సాధించేందుకు ప్రయత్నించడం ఖాయం.
తెలంగాణలో కూడా వచ్చే ఎన్నికల్లో ఇలాంటి పరిణామాలే చోటుచేసుకునే అవకాశం ఉంది. కనుక ఇల్లు అలకగానే పండగ కాదని రాజకీయ పార్టీలన్నీ గ్రహించడం మంచిది.
Congress MLA Komatireddy Rajagopal Reddy has once again created trouble for the party by making…
We are living in a society where negativity often spreads faster than positivity. This is…